సాక్షి, హైదరాబాద్: కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీని ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగిసింది. ఈ స్థానాన్ని అధికార తెలుగుదేశం పార్టీ తన మిత్ర పక్షమైన బీజేపీకి కేటాయించింది. నిర్మలా సీతారామన్ మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో, ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ ఇన్‌చార్జి కార్యదర్శి సత్యనారాయణ మంగళవారం ప్రకటించారు. రాష్ట్ర శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య వ్యవహరించనున్నారు.