టీడీపీలో పెరుగుతున్న రాజ్యసభ సెగ
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌తో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో రోజు రోజుకూ వేడి పెరుగుతోంది. రాజ్యసభ సీటు ఆశిస్తున్న నేతలు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ను కలిసి తమ పేర్లను పరిశీలించాల్సిందిగా కోరుతున్నారు.
బుధవారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి సుమారు 100 మంది కాపు నేతలు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్ వచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను కలిసి.. కాపులకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరారు. గత ఎన్నికల్లోనే పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి ఎంపీ సీటు ఇచ్చామని, తూర్పు గోదావరి జిల్లా నుంచి నిమ్మకాయల చినరాజప్పను ఉప ముఖ్యమంత్రిని చేశామని లోకేష్ చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కాపులకు పదవులు ఇచ్చి అన్ని ప్రాంతాల వారిని సంతృప్తి పరిచామని చెప్తే సరిపోదని.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కాపు నేతలకు కూడా ప్రాధాన్యతనివ్వాలని వారు స్పష్టం చేశారు.
కాపు సంఘాల నేతల వాదనలు విన్న లోకేష్ ఈ అంశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీ విజ్ఞాన కేంద్రం బాధ్యుడు, నిత్యం పార్టీ తరఫున సర్వేలు నిర్వహించే ప్రొఫెసర్ జయరామిరెడ్డి తనకు రాజ్యసభకు పోటీచేసే అవకాశం కల్పించాల్సిందిగా చంద్రబాబు, లోకేష్‌లను కలిసి కోరారు. మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కూడా ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న తనను పెద్దల సభకు పంపాల్సిందిగా కోరారు. మాజీ ఎమ్మెల్యేలు హేమలత, లలితా థామస్, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యలు పెద్దల సభలో సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి సుజనా చౌదరి పేరు ఖరారైందని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా బీజేపీ కోరితేనే ఏపీ నుంచి ఒక రాజ్యసభ సీటు కేటాయించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉంటే, ఆ పార్టీ ఇస్తేనే తాము తీసుకోవాలని బీజేపీ ఉంది. బీజేపీ తరఫున రాష్ర్టం నుంచి రాజ్యసభకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పదవీ కాలం వచ్చే నెల 21తో ముగియనుంది. ఈ సీటుతో పాటు ఖాళీ అయ్యే మరో మూడు స్థానాలకు నలుగురి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో ఉంటే వచ్చే నెల 11న ఎన్నికలు నిర్వహిస్తారు. కాగా, టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఈనెల 31న నామినేషన్ దాఖలు చేయనున్నారు.