రాజ్యసభ నాలుగో సీటు కోసమే ఎమ్మెల్యేలను చేర్చుకున్నాం
► ఇంకో ఎనిమిది మంది చేరితే విజయసాయిరెడ్డి గెలిచేవారు కాదు
► టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం స్పష్టీకరణ
► చంద్రబాబు, దగ్గుబాటి మధ్య విభేదాల వల్ల నష్టపోయానని ఆవేదన
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో సీటు వస్తుందన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నామని టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం చెప్పారు. ఇంకో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే విజయసాయిరెడ్డి గెలిచే పరిస్థితి ఉండదు, ఇది టీడీపీ సిద్ధాంతమని ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తన దృష్టిలో ఓ కిడ్(పసి బాలుడు) అని వ్యాఖ్యానించారు. ఆయనను పార్టీలోకి చేర్చుకోవడంతో తమ కేడర్‌కు సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. కరణం బలరాం ఔట్‌డేటెడ్ నాయకుడు.. కరణం వెంకటేష్ ఆవేశపరుడు.. రెండేళ్లు ఇవన్నీ పరిశీలించిన తర్వాతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గొట్టిపాటి రవికుమార్‌ను పార్టీలోకి చేర్చుకున్నారా? అన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు.
డ్యాన్స్ మాస్టర్లను పెట్టుకుంటే లాభం లేదని పరోక్షంగా చంద్రబాబుకు చురకలు అంటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానని స్వయంగా చంద్రబాబు నాయుడే చెప్పారని, తన సీనియారిటీ, స్వభావం ఏమిటో ఆయనకు తెలుసన్నారు. చంద్రబాబు తొలుత మంత్రి కావడానికి ఢిల్లీలో తాను ఎంతమేరకు కృషి చేశాననేది ఆయనకే తెలుసని చెప్పారు. ఇప్పుడు ఆ విషయాలన్నీ అప్రస్తుతమని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ అల్లుళ్లయిన చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య విభేదాల వల్ల తాను నష్టపోయాయని కరణం బలరాం ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రత్యర్ధి గొట్టిపాటి హనుమంతరావుకు చంద్రబాబు 1999లో మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు.క చెంపపై కొడితే మరో చెంప చూపడానికి తానేమీ గాంధీ మహాత్ముడి తరహా మనుషులం కాదని చెప్పారు.