10 రోజుల్లోనే ఎస్‌బీఐ గృహరుణాలు
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ మరింత వేగవంతంగా గృహరుణాలు మంజూరు చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘ప్రాజెక్ట్ తత్కాల్’ ప్రారంభించింది. దీని కింద హోమ్ లోన్ దరఖాస్తు, సంబంధిత పత్రాలు అందిన 10 రోజుల్లోగా ఎస్‌బీఐ రుణం మంజూరు చేస్తుంది. గృహ రుణాల వ్యాపారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్ట్ తత్కాల్ అమలు చేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. హోమ్ లోన్ దరఖాస్తులను అప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ఆమోదించేందుకు ఎస్‌బీఐ ఇటీవలే ఆన్‌లైన్ కస్టమర్ అక్విజిషన్ సొల్యూషన్ (ఓసీఏఎస్)ను అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం ముప్పై లక్షల పైచిలుకు హోమ్ లోన్ కస్టమర్లకు దాదాపు రూ. 16,60,000 కోట్ల మేర రుణాలను బ్యాంకు ఇచ్చింది.