
అప్పుల ఊబిలోనే రైతన్న
* రైతన్న పాలిట యమపాశంగా మారనున్న రుణమాఫీ
* చంద్రబాబు ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో ఇక ఐదేళ్లయినా అసలు తీరదు
* రూ.87 వేల కోట్లున్న వ్యవసాయ రుణాలకు ఆంక్షలు,
* పరిమితులు పెట్టి రూ.15 వేల కోట్లకు కుదించిన బాబు సర్కారు
* కోటికిపైగా ఉన్న ఖాతాలను 22 లక్షలకు కుదించి మాఫీ అంటూ హడావిడి
* రూ.12,800 కోట్ల వడ్డీ ఉంటే మాఫీకి రూ.5 వేల కోట్లే ఇస్తామన్న చంద్రబాబు
* తొలి విడతగా 20%, మిగతాది నాలుగేళ్లలో 4 విడతలుగా చెల్లిస్తామన్న ప్రభుత్వం
* బాబు మాటలు నమ్మి రుణాలు కట్టక దగాపడ్డ రైతన్న
సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీ పథకం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి తీరని శాపంగా మారబోతోంది. ఐదేళ్ల తర్వాత కూడా తీసుకున్న రుణం తీరకపోగా.. మళ్లీ మొదటికే వచ్చి అన్నదాతను మరింత అప్పుల ఊబిలోకి నెట్టనుంది. చంద్రబాబును నమ్ముకున్న రైతులు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకుండా డిఫాల్టర్లుగా మారిపోతున్నారు. కొత్తగా రుణాలు పొందే అర్హతను కోల్పోతున్నారు. ఆపదలో ఆదుకునే పంటల బీమా ప్రభుత్వ నిర్వాకంతో అందకుండా పోయింది. రైతులు సక్రమంగా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాల మంజూరుకు వెనుకంజ వేస్తున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.56 వేల కోట్ల రుణాల మంజూరును లక్ష్యంగా పెట్టుకున్న బ్యాంకులు.. పేరుకుపోయిన బకాయిల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.10 వేల కోట్ల రుణాలు కూడా ఇవ్వలేకపోయాయి. వెరసి మొత్తం పరపతి వ్యవస్థ కుప్పకూలిపోయింది. వ్యవసాయ రుణాలకు సంబంధించి రాష్ట్రంలో కోటికిపైగా ఖాతాలు ఉండగా, వాటిపై మొత్తం రూ.87,612 కోట్ల రుణాలున్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాతే చంద్రబాబు రుణాలన్నీ మాఫీ చేస్తామనే హామీ ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
చంద్రబాబు మాఫీ చేస్తారన్న నమ్మకంతో రైతులెవరూ రుణాలు చెల్లించలేదు. సకాలంలో రుణాలు చెల్లించని కారణంగా ఆ రుణాలపై రైతాంగంపై 12,800 కోట్ల రూపాయల అపరాధ వడ్డీ భారం పడింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలలపాటు కాలయాపన చేసి ఆంక్షలు, పరిమితులు, షరతులు అంటూ చివరకు కేవలం 22 లక్షల ఖాతాలను మాత్రమే రుణ మాఫీకి పరిగణనలోకి తీసుకున్నారు. ఆ ఖాతాలకు ఏటా 20 శాతం చొప్పున చెల్లించి వచ్చే ఐదేళ్లలో రుణ విముక్తులను చేస్తామని ప్రకటించారు. కానీ బడ్జెట్‌లో చూపినట్టుగా ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తున్నట్టు ప్రకటించింది. రుణమాఫీ మొత్తాన్ని రూ.87 వేల కోట్ల నుంచి ఏకంగా రూ.15 వేల కోట్లకు కుదించారు. చివరకు ఈ 22 లక్షల ఖాతాలకు కూడా రుణమాఫీ పూర్తిగా వర్తింపజేయడం లేదు. ఇదంతా చూస్తే ప్రభుత్వం రుణమాఫీ చేస్తోందా? వడ్డీ మాఫీ చేస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి అరకొరగా వచ్చే డబ్బును బ్యాంకులు రైతుల వడ్డీ కింద సర్దుబాటు చేస్తున్నాయి. 12,800 కోట్ల రూపాయల వడ్డీ ఉండగా, 5 వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులకు వడ్డీ భారం కూడా తీరడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే అయిదేళ్లకు లెక్కలేసి చూస్తే రైతుల ఖాతాల్లో రుణ బకాయి అలాగే ఉండిపోయే పరిస్థితి కన్పిస్తోంది.
