Rangampeta
-
పొలం వివాదంలో ‘సమాజ సేవకుడు’ దారుణహత్య
రంగంపేట: తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి శ్రీనివాస్(37) ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుభద్రంపేట గ్రామానికి చెందిన ఏలూరి వెంకట్రావు కుమారులకు, సాధనాల ధర్మరాజుకు గ్రామంలోని పొలం సరిహద్దు వద్ద తాటి కట్టవ కారణంగా ఏడాదికాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పొలం సరిహద్దు గురించి ఏలూరి వెంకట్రావు కుమారుడు ఏలూరి శ్రీనివాస్‌కి సాధనాల ధర్మరాజుకి గొడవ జరిగి ఒకరిపైఒకరు దాడి చేసుకున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఏలూరి శ్రీనివాస్ ఇంటి వద్ద నుంచి వీరభద్రుని గుడి వైపు నడుచుకుంటూ వస్తుండగా సాధనాల ధర్మరాజు, అతని కుమారుడు సాధనాల వీరభద్రరావు అతనిపై దాడి చేశారు. కర్రతో దాడి చేసిన అనంతరం చాకుతో పొడిచాడు. దీంతో శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు 108కి ఫోన్ చేయగా వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్ పరీక్షించి చనిపోయినట్టుగా నిర్ధారించారు. మృతుడు చిన్నాన్న ఏలూరి గోపాలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంపేట ఇన్చార్జి ఎస్సై ఎ.ఫణికుమార్ కేసు నమోదు చేయగా, పెద్దాపురం సీఐ కేఎన్వీ జయకుమార్ ఘటనా స్ధలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నో సమాజ సేవలు దారుణ హత్యకు గురైన ఏలూరి శ్రీనివాస్ మంచి సమాజ సేవకుడిగా గుర్తింపు పొందాడు. హైదరాబాద్‌లోని ప్రయివేటు సిరామిక్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అమ్మ ఫౌండేషన్ స్థాపించి సుభద్రంపేటలోని పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి దేవీ విగ్రహం ఏర్పాటు చేసి ఏటా వసంత పంచమినాడు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించి విద్యార్థులకు విద్యా సామగ్రితో పాటు యూనిఫాంలను కూడా అందించేవాడు. హైదరాబాద్‌లోని బొల్లారంలో నాలుగు రోజుల కిందట జరిగిన బోనాల ఉత్సవాల్లో శ్రీనివాస్‌ను సత్కరించారు. అక్కడ నుంచి కుటుంబ సభ్యులను చూడటానికి శుక్రవారం రాత్రే గ్రామానికి వచ్చాడు. హైదరాబాద్‌లోనే ఉండిపోయినా ప్రాణాలతో మిగిలేవాడని కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. శ్రీనివాస్ భార్య విజయలక్ష్మీ, కుమారుడు అక్షయ్ హైదరాబాద్‌లోనే ఉన్నారని ఈ విషయం వారిద్దరికీ ఎలా చెప్పాలని కన్నీరుమున్నీరవుతున్నారు. -
3 నెలల క్రితం పెళ్లి, రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి
పూతలపట్టు (యాదమరి): రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన శనివారం రాత్రి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంపేటకు చెందిన పురుషోత్తం కుమారుడు మనోజ్ కుమార్ (24) జమ్మూకశ్మీర్‌లో జవాన్‌గా పనిచేస్తున్నారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ నెల 15 తర్వాత విధుల్లో చేరాల్సి ఉంది. కాగా, శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై సొంత పని మీద పూతలపట్టుకు వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా తిరుపతి నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్ అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పెళ్లయిన మూడు నెలలకే ప్రమాదంలో మృతి చెందడంతో జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
దళిత యువకుడిపై చేయి చేసుకున్న ఎస్ఐ, ఏఎస్ఐ
రంగంపేట (తూర్పు గోదావరి): దళిత యువకుడిపై ఇన్చార్జి ఎస్ఐ, ఏఎస్ఐ చేయిచేసుకున్న ఘటన తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పెదరాయవరం గ్రామానికి చెందిన మోర్త నవీన్ అనే యువకుడు గ్రామానికి చెందిన ఓ యువతిని వేధించినట్టు ఫిర్యాదు అందటంతో గురువారం రాత్రి అతడిని రంగంపేట పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతడిని విచారించే క్రమంలో ఇన్చార్జి ఎస్ఐ వి.కిశోర్, ఏఎస్ఐ సుబ్బారాయుడు చేయి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సుమారు 200 మంది దళితులు స్టేషన్‌కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఇరువర్గాల పెద్దలు రాజీ కుదిర్చిన తరువాత కూడా యువకుడిని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పెద్దాపురం సీఐ జయకుమార్ రంగంపేట చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఇన్చార్జి ఎస్ఐ కిశోర్, ఏఎస్ఐ సుబ్బారావులతో క్షమాపణ చెప్పించడంతో దళితులు ఆందోళన విరమించారు. ఇన్చార్జి ఎస్ఐని బాధ్యతల నుంచి తొలగించామని, అధికారుల సూచన మేరకు ఏఎస్ఐపై నివేదిక సమర్పిస్తామని సీఐ చెప్పారు. ఏఎస్ఐ ఆత్మహత్యాయత్నం: ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఏఎస్ఐ స్టేషన్ పక్కనే ఉన్న క్వార్టర్స్ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు లుంగీతో ఉరేసుకునేందుకు యత్నించారు. వెంటనే సీఐ జయకుమార్, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు తలుపులు పగులగొట్టి సుబ్బారావును రక్షించి కౌన్సెలింగ్ ఇచ్చారు. -
మహిళపై లైంగిక దాడి..
సాక్షి, రంగంపేట: పామాయిల్ తోటలో 40 ఏళ్ల మహిళపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సీహెచ్ సుధాకర్ తెలిపారు. ముకుందవరానికి చెందిన మహిళ సోమవారం ఉదయం కడుపు నొప్పితో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని తిరిగి వెళ్లేందుకు స్థానిక సంత మార్కెట్ వద్ద కూర్చుందని తెలిపారు. రంగంపేటకు చెందిన మాంసం విక్రయించే అమలదాసు వీరబాబు మోపెడ్‌పై వెళుతూ.. ముకుందవరం వెళుతున్నా.. వస్తావా అంటూ అడిగాడు. మోపెడ్‌పై ఆమెను తీసుకువెళుతూ మార్గం మధ్యలో కోరిక తీర్చాలని అడిగితే ఆమె నిరాకరించింది. చదవండి: స్మార్ట్‌గా వ్యభిచారం.. కాలేజీ యువతులు కూడా! దీంతో ముకుందవరం గ్రామ సమీపంలో ఉన్న పామాయిల్ తోటలోకి మోపెడ్‌ను తీసుకువెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆమె షాక్‌తో తోటలో గంటకు పైగా ఉండిపోయింది. ముకుందవరానికి చెందిన పత్తి శ్రీను అనే వ్యక్తి ద్వారా ఆమె మంగళవారం ముకుందవరం మహిళా పోలీసు మాచర్ల యాష్ణప్రియకు తెలిపింది. బాధితురాలిని ఆమె పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. పెద్దాపురం సీఐ జయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని ఎస్సై తెలిపారు. చదవండి: ప్రేమ వల; తల్లయిన పీయూసీ బాలిక -
చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు జోరు..
-
ఇంతకంటే సంతోషం ఏముంటుంది : మనోజ్
సంక్రాంతి పండగ సందర్భంగా హీరో మంచు మనోజ్‌కు సొంతూరు చిత్తూరు జిల్లాలోని రంగంపేటకు వెళ్లారు. ఈ క్రమంలో రంగంపేట చుట్టుపక్కల నుంచి ఆయనను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. తనకోసం వచ్చిన అభిమానలకు బిల్డింగ్ పైనుంచి అభివాదం చేసిన మనోజ్.. వారికి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల జరిగే కనుమ పండగ ఎప్పటికీ గుర్తుండిపోతుందని మనోజ్ అన్నారు. సొంత ఊరిలో పండగ జరుపుకోవడం కంటే సంతోషం ఏముంటందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోజ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘మా ఊరు(రంగంపేట) చుట్టుపక్కల నుంచి ఏమి ఆశించకుండ ఇక్కడకు వచ్చి నాపై ప్రేమ కనబరుస్తున్నందకు సంతోషంగా ఉంది. నాకు ఆశీస్సులు అందజేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్ సో మచ్’ అని మనోజ్ పేర్కొన్నారు. అలాగే రేణిగుంటలోని అభయక్షేత్రం అనాథశ్రమంకు వెళ్లిన మనోజ్ అక్కడి చిన్నారులతో సరదాగా గడిపారు. ఈసారి పండగ చాలా ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఎంతో ప్రతిభగల చిన్నారులతో గడపటం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తన చివరి వరకు ఆ పిల్లల కోసం ఉంటానని చెప్పారు. Overwhelmed to receive such an unconditional love from people around my village ‘A-Rangampeta’❤😍 I am very thankful to each and everyone for showering their blessings on me 🙏🙏🙏 Love you all so much ❤ #Blessed pic.twitter.com/bZRq6iRibD — MM*🙏🏻❤️ (@HeroManoj1) January 16, 2020 Love u more thammudu .... thanks for ur love and blessings :) 🙏🏻❤️ https://t.co/zZeUKbQ6nk — MM*🙏🏻❤️ (@HeroManoj1) January 16, 2020 -
రంగంపేటలో వేడుకగా జల్లికట్టు!
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా రంగంపేటలో జల్లికట్టు వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సంప్రదాయ క్రీడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల జనం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఇక్కడి వీధులన్ని కిక్కిరిసిపోయాయి. మేడలు, మిద్దెలు ఎక్కి జనం జల్లికట్టును ఆసక్తిగా తిలకిస్తున్నారు. సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన తనయుడు మనోజ్‌బాబు కూడా జల్లికట్టును తిలకించేందుకు ఇక్కడికి వచ్చారు. ఓ మిద్దెపై నుంచి వారు జల్లికట్టు ఉత్సవాన్ని తిలకించారు. ప్రస్తుతం జల్లికట్టు జోరుగా సాగుతోంది. జల్లికట్టులో భాగంగా పరిగెత్తుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే, ఈ వేడుకలో ఎప్పటిలాగే చిన్న చిన్న అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. దూసుకొస్తున్న కోడెగిత్తలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న గాయాలపాలవుతున్నారు. ఎద్దులను అదుపుచేసే క్రమంలో 20 మందికి గాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, జల్లికట్టు ఈ పేరు వినగానే చిత్తూరు జిల్లా కూడా గుర్తుకు వస్తుంది. పశువుల పండుగ పేరుతో నిర్వహించే ఈ జల్లికట్టుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఏటా సంక్రాంతి సందర్బంగా నిర్వహించే ఈ జల్లికట్టును తిలకించడాని వేలాదిమంది వస్తారు. చిత్తూరు జిల్లాలో జల్లికట్టు చాలా ప్రాంతాలలో జరుగుతున్నా... చంద్రగిరి మండలం రంగంపేట హైలెట్ గా నిలుస్తోంది. ఇవాళ ఉదయాన్నే పశువులకు పూజలు చేస్తారు. అనంతరం కోడిగిత్తలను అలంకరిస్తారు. కొమ్ముల మధ్య చెక్క పలకలు, కొమ్ములకు కొత్త తవళ్లు చూడతారు. గుంపులు గుంపులుగా వీధిలోకి వదులుతారు. కొమ్ములు తిరిగిన కోడె గిత్తలు పరుగులు తీస్తుంటే వాటిని నిలువరించడానికి యువకులు పోటీ పడతారు.. ప్రాణాలను సైతం లెక్క చేయరు. ఎందుకంటే కోడె గిత్తలను నిలువరించిన వారిని సాహస వంతులుగా ఈ ప్రాంత వాసులు భావిస్తుంటారు. అందుకే యువకుల కేరింతల మధ్య కోడె గిత్తలను పట్టుకోవడానికి పోటీ పడతారు. ఈ దృశ్యాలను తిలకించదానికి రంగంపేటకు వేలమంది హాజరవుతారు. ఇది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి జల్లికట్టును ఓ పండుగలా చేసుకొంటారు. -
రంగంపేటలో కోలాహలంగా జల్లికట్టు
సాక్షి, చంద్రగిరి: చిత్తూరు జిల్లా రంగంపేటలో కనుమ సందర్బంగా మంగళవారం ఉదయం పశువుల పోటీలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో జల్లికట్టు మాదిరి రంగంపేటలో పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామాల నుంచే కాక తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది ఈ పోటీలకు హాజరయ్యారు. రంగంపేట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. మిద్దెలపై నుంచి ప్రజలు ఎద్దుల పోటీలను ఉత్సాహంగా తిలకిస్తున్నారు. రైతులు పెంచుకునే ఎద్దులు, ఆవులను ఒక్కో వీధిలో ఒక్కో మందగా వదులుతున్నారు. ఇందులో కొన్ని ఎద్దులకు రంగుల పలకలు కట్టారు. ఆ ఎద్దులకు కట్టిన పలకను చేజిక్కుంచుకుంటే... విజయం సాధించినట్లే. దీనికోసం యువకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. -
దేశ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలి
