సాక్షి, హైదరాబాద్: రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బ్యాంకులు వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలు తదితర స్వల్పకాలిక అవసరాలకు ఇచ్చే పంట రుణాలకు మాత్రమే బ్యాంకులు పరిమితమవుతున్నాయి. భూమి చదును, బావుల తవ్వకం, బోర్లు వేయడం, పంపుసెట్లు కొనడం ఇలా రైతుకు ఉపయోగపడే అనేక అవసరాలకు అందజేయాల్సిన దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల నుంచి బ్యాంకులు పక్కకు జరుగుతున్నాయని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. స్వల్పకాలిక రుణాలతో పోలిస్తే, దీర్ఘకాలిక రుణాలకు బ్యాంకులు ఇస్తున్న ప్రాధాన్యం ఏటేటా తగ్గుతోంది. దీంతో రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో పంట రుణాలను సకాలంలో ఇవ్వడానికే బ్యాంకులు నానా యాగీ చేస్తుండటంతో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల విషయాన్ని ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడంలేదు.
భూమి చదునుకు లేదు... పోడు భూముల అభివృద్ధి లేదు
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. వివిధ పథకాల కోసం రైతులు తమ వాటాగా చెల్లించాల్సిన సొమ్మును కూడా బ్యాంకు రుణం ద్వారానే చెల్లిస్తుంటారు. ఉద్యాన, పాడి, మత్స్య, కోళ్ల పరిశ్రమ వంటి రంగాలు, అలాగే సాగుకు సంబంధించి బోర్లు వేయడానికి, సూక్ష్మసేద్యం పరి కరాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, భూమి చదును చేయడానికి ఎక్కువగా దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. పోడు భూముల అభివృద్ధికి కూడా దీర్ఘకాలిక రుణాలే తీసుకుంటారు. అయితే, దీర్ఘకాలిక రుణాలు తగ్గిపోవడంతో పోడు భూములు అభివృద్ధి చేసుకునే పరిస్థితే లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో భూమి చదును చేసుకునేందుకు ఆర్థికంగా ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. సూక్ష్మసేద్యం కోసం రుణాలు తీసుకోవాలన్నా బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది.
ఏడేళ్లలో 188%నుంచి 21%వరకు పతనం
పంట రుణాలను ప్రతీ ఏడాది రైతులు రెన్యూవల్ చేసుకోవాలి. ఆ రుణాలకు ఏడు శాతం వడ్డీ చెల్లించాలి. ఈ రుణాలను రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలను బ్యాంకులు 11 శాతం వడ్డీతో రైతులకు ఇస్తాయి. మూడు నుంచి ఐదేళ్లలో ఈ రుణాలను తీర్చితే సరిపోతుంది. వివిధ వ్యవసాయ పథకాలకు రైతు వాటా కింద ఈ రుణాలను తీసుకోవచ్చు. రూ. 2 లక్షల నుంచి 3 లక్షలు.. ఇలా ఎంతైనా తీసుకునే వెసులుబాటుంది. అంతేగాక గ్రీన్‌హౌస్ వంటి ప్రభుత్వ పథకమైతే రైతు తన వాటా కింద ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించాలి.
ఈ నేపథ్యంలో రూ.10–20 లక్షలు కూడా ఇస్తారు. అయితే, బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలను పెద్దగా ఇవ్వడం లేదు. గతంలో 2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో దీర్ఘకాలిక రుణ లక్ష్యం రూ. 5,890 కోట్లు కాగా, బ్యాంకులు లక్ష్యానికి మించి రూ.11,112 కోట్ల వరకు ఇచ్చాయి. అంటే 188.65 శాతం రుణాలు ఇచ్చాయి. అలాంటిది 2017–18 ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక పంట రుణాల లక్ష్యం రూ.14,512 కోట్లు కాగా, కేవలం రూ. 3,118 కోట్లే ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తమ నివేదికలో వెల్లడించాయి. అంటే, లక్ష్యంలో కేవలం 21.48 శాతమే అందజేశాయి. దీర్ఘకాలిక రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చేపట్టే అనేక పథకాల్లో రైతులకు తమ వాటా చెల్లించేందుకు డబ్బులు అందని పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment