రంగంపేట వద్దే మెగాసిటీ | Rangampeta at the Megacity | Sakshi
Sakshi News home page

రంగంపేట వద్దే మెగాసిటీ

Published Sun, Dec 7 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

Rangampeta at the Megacity

ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో ‘నిమ్జ్’ ఏర్పాటుకు ప్రతిపాదన
11,282 ఎకరాల అటవీ భూమి డీ-నోటిఫైకి నివేదిక తయారీ

 
 తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్ద మెగా సిటీ నిర్మించాలని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి సూ చించింది. ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ (నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చింది. మెగాసిటీ, నిమ్జ్ ఏర్పాటుకు 39,931 ఎకరాల ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూములు తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు వారం రోజుల క్రితం ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపారు. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు జిల్లాను చేర్చుతూ 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణపట్నం నౌకాశ్రయం సమీపంలో ఉండడం, సోమశిల, కండలేరు జలాశయాలు అందుబాటులో ఉండడం, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం ప్రతిపాదన ఉన్న దృష్ట్యా శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాలు పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని అప్పట్లో కేంద్రం తేల్చింది. ఏర్పేడు-     శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన బిల్లులో కూడా యూపీఏ సర్కారు పేర్కొంది.

నిమ్జ్‌కు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో అప్పట్లో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. నిమ్జ్ ఏర్పాటుకు కట్టుబడినట్లు నరేంద్రమోదీ సర్కారు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఏడీబీ బృందం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమై నిమ్జ్ ఏర్పాటుపై చర్చించింది. రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేక వ్యక్తమవకుండా చూడాలనే లక్ష్యంతో సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో కీలకమైన ప్రకటన చేశారు. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నిమ్జ్, మెగాసిటీ, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు అటవీ భూమిని డీ-నోటిఫై చేసేందుకు సహకరిస్తామని విభజన బిల్లులోనే కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, బీఎన్ కండ్రి గ, కేవీబీ పురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో అటవీ, ప్రభుత్వ, డీకేటీ భూములను గుర్తించాలని ఆదేశించింది. తిరుపతికి పది కి.మీల పరిధిలో అటవీ భూములను డీ-నోటిఫై చేసేందుకు ప్రతిపాదనలు పంపే బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది.
 మెగాసిటీకి 4,290 ఎకరాలు
 తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలం రంగంపేట వద్ద 464 ఎకరాల డీకేటీ, 148 ఎకరాల ప్రభుత్వ, 3678 ఎకరాల అటవీ వెరసి 4290 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. రేణిగుంట, వడమాలపేట మండలాల్లో అటవీ భూములు డీ-నోటిఫై చేసే స్థాయిలో అందుబాటులో లేవని తేల్చారు. రంగంపేట వద్ద ప్రైవేటు భూమి కూడా మరో నాలుగు వేల ఎకరాలను సేకరించవచ్చుననే అంచనాకు వచ్చారు. ఒక్క రంగంపేట వద్ద మాత్రమే ఎనిమిది వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండటం, కళ్యాణి డ్యాం దగ్గరలోనే ఉండటం దృష్ట్యా మెగా సిటీ ఏర్పాటుకు ఇదే అనుకూలమైన ప్రాంతమని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. రెవెన్యూ, అటవీ, పురపాలక శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ నియమించి రంగంపేట ప్రాంతంలో మెగాసిటీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం తేల్చనుంది. ఆ తర్వాత డీపీఆర్‌ను తయారీకి గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం ఉందని తుడా అధికారవర్గాలు పేర్కొన్నాయి.

 నిమ్జ్‌కు 19 వేల ఎకరాలు

 శ్రీకాళహస్తి మండలంలో 1900 ఎకరాల డీకేటీ, 2940ఎకరాల ప్రభుత్వ, 840 ఎకరాల అటవీ మొత్తం 5680 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జేసీ కమిటీ తేల్చింది. ఏర్పేడు మండలంలో 6980 ఎకరాల డీకేటీ, 1105 ఎకరాల ప్రభుత్వ, 5,300 ఎకరాల అటవీ వెరసి 13,385 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు తేల్చారు. రెండు మండలాల్లోనూ 19,065 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి సౌకర్యం, నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గాన్ని పూర్తిచేస్తే నిమ్జ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏర్పేడు మండలంలోనే ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు ఇప్పటికే 990 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపడం, కేంద్రం ఆమో దం తెలిపిన విషయం విదితమే. బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి మండలాల్లో 11,282 ఎకరాల అటవీ భూమిని డీ-నోటిఫై చేసేం దుకు అవసరమైన ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి కలెక్టర్ పంపారు. ఈ ప్రతిపాదనను యథాతథంగా ప్రభుత్వం కేంద్రానికి పంపనుందని అధికారవర్గాలు వెల్లడించాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement