ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
* నామినేషన్ ఉపసంహరించుకున్న సునందారెడ్డి
* నేటి మధ్యాహ్నం 3 గంటలకు అధికారికంగా వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీ తరపున డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సునందారెడ్డి తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించటంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉపసంహరణ లేఖను సునందారెడ్డి బుధవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కె. సత్యనారాయణకు లేఖ అందచేశారు.
దీంతో రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన వి. విజయసాయిరెడ్డి(వైఎస్సార్‌సీపీ), కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు (బీజేపీ), కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సత్యనారాయణ చౌదరి(టీడీపీ), మాజీ మంత్రి టీజీ వెంకటేష్ (టీడీపీ)లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. వీరి ఎన్నికను శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక రిటర్నింగ్ అధికారి కె. సత్యనారాయణ అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం 3.05 గంటలకు కేంద్ర మంత్రి సురేష్‌ప్రభు ఎన్నిక ధ్రువపతాన్ని అందుకోనున్నారు. టీడీపీ అభ్యర్థులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కూడా ఇదే సమయానికి అందుకుంటారు.