అమ్ముడుపోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం | proven by any ready Sales anywhere in his life fell , Parliamentary constituency TDP party leader murali mohan | Sakshi
Sakshi News home page

అమ్ముడుపోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం

Published Thu, Dec 26 2013 2:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

proven by any ready Sales anywhere in his life fell , Parliamentary constituency TDP party leader murali mohan

జి. దొంతమూరు (రంగంపేట), న్యూస్‌లైన్ :తన జీవితంలో ఎక్కడైనా అమ్ముడు పోయానని రుజువుచేస్తే దేనికైనా సిద్ధమేనని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మాగంటి మురళీమోహన్  అన్నారు. కేపీఆర్ రసాయన మూలకాల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ  జి.దొంతమూరు, బాలవరం గ్రామాల్లో జరుగుతున్న నిరశన దీక్షా శిబిరాలను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కేపీఆర్ గుప్పిట్లో మురళీమోహన్ అనే అపరిచిత కరపత్రాలపై స్పందించిన ఆయన వివరణ ఇచ్చారు. రెండు గ్రామాల వారిని ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, తనకే అలాంటి ఫ్యాక్టరీలు 10 కట్టగల ఆర్థిక స్థోమత ఉందన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని, 30 ఏళ్లుగా దీక్ష చేపడుతున్న అయ్యప్ప మాలపై ఒట్టు వేసి చెబుతున్నానన్నారు.
 
 కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసిన నాయకుల చరిత్ర నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. తాను దానపరుణ్ణే కాని దాసోహపరుణ్ణి కాదన్నారు. కరపత్రాల వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లిందని, సరైన సమయంలో సరైన రీతిలో ఆయన స్పందిస్తారని మురళీమోహన్ అన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని డబ్బు కోసం ఆశించిన తొత్తులే వారికి దాసోహం అంటున్నారని మండిపడ్డారు.  పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో ఉచితంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోత్సాహానిస్తున్నానన్నారు. ఆరోగ్యశిబిరాలు సమాజ సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నానే తప్ప ప్రచారం కోసం కాదన్నారు. ఇలాంటి కరపత్రాలు వేసినవారికి  ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
 
 కేపీఆర్ వ్యతిరేక ఉద్యమాలకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. 322 రోజులుగా కేపీఆర్ సంస్థ పనులకు వ్యతిరేకంగా నిరశన ఉద్యమాలు చేయడం అభినందనీయమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని మురళీమోహన్ జోస్యం చెప్పారు. ‘మీసమస్యను తప్పనిసరిగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.’ ఆ కరపత్రాలతో తమకు సంబంధం లేదని కేపీఆర్ సంస్థ పనుల వ్యతిరేక పోరాట సమితి అధ్యక్ష, కార్యదర్శులు గిరిజాల సత్తిబాబు, కాకరపల్లి సూరిబాబు  తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు పెండ్యాల నళినీకాంత్, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవింద్, పార్టీనాయకులు గారపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement