ఆ ఇంటి జ్యోతి ఆరిపోయింది
ఆ కుటుంబం ఆశలన్నీ ఆ అమ్మాయిపైనే.. అందుకే ఎంతో కష్టపడి కూలి పనులు చేస్తూ ఆమెను చదివిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఆ అమ్మాయి కూడా చదువులో రాణిస్తోంది. రాజమహేంద్రవరంలోని వీటీ కళాశాలలో బీఎస్సీ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది... ఇంతలో ఓ యువకుడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించసాగాడు. అంతేకాదు ఆమె ఇంటికి ఫోన్ చేసి ఆమెతో అసభ్యంగా మాట్లాడేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. కళాశాలకు రావాలంటేనే భయమేస్తోందని, తన చదువుకు ఆటంకం లేకుండా రక్షణ కల్పించాలని ఆ అమ్మాయి లేఖ రాసింది. దాంతో ప్రిన్సిపాల్ ఆ యువకుడిని మందలించారు. ‘తాను ఎప్పుడూ ఆ అమ్మాయి జోలికి వెళ్లను’ అంటూ తనను క్షమించాలని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. ... ఏమైందో కానీ ఆ యువతి కిరోసిన్ పోసుకుని తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. యువకుడి వేధింపులకు ఆ ఇంటి ‘జ్యోతి’ ఆరిపోయింది. కన్నవారికి కన్నీళ్లు మిగుల్చుతూ దివికేగింది.
- పెదరాయవరం(రంగంపేట)
రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన గొర్ల సత్తిబాబు, నారాయణమ్మలకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె అనూషజ్యోతి(18) రాజమహేంద్రవరంలో బీఎస్సీ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుండగా, రెండో కుమార్తె దుర్గ చండ్రేడు హైస్కూల్‌లో పదోతరగతి చదువుతోంది. అనూషాజ్యోతి తండ్రి సత్తిబాబు వ్యవసాయకూలి కాగా, తల్లి నారాయణమ్మ వడిశలేరులో జీడిపిక్కల ఫ్యాక్టరీలో పనిచేస్తోంది.
రాజమహేంద్రవరం వి.టి కళాశాలలో చదువుతున్న అనూష జ్యోతిని రాజమండ్రికి చెందిన రేకాడ మణికంఠ అనే బీఎస్సీ ఫస్టియర్ విద్యార్థి మూడునెలలుగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 25న ఆమె ఇంటికి ఫోన్ చేసి ‘జ్యోతి ఉందా?’ అని అడిగి ఫోన్ కట్ చేశాడు. ఈ విషయమై అనూష జ్యోతి తల్లిదండ్రులు అదే నెల 28న వి.టి.కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మణికంఠను మందలించారు. దాంతో ‘తానెప్పుడూ ఎవ్వరినీ వేధించనని, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించనని, క్షమించమని కోరుతూ రాసిచ్చాడు.
అయితే ఈనెల 20న కళాశాలకు వెళ్లిన జ్యోతి అక్కడ ఏం జరిగిందో తల్లిదండ్రులకు చెప్పలేదు. 22వ తేదీన తల్లిదండ్రులు కూలి పనులకు, చెల్లి దుర్గ స్కూల్‌కు వెళ్లిన సమయంలో కిరోసిన్ పోసుకుని కాలినగాయాలతో మృతిచెందింది. సోమవారం రాత్రి గ్రామంలో జ్యోతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆమె తల్లిదండ్రులు తెలిపారు. తమకుమార్తె ఇలా మృతి చెందుతుందని కలలో కూడా ఊహించలేదని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అనూషజ్యోతి మృతి తీరని లోటు
పెదరాయవరం(రంగంపేట): చదువులోు, వినయవిధేయతలతో, ఇంటిపనిలో అన్ని విధాలా అగ్రగామిగా ఉన్న అనూషజ్యోతి లేదని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామస్తులు. ఎదుటవారిని నొప్పించే మనస్తత్వం ఆమెది కాదంటున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు చండ్రేడు హైస్కూల్లో,ఇంటర్ రాజమహేంద్రవరం ఆదిత్య కళాశాలలో చదివింది. ఆమె ఆత్మహత్య సంఘటన పలువురిని విషాదంలో ముంచింది.
కళాశాల ఎదుట బంధువులు, విద్యార్థులు ఆందోళన
యువతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆమె తండ్రి సత్యనారాయణ తోపాటు బంధువులు, విద్యార్థులు బుధవారం వి.టి.కాలేజీ వద్ద ధర్నా చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ నిర్వాకం వల్లే యువతి మృతి చెందిందని, వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే కాలేజీ ప్రిన్సిపాల్ అడ్డుకున్నారని, అందువల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని పేర్కొన్నారు.