తొగిట ఆశ్రమ పీఠాధిపతి పిలుపు - రంగంపేటలో ఆర్ఎస్ఎస్ ప్రాథమిక శిక్షావర్గ ముగింపు కొల్చారం: ప్రపంచంలోనే అత్యున్నత సంస్కృతి కలిగిన భారతీయ సంస్కృతిని దశదిశలా వ్యాపింపజేయాలని తొగిట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామీజి పిలుపునిచ్చారు. ఈనెల ఒకటి నుంచి రంగంపేటలో నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాథమిక శిక్షావర్గ శుక్రవారం ముగిసింది. చివరి రోజు శిక్షావర్గ సార్వజనికోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మాధవానంద సరస్వతీ స్వామీజి మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి మతాలకతీతంగా ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర టెస్కో డైరెక్టర్ అరిగె రమేష్ మాట్లాడుతూ... సమైక్యతే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. తెలంగాణ ప్రాంత ఆర్ఎస్ఎస్ కార్యవాహ ఎక్క చంద్రశేఖర్ మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ బోల నాగభూషణం, కొల్చారం మండల శిక్షావర్గ కార్యవాహ వంజరి వెంకటేశం, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. - -
కలగా గోదాం నిర్మాణం
- రంగంపేట పీఏసీఎస్ ప్రతిపాదనలు బుట్టదాఖలు కొల్చారం : జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రంగంపేట సంఘానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడు గ్రామాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న రంగంపేట పీఏసీఎస్ 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ సంఘం పరిధిలో రంగంపేట, సంగాయిపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్, ఎనగండ్ల గ్రామాలు కొనసాగుతు ఉన్నాయి. రైతులు తాము పండించిన పంటలను అమ్మేందుకు రంగంపేట పీఏసీఎస్‌కు తీసుకువస్తారు. ఈ పరిస్థితుల్లో కొనుగోలు కోసం తెచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు గోదాం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో పాటు ఉండటానికి కూడా నిలువ నీడలేని పరిస్థితి నెలకొంది. నాలుగున్నర ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ప్రస్తుతం చిన్న గదుల్లోనే సహకార సంఘాన్ని కొనసాగిస్తున్నారు. గోదాం నిర్మాణం కోసం గత ఐదేళ్ల నుంచి ఇక్కడి సహకార సంఘం పాలకవర్గం చేస్తున్న ప్రతిపాదనలు, విన్నపాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఏడాదిన్నర క్రితం గోదాం నిర్మించేందుకు జిల్లా డీసీసీ అధికారులు , స్థానిక పాలకవర్గం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లింది. గోదాం నిర్మాణానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. ఇప్పటికైనా జిల్లా సహకార సంఘం అధికారులు, పాలకవర్గం స్పందించి గోదాము నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
ఇంగ్లిషు టీచరునవుతా
రంగంపేట : కృషి, పట్టుదలతోపాటు చలించని ఆత్మబలం ఉంటే అద్భుత విజయాలు సాధించవచ్చునని చెబుతోంది మండలంలోని సింగంపల్లి హైస్కూల్ టెన్త్ విద్యార్థిని దేవిశెట్టి రోజారాణి. రంగంపేట హైస్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు చక్రరావు, బేబిల మేనరికం వివాహం వల్ల తాను పుట్టుకతో అంధురాలినని చెప్పింది. తల్లిదండ్రులు, మిత్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే టెన్త్ పరీక్షలు రాస్తున్నానని తెలిపింది. పాఠశాలలో ఉపాధ్యాయులు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటానని, ఇంటి వద్ద తమ్ముడు వినయ్ (పెద్దమ్మ కుమారుడు), చెల్లి శిరీష చదువుతూ వుంటే వాటిని జ్ఞాపకముంచుకుంటూ ప్రతి తరగతిని చదువుతూ వచ్చానంది. తన చెల్లి శిరీష ప్రతి తరగతిలోను పరీక్షలు రాసిందని, ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు మా స్కూల్లో 9వ తరగతి చదువుతున్న శ్రీధరరావుకు చెబుతుండగా అతను రాస్తున్నాడని తెలిపింది. మా స్కూల్లో ఇంగ్లీషు మాస్టారు ఛార్లెస్ స్ఫూర్తితో తాను కూడా ఇంగ్లిషు టీచరు అవ్వాలని ఉందని చెప్పింది. అంధత్వం ఆత్మవిశ్వాసానికి అడ్డుకాదని పేర్కొంది. మంచి గ్రేడుతోనే పదవతరగతి పరీక్షల్లో విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేసింది. -
ఆ ఇంటి జ్యోతి ఆరిపోయింది
ఆ కుటుంబం ఆశలన్నీ ఆ అమ్మాయిపైనే.. అందుకే ఎంతో కష్టపడి కూలి పనులు చేస్తూ ఆమెను చదివిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ అమ్మాయి కూడా చదువులో రాణిస్తోంది. రాజమహేంద్రవరంలోని వీటీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది... ఇంతలో ఓ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించసాగాడు. అంతేకాదు ఆమె ఇంటికి ఫోన్ చేసి ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాలకు రావాలంటేనే భయమేస్తోందని, తన చదువుకు ఆటంకం లేకుండా రక్షణ కల్పించాలని ఆ అమ్మాయి లేఖ రాసింది. దాంతో ప్రిన్సిపాల్ ఆ యువకుడిని మందలించారు. ‘తాను ఎప్పుడూ ఆ అమ్మాయి జోలికి వెళ్లను’ అంటూ తనను క్షమించాలని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ... ఏమైందో కానీ ఆ యువతి కిరోసిన్ పోసుకుని తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపులకు ఆ ఇంటి ‘జ్యోతి’ ఆరిపోయింది. కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతూ దివికేగింది. - పెదరాయవరం(రంగంపేట) రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన గొర్ల సత్తిబాబు, నారాయణమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె అనూషజ్యోతి(18) రాజమహేంద్రవరంలో బీఎస్సీ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుండగా, రెండో కుమార్తె దుర్గ చండ్రేడు హైస్కూల్లో పదోతరగతి చదువుతోంది. అనూషాజ్యోతి తండ్రి సత్తిబాబు వ్యవసాయకూలి కాగా, తల్లి నారాయణమ్మ వడిశలేరులో జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. రాజమహేంద్రవరం వి.టి కళాశాలలో చదువుతున్న అనూష జ్యోతిని రాజమండ్రికి చెందిన రేకాడ మణికంఠ అనే బీఎస్సీ ఫస్టియర్ విద్యార్థి మూడునెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 25న ఆమె ఇంటికి ఫోన్ చేసి ‘జ్యోతి ఉందా?’ అని అడిగి ఫోన్ కట్ చేశాడు. ఈ విషయమై అనూష జ్యోతి తల్లిదండ్రులు అదే నెల 28న వి.టి.కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మణికంఠను మందలించారు. దాంతో ‘తానెప్పుడూ ఎవ్వరినీ వేధించనని, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించనని, క్షమించమని కోరుతూ రాసిచ్చాడు. అయితే ఈనెల 20న కళాశాలకు వెళ్లిన జ్యోతి అక్కడ ఏం జరిగిందో తల్లిదండ్రులకు చెప్పలేదు. 22వ తేదీన తల్లిదండ్రులు కూలి పనులకు, చెల్లి దుర్గ స్కూల్‌కు వెళ్లిన సమయంలో కిరోసిన్ పోసుకుని కాలినగాయాలతో మృతిచెందింది. సోమవారం రాత్రి గ్రామంలో జ్యోతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తమకుమార్తె ఇలా మృతి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. అనూషజ్యోతి మృతి తీరని లోటు పెదరాయవరం(రంగంపేట): చదువులోు, వినయవిధేయతలతో, ఇంటిపనిలో అన్ని విధాలా అగ్రగామిగా ఉన్న అనూషజ్యోతి లేదని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామస్తులు. ఎదుటవారిని నొప్పించే మనస్తత్వం ఆమెది కాదంటున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చండ్రేడు హైస్కూల్లో,ఇంటర్ రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాలలో చదివింది. ఆమె ఆత్మహత్య సంఘటన పలువురిని విషాదంలో ముంచింది. కళాశాల ఎదుట బంధువులు, విద్యార్థులు ఆందోళన యువతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె తండ్రి సత్యనారాయణ తోపాటు బంధువులు, విద్యార్థులు బుధవారం వి.టి.కాలేజీ వద్ద ధర్నా చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ నిర్వాకం వల్లే యువతి మృతి చెందిందని, వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే కాలేజీ ప్రిన్సిపాల్ అడ్డుకున్నారని, అందువల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు. -
రంగంపేట వద్దే మెగాసిటీ
ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో ‘నిమ్జ్’ ఏర్పాటుకు ప్రతిపాదన 11,282 ఎకరాల అటవీ భూమి డీ-నోటిఫైకి నివేదిక తయారీ తిరుపతి: జిల్లాలోని చంద్రగిరి మండలం ఎ.రంగంపేట వద్ద మెగా సిటీ నిర్మించాలని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి సూ చించింది. ఏర్పేడు-శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ (నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిం చింది. మెగాసిటీ, నిమ్జ్ ఏర్పాటుకు 39,931 ఎకరాల ప్రభుత్వ, అటవీ, డీకేటీ భూములు తిరుపతి, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు వారం రోజుల క్రితం ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపారు. చెన్నై-విశాఖపట్నం పారిశ్రామిక కారిడార్‌లో చిత్తూరు జిల్లాను చేర్చుతూ 2008లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణపట్నం నౌకాశ్రయం సమీపంలో ఉండడం, సోమశిల, కండలేరు జలాశయాలు అందుబాటులో ఉండడం, శ్రీకాళహస్తి-నడికుడి రైలుమార్గం ప్రతిపాదన ఉన్న దృష్ట్యా శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతాలు పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని అప్పట్లో కేంద్రం తేల్చింది. ఏర్పేడు- శ్రీకాళహస్తి ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన బిల్లులో కూడా యూపీఏ సర్కారు పేర్కొంది. నిమ్జ్‌కు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)తో అప్పట్లో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. నిమ్జ్ ఏర్పాటుకు కట్టుబడినట్లు నరేంద్రమోదీ సర్కారు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం ఏడీబీ బృందం అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో సమావేశమై నిమ్జ్ ఏర్పాటుపై చర్చించింది. రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేక వ్యక్తమవకుండా చూడాలనే లక్ష్యంతో సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో కీలకమైన ప్రకటన చేశారు. తిరుపతిని మెగాసిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. నిమ్జ్, మెగాసిటీ, జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు అటవీ భూమిని డీ-నోటిఫై చేసేందుకు సహకరిస్తామని విభజన బిల్లులోనే కేంద్రం హామీ ఇచ్చింది. ఈ మేరకు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, బీఎన్ కండ్రి గ, కేవీబీ పురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో అటవీ, ప్రభుత్వ, డీకేటీ భూములను గుర్తించాలని ఆదేశించింది. తిరుపతికి పది కి.మీల పరిధిలో అటవీ భూములను డీ-నోటిఫై చేసేందుకు ప్రతిపాదనలు పంపే బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి అప్పగించింది. మెగాసిటీకి 4,290 ఎకరాలు తిరుపతికి సమీపంలోని చంద్రగిరి మండలం రంగంపేట వద్ద 464 ఎకరాల డీకేటీ, 148 ఎకరాల ప్రభుత్వ, 3678 ఎకరాల అటవీ వెరసి 4290 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. రేణిగుంట, వడమాలపేట మండలాల్లో అటవీ భూములు డీ-నోటిఫై చేసే స్థాయిలో అందుబాటులో లేవని తేల్చారు. రంగంపేట వద్ద ప్రైవేటు భూమి కూడా మరో నాలుగు వేల ఎకరాలను సేకరించవచ్చుననే అంచనాకు వచ్చారు. ఒక్క రంగంపేట వద్ద మాత్రమే ఎనిమిది వేల ఎకరాల భూమి అందుబాటులో ఉండటం, కళ్యాణి డ్యాం దగ్గరలోనే ఉండటం దృష్ట్యా మెగా సిటీ ఏర్పాటుకు ఇదే అనుకూలమైన ప్రాంతమని అధికారయంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. రెవెన్యూ, అటవీ, పురపాలక శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ నియమించి రంగంపేట ప్రాంతంలో మెగాసిటీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా లేదా అన్నది ప్రభుత్వం తేల్చనుంది. ఆ తర్వాత డీపీఆర్‌ను తయారీకి గ్లోబల్ టెండర్లు పిలిచే అవకాశం ఉందని తుడా అధికారవర్గాలు పేర్కొన్నాయి. నిమ్జ్‌కు 19 వేల ఎకరాలు శ్రీకాళహస్తి మండలంలో 1900 ఎకరాల డీకేటీ, 2940ఎకరాల ప్రభుత్వ, 840 ఎకరాల అటవీ మొత్తం 5680 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు జేసీ కమిటీ తేల్చింది. ఏర్పేడు మండలంలో 6980 ఎకరాల డీకేటీ, 1105 ఎకరాల ప్రభుత్వ, 5,300 ఎకరాల అటవీ వెరసి 13,385 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నట్లు తేల్చారు. రెండు మండలాల్లోనూ 19,065 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో నిమ్జ్ ఏర్పాటుచేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఆ మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన నీటి సౌకర్యం, నడికుడి-శ్రీకాళహస్తి రైలుమార్గాన్ని పూర్తిచేస్తే నిమ్జ్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏర్పేడు మండలంలోనే ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ ఏర్పాటుకు ఇప్పటికే 990 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వానికి కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రతిపాదనలు పంపడం, కేంద్రం ఆమో దం తెలిపిన విషయం విదితమే. బీఎన్ కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, శ్రీకాళహస్తి, సత్యవేడు, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి మండలాల్లో 11,282 ఎకరాల అటవీ భూమిని డీ-నోటిఫై చేసేం దుకు అవసరమైన ప్రతిపాదనలను సైతం ప్రభుత్వానికి కలెక్టర్ పంపారు. ఈ ప్రతిపాదనను యథాతథంగా ప్రభుత్వం కేంద్రానికి పంపనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. -
‘ఉపాధి’ పని చేసినా పస్తులే
రంగంపేట : ఆరుగాలం కష్టించినా వేతనాల్లేక ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు. తపాలా పాస్‌పుస్తకాలు లేక కొందరికి, పుస్తకాలున్నా మరి కొందరికి వేతనాలు పడలేదు. దాంతో ఏం చేయాలో పాలుపోక వారు దిక్కులు చూస్తున్నారు. మండలంలో సుమారు 200 మందికి పైగా ఉపాధి కూలీలకు తపాలాశాఖ పాస్‌పుస్తకాలు లేవు. సుమారు రూ. 20 లక్షల ఉపాధి పనుల సొమ్ము విడుదలైనా ఆ సొమ్ము మాత్రం కూలీలకు అందలేదు. మండలంలోని 16 గ్రామాల్లో సుమారు రూ. కోటితో 42 పనులను చేపట్టారు. తపాలా పాసుపుస్తకాలు ఉన్న కూలీలకు ఆరు వారాల కూలి రావాల్సి ఉండగా రెండు వారాలకు మాత్రమే వచ్చిందని, ఆమొత్తం సుమారు రూ. 5 లక్షలు వారి ఖాతాలకు జమచేస్తున్నామని ఏపీఓ యు. భ్రమరాంబ తెలిపారు. ఇంకా రూ. 20 లక్షల వరకు బకాయి వేతనాలు చెల్లించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొత్తగా కనీసం 200 మందికి పాస్‌పుస్తకాలు రావాల్సి ఉన్నట్టు తెలుస్తోంది. తక్షణమే పాసుపుస్తకాలను జారీ చేయాలని తపాలాశాఖ ఉన్నతాధికారులకు తెలియపర్చామని, ఇంకా విడుదల చేయలేదని ఆమె చెప్పారు. దీనిపై తపాలాశాఖ ఉన్నతాధికారులు స్పందించి కనీసం 200 పాస్‌పుస్తకాలు రంగంపేట మండలానికి విడుదల చేయాలని ఉపాధికూలీలు కోరుతున్నారు. -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ
రంగంపేట, న్యూస్‌లైన్ :ఏడీబీ రోడ్డుపై రంగంపేట ఎస్టీకాలనీలోని రైస్‌మిల్లు ఎదురుగా శనివారం ఉదయం సుమారు 8 గంటలకు లారీ, ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కుడికాలు విరిగిపోగా, బస్సులోని 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నుంచి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు, రాజమండ్రి నుంచి పెద్దాపురం వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వైపు భాగం నుజ్జునుజ్జయ్యింది. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం ముజ్జెనపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గంటా రాంబాబు కుడికాలు రెండుచోట్ల విరిగిపోయింది. ఎడమకాలికి స్వల్పగాయమైంది. అతడు సుమారు గంటకు పైగా లారీ కేబిన్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. లారీ క్లీనర్ స్వల్పగాయంతో బయటపడ్డాడు. రంగంపేట ఎస్సై ఆర్.అంకారావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయిన్‌తో లారీడ్రైవర్‌ను బయటకు తీయించి, 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే లారీకి అతుక్కుపోయిన ఆర్టీసీ బస్సును కూడా ప్రొక్లెయిన్ సాయంతో విడదీశారు. గాయాలపాలైన ప్రయాణికులను రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం ఆస్పత్రులకు త రలించారు. బస్సు డ్రైవర్ కాకినాడ డిపోకు చెందిన కొండా కోదండ రాముడుతో పాటు ప్రయాణికులు కాకినాడకు చెందిన గవర్చంద్జైన్, ద్రాక్షారపు వీర్రాజు,నూకరత్నం, వీరనరేష్, పొన్నాడ వెంకట సూర్యగణేష్, నాగమణి, వాడపల్లి తేజశ్రీ, శేషసత్యరాగవేణి తదితరులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు చె బుతున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: 40 మందికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లా రంగపేట వద్ద కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొన్నాయి. ఆ ప్రమదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానికుల సహయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అలాగే లారీ క్యాబిన్లో ఇరుకున్న డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొన్న ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమ్ముడుపోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
జి. దొంతమూరు (రంగంపేట), న్యూస్‌లైన్ :తన జీవితంలో ఎక్కడైనా అమ్ముడు పోయానని రుజువుచేస్తే దేనికైనా సిద్ధమేనని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. కేపీఆర్ రసాయన మూలకాల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జి.దొంతమూరు, బాలవరం గ్రామాల్లో జరుగుతున్న నిరశన దీక్షా శిబిరాలను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కేపీఆర్ గుప్పిట్లో మురళీమోహన్ అనే అపరిచిత కరపత్రాలపై స్పందించిన ఆయన వివరణ ఇచ్చారు. రెండు గ్రామాల వారిని ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, తనకే అలాంటి ఫ్యాక్టరీలు 10 కట్టగల ఆర్థిక స్థోమత ఉందన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని, 30 ఏళ్లుగా దీక్ష చేపడుతున్న అయ్యప్ప మాలపై ఒట్టు వేసి చెబుతున్నానన్నారు. కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసిన నాయకుల చరిత్ర నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. తాను దానపరుణ్ణే కాని దాసోహపరుణ్ణి కాదన్నారు. కరపత్రాల వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లిందని, సరైన సమయంలో సరైన రీతిలో ఆయన స్పందిస్తారని మురళీమోహన్ అన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని డబ్బు కోసం ఆశించిన తొత్తులే వారికి దాసోహం అంటున్నారని మండిపడ్డారు. పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో ఉచితంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోత్సాహానిస్తున్నానన్నారు. ఆరోగ్యశిబిరాలు సమాజ సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నానే తప్ప ప్రచారం కోసం కాదన్నారు. ఇలాంటి కరపత్రాలు వేసినవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కేపీఆర్ వ్యతిరేక ఉద్యమాలకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. 322 రోజులుగా కేపీఆర్ సంస్థ పనులకు వ్యతిరేకంగా నిరశన ఉద్యమాలు చేయడం అభినందనీయమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని మురళీమోహన్ జోస్యం చెప్పారు. ‘మీసమస్యను తప్పనిసరిగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.’ ఆ కరపత్రాలతో తమకు సంబంధం లేదని కేపీఆర్ సంస్థ పనుల వ్యతిరేక పోరాట సమితి అధ్యక్ష, కార్యదర్శులు గిరిజాల సత్తిబాబు, కాకరపల్లి సూరిబాబు తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు పెండ్యాల నళినీకాంత్, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవింద్, పార్టీనాయకులు గారపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.