మురళీ మోహన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ.
న్యూఢిల్లీ: మహిళల వస్త్రధారణ హుందాగా ఉండాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ గురువారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రాజ్యసభ దద్దరిల్లింది. పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుడు విప్లోవ్ థాకూర్ మురళీమోహన్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేడీ సభ్యులు ఒడిశాలో వరదల అంశాన్ని ప్రస్తావించడం... గందరగోళం నడుమ సభ 15 నిమిషాలు వాయిదా పడింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సాధ్వి సావిత్రి భాయ్ పూలే లోక్‌సభలో చర్చ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఇక, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటింగ్ సరళి బయటకు తెలియకుండా ఉండేందుకు టోటలైజర్ అనే కొత్త ఓట్ల లెక్కింపు మెషిన్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో శుక్రవారం వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై తామింకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
24 తర్వాతే అఖిలపక్ష భేటీ: కేంద్రం
సివిల్ సర్వీసెస్ పరీక్షా వివాదంపై అఖిలపక్ష భేటీ ఈ నెల 24న తర్వాతే ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ఈ నెల 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని వెంకయ్య చెప్పారు.