సాక్షి ప్రతినిధి,ఒంగోలు: టీడీపీలో టికెట్ల గోల మొదలైంది. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ గ్రాఫ్ బాగా పడిపోయింది. ముఖ్యమంత్రి మొదలు స్థానిక నేతల వరకు ఎన్నికలతో పాటు ఆ తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. దీంతో పాటు నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు అభివృద్ధి పనుల్లోనే కాక ఏకపక్షంగా సంక్షేమ పథకాల్లోనూ కమీషన్లు బొక్కడం ఆ పార్టీని ఇబ్బందుల్లో పడేసింది. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత ప్రజాదరణ పెంచుకొని రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతుండడం టీడీపీని ఇరకాటంలోకి నెట్టింది.
దీంతో ఉన్న అభ్యర్థులతో ఎన్నికలకు వెళితే మునిగే పరిస్థితి ఉండడంతో టీడీపీ అధిష్టానం కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలని సిటింగ్‌లు ప్రయత్నిస్తుండగా కొత్తవారిని నిలపాలని ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున లోక్‌సభకు పోటీచేసి ఓటమి చెందిన మాగుంట శ్రీనివాసులరెడ్డి, పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం లాంటి నేతలు జిల్లాలో ప్రధానంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టీడీపీ పరిస్థితి బాగాలేదని, అభ్యర్థుల మార్పు తప్పనిసరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించిన ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనిగిరి, కందుకూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, దర్శి, పర్చూరు, సంతనూతలపాడు, కొండపి, తదితర నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు చర్చనీయాంశంగా మారింది. కనిగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్యనేత మొదలు కింది స్థాయి నేతలు అభివృద్ధి పనుల్లో పర్సంటేజీలు వసూలు చేయడంలో ముందున్నారు. ముఖ్యనేత ఏకంగా 12 శాతం తగ్గకుండా వసూలు చేస్తున్నట్లు అధికార పార్టీలోనే జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో నియోజకవర్గంలో సదరు నేత అవినీతి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
ఇక్కడ ఎమ్మెల్యే కదిరి బాబూరావు మార్పు తథ్యమని టీడీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదంటూ టీడీపీ అధిష్టానం ఇప్పటికే బాబూరావుకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నర్సింహారెడ్డి లేదా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మరో నేతకో టికెట్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మార్కాపురం నియోజకవర్గంలోనూ టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలకు కొదవ లేదు. అభివృద్ధి పనులకు సంబంధించి పది శాతానికి మించి ఇక్కడి నేతలు పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న కందుల నారాయణరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం టికెట్టు ఇవ్వదన్న ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి మరొక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తారన్న ప్రచారం ఒకవైపు ఉండగా మంత్రి శిద్దా రాఘవరావు లేదా ఆయన తనయుడు శిద్ధా సుధీర్‌లలో ఒకరికి మార్కాపురం టీడీపీ టికెట్టు ఇస్తారన్న ప్రచారం సాగుతోంది.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన డేవిడ్‌రాజు అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఇక్కడ టీడీపీ నేతలు 12 నుంచి 15 శాతం పర్సంటేజీలు వసూలు చేస్తూ జిల్లాలో నంబర్ 1గా నిలిచినట్లు అధికార పార్టీలోనే ప్రచారం సాగుతోంది. ముఖ్యనేతకు ప్రతి పనిలోనూ పర్సంటేజీలు ముట్టచెప్పాల్సిందే. అభివృద్ధి పనులే కాక సంక్షేమ పథకాలను సదరు నేతకు పర్సంటేజీలు ఇవ్వనిదే పని కావడం లేదు. ఈ నేత వసూళ్ల పర్వాన్ని చూసిన టీడీపీ నేత మన్నె రవీంద్రతో పాటు పలువురు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ డేవిడ్ రాజుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని అధికార పార్టీ వర్గాలే పేర్కొంటుండడం గమనార్హం. దీంతో డేవిడ్‌రాజు సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. యర్రగొండపాలెం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కానరావడం లేదు.
ఇక సంతనూతలపాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్నారు. తమ కనుసన్నల్లో విజయకుమార్ నడవడం లేదన్న అక్కసుతో సదరు నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆయన తనయుడు లోకేష్‌కు సైతం ఇక్కడి నేతలు విజయ్‌కుమార్‌ను మార్చాలంటూ పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ఇదే అవకాశంగా డేవిడ్‌రాజు సంతనూతలపాడు టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు.
కొండపి నియోజకవర్గంలోనూ అధికార పార్టీ అక్రమాల దందాకు కొదువ లేదు. అధికార పార్టీ ముఖ్యనేత పది శాతానికి తగ్గకుండా పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. ఈయనతో పాటు ఈ నియోజకవర్గంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఆయన సమీప బంధువులు దామచర్ల పూర్ణచంద్రరావు, సత్య తోపాటు కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు ప్రభావం చూపిస్తున్నారు. జనార్ధన్ కొండపి ఎమ్మెల్యే స్వామిని వ్యతిరేకిస్తుండగా జనార్ధన్ చిన్నాన్న, సోదరుడు స్వామికి మద్దతు పలుకుతున్నారు. దీంతో జనార్ధన్.. స్వామికి అడ్డుకట్ట వేసేందుకు జూపూడి ప్రభాకర్‌రావును తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్టు ఇస్తారన్న దానిపై సందిగ్ధం నెలకొంది. అన్ని వర్గాలు నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ పర్సంటేజీల వసూళ్ల కార్యక్రమానికి తెరలేపాయి.
కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ముఖ్యనేత సమీప బంధువుల అక్రమాలకు అంతే లేదన్న ప్రచారం సాగుతోంది. ప్రతిపనికి 12 నుంచి 15 శాతం వరకు పర్సంటేజీలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు ఆ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించడంతో పోతుల, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య సఖ్యత లేదు. ఇరువురు నేతలు బయటకు సఖ్యతగా ఉన్నా క్యాడర్ మధ్య విభేదాలు అలాగే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో పోతుల టీడీపీ టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మరో వైపు ఒంగోలు ఎమ్మెల్యే జనార్ధన్ సైతం కందుకూరు టికెట్‌ను ఆశిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం చివరకు ఏం చేస్తుందన్నది వేచి చూడాల్సిందే. దర్శి నియోజకవర్గం నుంచి శిద్దా రాఘవరావు మంత్రిగా ఉన్నారు. ఆయన పర్సంటేజీలకు దూరంగా ఉన్నా అసంతృప్తులకూ కొదవలేదు. ఇటీవల అధికార పార్టీ చేయించిన సర్వేల్లోనూ మంత్రి శిద్దాకు సానుకూల పరిస్థితి లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment