- వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల సమావేశంలో నేతల పిలుపు
నరసరావుపేట రూరల్ : టీడీపీ అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్టీ కౌన్సిలర్ల ఆత్మీయ సమావేశాన్ని పట్టణంలోని విజయ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజశేఖర్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు అధికారులతో కలసిచేస్తున్న తప్పుడు పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలాంటి పనులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారుల మెడకు చుట్టుకునే రోజులు వస్తాయన్నారు.
గుంటూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశాన్ని ఈ నెల 8న తెనాలిలో నిర్వహిస్తామన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలను కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తడం ద్వారా ప్రజలకు చేరువ కావచ్చన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. పట్టణాల్లో పార్టీని పటిష్టపరిచేలా కౌన్సిలర్లు, కన్వీనర్లు పనిచేయాలన్నారు.
సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి రోజు వార్డుల్లో పర్యటించాలన్నారు. దీంతోపాటు సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సంఘటితం కావాల్సిన పరిస్థితులను టీడీపీ కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. డివిజన్‌లో నెలకొన్న దారుణ పరిస్థితికి సభాపతి కోడెల శివప్రసాదరావే కారణమని విమర్శించారు. రాజకీయాన్ని రౌడీయిజంవైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ నేత ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాల్టీల్లో ఏకపక్ష పాలన సాగుతోందన్నారు.
పరిస్థితిని చక్కదిద్దేందుకు నేతలందరితో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాల్లో అధికార పార్టీకి దీటుగా బదులివ్వాలన్నారు. సమస్యలు వచ్చినప్పడు అవసరమైతే ఉద్యమం చే పడతామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్లు మాగులూరి రమణా రెడ్డి, ఎన్.వెంకటరామిరెడ్డి, సీహెచ్.సాంబశివరావు, ఆర్.రమాదేవి, రేపాల శ్రీనివాస్, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి రమేష్‌బాబు, పట్టణ కన్వీనర్ షేక్‌హనీఫ్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పాలపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందాం
Published Tue, May 5 2015 5:19 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement