National Infrastructure Manufacturing Zone
-
మౌలికానికి బ్యాంకింగ్ సహకారం కీలకం
న్యూఢిల్లీ: మౌలిక రంగ లక్ష్యాల సాధనకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సహకారం ఎంతో అవసరమని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న రూ. 111 లక్షల కోట్ల నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ (ఎన్ఐపీ) ప్రాజెక్ట్ లక్ష్యాల సాధనకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇన్ఫ్రా ప్రాజెక్టుల అవసరాలకు అనుగుణంగా తగిన ప్రొడక్టులకు రూపకల్పన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) 18వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జోషి చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ► దేశంలో అన్ని రంగాల పురోగతికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక అనుసంధానకర్త లాంటిది. అందువల్ల ఈ రంగం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎంఐ) వంటి ఇతర కార్యక్రమాలతో పాటు భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో ఎన్ఐపీ కీలక పాత్ర పోషించనుంది. ► పీఎం గతిశక్తి పోర్టల్ ఆధ్వర్యంలో మొత్తం రూ.111 లక్షల కోట్ల కేటాయింపులతో ఎన్ఐపీ ప్రాజెక్టులను పర్యవేక్షించడం జరుగుతోంది. 6,800 ప్రాజెక్ట్‌లతో ప్రారంభమైన ఎన్ఐపీ, ఇప్పుడు 34 ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్ సెక్టార్లను కవర్ చేస్తూ 9,000 ప్రాజెక్ట్‌లకు విస్తరించింది. ► ఈ ప్రాజెక్టులకు పెట్టుబడిలో 44 శాతం కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ల ద్వారా నిధులు సమకూరుస్తున్నా యి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు దాదాపు 30 శాతం వాటాతో ఈ ప్రాజెక్టుల ఫైనాన్సింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం. ► ఎన్ఐపీ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు క్రియాశీలంగా, పరస్పర సహకారంతో పనిచేసే విధానాన్ని అవలంబించాలి. అప్పుడే పెట్టుబడుల అవసరాలు తీరతాయి. జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు సకాలంలో అందుబాటులోకి వస్తాయి. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కోసం అవసరమైన బాండ్లు, డెరివేటివ్ మార్కెట్ల అభివృద్ధిసహా దేశంలో దీర్ఘకాలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రుణ వనరుల అభివృద్ధికి 2021లో ప్రభుత్వం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (ఎన్ఏబీఎఫ్ఐడీ)ని ఏర్పాటు చేసింది. ఎన్ఏబీఎఫ్ఐడీ కోసం ప్రభుత్వం రూ. 20,000 కోట్ల ఈక్విటీ మూలధనం,రూ. 5,000 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేసింది. మౌలికరంగంలో పురోగతికి ఈ చర్య ఎంతో దోహదపడింది. ► మౌలిక రంగం పురోగతికి పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థలు వ్యాపారాన్ని విస్తరించడానికి ఒకదాని ప్రయత్నాలకు మరొకటి ప్రభావితం కాకుండా, ప్రత్యామ్నాయంగా ఈక్విటీ– డెట్ ప్రొడక్టుల మిశ్రమాన్ని ప్రాజెక్టులకు అందించడం ముఖ్యం. ► ప్రాజెక్ట్‌ల వాస్తవ అవసరాలతో అనుసంధానమైన రుణ ప్రొడక్టుల రూపకల్పన అవసరం. ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న సబ్ సెక్టార్లలో ప్రాజెక్టులకు సేవలందించే సంస్థాగత సామర్థ్యాన్ని నిరంతరం మందింపు చేయాలి. ఇక్కడ ప్రభుత్వ రంగ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ వంటి సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను తట్టుకుంటున్న ఎకానమీ భారత్ ఎకానమీ అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను తట్టుకొని పటిష్టంగా నిలబడగలుగుతోందని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి పేర్కొన్నారు. భారత్ ఎకానమీ 2022–23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను తాజాగా 6.5 శాతం నుంచి 6.9 శాతానికి ప్రపంచ బ్యాంక్ పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని భారత్ ఎకానమీ నిలబడగలగడమే తాజా 40 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) అంచనా పెంపునకు కారణమని పేర్కొన్నారు. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్నట్లు పేర్కొన్నారు. 10 నెలల తర్వాత నవంబర్‌లో ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం దిగువకు (5.8 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే టోకు ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్టం 8.39 శాతానికి దిగివచ్చిన విషయాన్నీ గుర్తుచేశారు. -
ఈ నెల 13న గతి శక్తి ప్లాన్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: కనెక్టివిటీపరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన గతి శక్తి–నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఐఎంపీ)ని ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 13న ఆవిష్కరించనున్నారు. పరిశ్రమల్లో ఉత్పాదకత పెరిగేందుకు, స్థానిక తయారీదారులకు తోడ్పాటు అందించేందుకు, పరిశ్రమలో పోటీతత్వం పెంచేందుకు అలాగే భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక మండళ్లను తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇన్ఫ్రా కనెక్టివిటీ ప్రాజెక్టుల సమన్వయం కోసం 16 శాఖలు 2024–25 నాటికి పూర్తయ్యే ప్రాజెక్టుల వివరాలను గతిశక్తి డిజిటల్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంచుతాయి. వీటిలో హై రిజల్యూషన్‌తో ఉపగ్రహ చిత్రాలు, మౌలిక సదుపాయాలు, స్థలం, లాజిస్టిక్స్, పాలనాపరమైన సరిహద్దులు మొదలైనవి ఉంటాయి. వివిధ రవాణా సాధనాల మధ్య ప్రస్తుతం సమన్వయం లేదని, వీటిని సమన్వయపర్చే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను గతి శక్తి తొలగించగలదని అధికారులు వివరించారు. -