తొలి విడత చెల్లింపుతో బయటపడుతున్న అసలు రంగు
రుణ మాఫీ కింద తొలి విడతగా 20 శాతం చెల్లిస్తున్నామని, మిగిలిన సొమ్మును మరో నాలుగేళ్లలో నాలుగు విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతులందరూ రుణమాఫీ అవుతుందన్న భ్రమల్లో పడిపోయారు. తీరా బ్యాంకుల వద్దకు వెళ్లాక ఇందులోని అసలు మాయ ఏంటో బయటపడుతోంది. ప్రభుత్వం చెబుతున్న అయిదేళ్ల తర్వాత కూడా బ్యాంకుల్లో రైతుల రుణాలు అప్పు అసలు అలాగే పేరుకుపోయే పరిస్థితులున్నాయి. అరకొరగా కొంతమంది రైతులకు అయిదేళ్ల తర్వాత అది కూడా కొంత మేరకు ఊరట ఉంటుందేమో కానీ మెజారిటీ రైతుల అప్పు అసలంతా బ్యాంకుల్లో బకాయి తేలుతోంది. అలా బకాయి పడిన కారణంగా రైతన్నలు త్వరలోనే బ్యాంకు రికార్డుల్లో డిఫాల్టర్లుగా నమోదు కాబోతున్నారు.
చంద్రబాబు మాటలు నమ్మి ఇంతకాలం రుణాలు, దానిపై పడిన వడ్డీ చెల్లించని కారణంగా భారం తడిసిమోపెడైంది. సర్కారు నిర్వాకం కారణంగా రుణ పరపతి క్రమం దెబ్బతినడం, రైతులపై అపరాధ వడ్డీ భారం పడటం, ఆ భారాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం వెరసి రైతులు చిక్కుల్లో పడ్డారు. ఆంక్షలు, పరిమితులు, షరతులు ఇలా రకరకాలుగా జాబితాను కుదిస్తూ కుదిస్తూ చివరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త మెలిక పెట్టి మొత్తం వ్యవహారాన్ని గందరగోళంగా మార్చింది. ప్రభుత్వం తన భారాన్ని తగ్గించుకోవడానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ మెలిక పెట్టి రైతుల రుణాలకు ఎగనామం పెడుతుండగా, రుణాలిచ్చే విషయంలో తిరిగి ఇదే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు బ్యాంకులు పరిమితం కావలసి వస్తుంది. తద్వారా భవిష్యత్తులో రైతులకు బ్యాంకులు అప్పులిచ్చే పరిస్థితి కూడా ఉండదు.
మాఫీ నుంచి తప్పించుకోనున్న సర్కారు
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలతో రైతులు తీసుకున్న రుణ బకాయిలను సగానికి సగం తగ్గించారు. ఆ సగంలో కూడా ప్రస్తుతం 20 శాతం ప్రభుత్వం చెల్లిస్తోంది. అది కూడా ఇప్పటివరకు అయిన వడ్డీని ఏ మాత్రం లెక్కలోకి తీసుకోలేదు. గత ఏడాది డిసెంబర్ వరకు అసలు, వడ్డీని మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ఆ మొత్తంలో 20 శాతం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగతా 80 శాతం మొత్తాన్ని వడ్డీతో సహా ఆయా రైతులే రుణ బకాయిలను చెల్లించుకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. తొలుత ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉన్న రుణ బకాయిలను మొత్తం వడ్డీతో చెలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. గత ఏడాది డిసెంబర్ వరకు తీసుకున్న, అప్పటివరకు చెల్లించకుండా బకాయిలుగా ఉన్న అప్పులకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని పేర్కొంది.
ఆ రుణాలపై ఇప్పటి వరకు ఉన్న వడ్డీ కూడా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినా తీరా ఇప్పుడు రుణ మాఫీలో ఆ విషయాన్ని వదిలేసింది. కేవలం గత ఏడాది డిసెంబర్ వరకు ఉన్న వడ్డీనే పరిగణనలోకి తీసుకుంది. దాంతో రైతులు జనవరి నుంచి నవంబర్ వరకు ఉన్న వడ్డీని భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం చెల్లించి మిగతా 80 శాతం రైతుల రుణ బకాయిలను చెల్లించుకునే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోంది. రైతు సాధికారత సంస్థను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆ సంస్థ ద్వారా హామీ పత్రాలు (నాలుగేళ్లకు నాలుగు) ఇవ్వడంతో ఇక రుణ మాఫీ నుంచి పూర్తిగా తప్పుకోనున్నారు. ఆ పత్రాలు జారీ చేయడంతో రుణ మాఫీ అన్నది బ్యాంకులు, రైతులకు మాత్రమే సంబంధించిన విషయమని, ప్రభుత్వం తన పని తాను చేసిందని చెప్పబోతోంది.