రంగంపేట వద్దే మెగాసిటీ
ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో ‘నిమ్జ్’ ఏర్పాటుకు ప్రతిపాదన 11,282 ఎకరాల అటవీ భూమి డీ-నోటిఫైకి నివేదిక తయారీ తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్ద మెగా సిటీ నిర్మించాలని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి సూ చించింది. ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ (నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చింది. మెగాసిటీ, నిమ్జ్ ఏర్పాటుకు 39,931 ఎకరాల ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూములు తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు వారం రోజుల క్రితం ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపారు. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు జిల్లాను చేర్చుతూ 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణపట్నం నౌకాశ్రయం సమీపంలో ఉండడం, సోమశిల, కండలేరు జలాశయాలు అందుబాటులో ఉండడం, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం ప్రతిపాదన ఉన్న దృష్ట్యా శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాలు పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని అప్పట్లో కేంద్రం తేల్చింది. ఏర్పేడు- శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన బిల్లులో కూడా యూపీఏ సర్కారు పేర్కొంది. నిమ్జ్‌కు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో అప్పట్లో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. నిమ్జ్ ఏర్పాటుకు కట్టుబడినట్లు నరేంద్రమోదీ సర్కారు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఏడీబీ బృందం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమై నిమ్జ్ ఏర్పాటుపై చర్చించింది. రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేక వ్యక్తమవకుండా చూడాలనే లక్ష్యంతో సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో కీలకమైన ప్రకటన చేశారు. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నిమ్జ్, మెగాసిటీ, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు అటవీ భూమిని డీ-నోటిఫై చేసేందుకు సహకరిస్తామని విభజన బిల్లులోనే కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, బీఎన్ కండ్రి గ, కేవీబీ పురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో అటవీ, ప్రభుత్వ, డీకేటీ భూములను గుర్తించాలని ఆదేశించింది. తిరుపతికి పది కి.మీల పరిధిలో అటవీ భూములను డీ-నోటిఫై చేసేందుకు ప్రతిపాదనలు పంపే బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. మెగాసిటీకి 4,290 ఎకరాలు తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలం రంగంపేట వద్ద 464 ఎకరాల డీకేటీ, 148 ఎకరాల ప్రభుత్వ, 3678 ఎకరాల అటవీ వెరసి 4290 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. రేణిగుంట, వడమాలపేట మండలాల్లో అటవీ భూములు డీ-నోటిఫై చేసే స్థాయిలో అందుబాటులో లేవని తేల్చారు. రంగంపేట వద్ద ప్రైవేటు భూమి కూడా మరో నాలుగు వేల ఎకరాలను సేకరించవచ్చుననే అంచనాకు వచ్చారు. ఒక్క రంగంపేట వద్ద మాత్రమే ఎనిమిది వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండటం, కళ్యాణి డ్యాం దగ్గరలోనే ఉండటం దృష్ట్యా మెగా సిటీ ఏర్పాటుకు ఇదే అనుకూలమైన ప్రాంతమని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. రెవెన్యూ, అటవీ, పురపాలక శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ నియమించి రంగంపేట ప్రాంతంలో మెగాసిటీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం తేల్చనుంది. ఆ తర్వాత డీపీఆర్‌ను తయారీకి గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం ఉందని తుడా అధికారవర్గాలు పేర్కొన్నాయి. నిమ్జ్‌కు 19 వేల ఎకరాలు శ్రీకాళహస్తి మండలంలో 1900 ఎకరాల డీకేటీ, 2940ఎకరాల ప్రభుత్వ, 840 ఎకరాల అటవీ మొత్తం 5680 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జేసీ కమిటీ తేల్చింది. ఏర్పేడు మండలంలో 6980 ఎకరాల డీకేటీ, 1105 ఎకరాల ప్రభుత్వ, 5,300 ఎకరాల అటవీ వెరసి 13,385 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు తేల్చారు. రెండు మండలాల్లోనూ 19,065 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి సౌకర్యం, నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గాన్ని పూర్తిచేస్తే నిమ్జ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏర్పేడు మండలంలోనే ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు ఇప్పటికే 990 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపడం, కేంద్రం ఆమో దం తెలిపిన విషయం విదితమే. బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి మండలాల్లో 11,282 ఎకరాల అటవీ భూమిని డీ-నోటిఫై చేసేం దుకు అవసరమైన ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి కలెక్టర్ పంపారు. ఈ ప్రతిపాదనను యథాతథంగా ప్రభుత్వం కేంద్రానికి పంపనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.