సర్కారు చెల్లింపు వడ్డీకే సరి
రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ వరకే వడ్డీని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను వర్తింప చేయడంతో ఇప్పుడిస్తున్న 20 శాతం నిధులు కూడా రైతుల రుణ బకాయిల అపరాధ వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. ఆ కారణంగా రైతుల రుణాలు రెన్యువల్ అయ్యే అవకాశం కూడా కోల్పోతున్నారు. మిగతా వడ్డీని రైతులు చెల్లిస్తేనే వారి రుణాలను రెన్యువల్ చేసుకోవడానికి బ్యాంకులు అవకాశమిస్తాయి. ప్రభుత్వం నాలుగు పత్రాలు ఇచ్చింది కదా నాలుగేళ్లలో ఆ బకాయిలకయ్యే మొత్తాన్ని రైతు సాధికారిక కార్పొరేషన్ ఇస్తుందనుకుంటే రైతులు మోసమోయినట్లేనని బ్యాంకర్లు విడమరిచి చెబుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకు మిగిలిన రుణ బకాయిలకే హామీ పత్రాలు ఇస్తుందని, మిగతా రుణాలను, ఆ రుణాలపై వడ్డీని రైతులే చెల్లించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. నాలుగు పత్రాలు ఇచ్చారు కదా నాలుగేళ్లలో రుణం తీరుతుందని రైతులు అనుకుంటే పొరపాటే. నాలుగుగేళ్లు అయినా రుణం తీరకపోగా ఈ నాలుగేళ్లతో కొత్తగా అప్పుపుట్టడం ఉండదు. పైగా వడ్డీల బారిన పడి అప్పులు ఊబిలో కూరుకుపోతారు.
కృష్ణా జిల్లాలో ఒక రైతు ఎదుర్కొన్న పరిస్థితి ఇదీ
కృష్ణా జిల్లాలోని ఒక రైతు తన రెండెకరాల పొలం సేద్యం చేయడానికి బ్యాంకు నుంచి 50 వేల రూపాయల అప్పు తీసుకోగా సకాలంలో చెల్లించని కారణంగా మొదటి ఏడాది 7 శాతం వడ్డీ భారం పడింది. అంటే 50 వేలకు 3,500 రూపాయలు వడ్డీ అవుతుంది. అంటే అప్పు మొత్తం 53,500 అయ్యింది. రెండో సంవత్సరంలో వడ్డీ 14 శాతం పడుతుంది. 14 శాతమంటే మరో 7,490 రూపాయల భారం పడుతుంది. అప్పుడు అసలు, వడ్డీ కలిపి 60,990 రూపాయలవుతుంది. అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ప్రభుత్వం కొత్తగా చెబుతున్న స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఆ రైతుకు ఎకరాకు 19 వేల చొప్పున రెండెకరాలకు 38 వేల రూపాయలు మాత్రమే రుణ అర్హత ఉందని, ఆ రుణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. (పంటల ఆధారంగా ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పరిగణనలోకి తీసుకుంది) ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికన ఏటా 20 శాతం చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది.
ఇప్పుడు తొలి విడతలో ప్రభుత్వం చెల్లిస్తామన్న 20 శాతమంటే...7,600 రూపాయలే. రైతుకు ఉన్న మొత్తం అప్పు 60,990 నుంచి 7,600 రూపాయలను బ్యాంకులు మాఫీ చేస్తాయి. మాఫీ అయిన డబ్బు తీసివేయగా అప్పటి కీ ఆ రైతు 53,390 (అసలు రూ.50 వేలే) బకాయి ఉంటాడు. దీనిపై ఆ వచ్చే ఏడాది మరో 14 శాతం అపరాధ వడ్డీ భారం పడుతుంది. అంటే 7,474 రూపాయలు వడ్డీ పడుతోంది. అసలు వడ్డీ కలిపి తిరిగి 60,864 రూపాయలకు చేరుతుంది. రెండో విడతలో ప్రభుత్వం ఇచ్చిన హామీ పత్రం బ్యాంకులో సమర్పిస్తే మరో 7600 రూపాయలు మాఫీ చేస్తారు. అలా మాఫీ అయిన సొమ్ము పోగా తిరిగి 53,264 రూపాయల అప్పు అలాగే మిగిలిపోతుంది. వచ్చే అయిదేళ్ల పాటు ఇలాగే సాగుతుంది. ఈ లెక్కన రైతుల అసలు రుణం తీరకపోగా మరింత భారంగా మారుతుంది. ప్రతి ఏటా 14 శాతం అపరాధ వడ్డీ పెరుగుతుంటే, ప్రభుత్వం హామీ పత్రం రూపేణా ఇచ్చే మొత్తం ఆ వడ్డీకి కూడా సరిపోదు. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో రైతుల పరిస్థితి కూడా ఇదే.