Womens Clothing
-
టీసీఎన్ఎస్ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మహిళల దుస్తులు తయారు చేసే టీసీఎన్ఎస్ క్లోతింగ్ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో భాగంగా 1.57 కోట్ల మేర ఈక్విటీ షేర్లను ఆఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా కోటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సిటి సంస్థలు వ్యవహరిస్తున్నాయి. ఇష్యూ సైజు రూ.800 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఈ కంపెనీ డబ్ల్యూ, అరెలియా, విష్‌ఫుల్ బ్రాండ్ల పేరుతో దుస్తులను విక్రయిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ కంపెనీ 418 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్లు, 1,305 లార్జ్ ఫార్మాట్ స్టోర్ అవుట్లెట్లు, 1,361 మల్టీ బ్రాండ్ అవుట్లెట్ల ద్వారా తన ఉత్పత్తులను అమ్ముతోంది. నేపాల్, మారిషస్, శ్రీలంకల్లో కూడా విక్రయాలు జరుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ.723 కోట్ల ఆదాయంపై రూ.89 కోట్ల నికర లాభం సాధించింది. 2012–13 నుంచి ఈ కంపెనీ ఆదాయం 40 శాతం, నికర లాభం 80 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. -
మురళీ మోహన్ వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ.
న్యూఢిల్లీ: మహిళల వస్త్రధారణ హుందాగా ఉండాలని టీడీపీ ఎంపీ మురళీమోహన్ గురువారం లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం రాజ్యసభ దద్దరిల్లింది. పలువురు కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ సభ్యుడు విప్లోవ్ థాకూర్ మురళీమోహన్‌పై చర్యలకు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేడీ సభ్యులు ఒడిశాలో వరదల అంశాన్ని ప్రస్తావించడం... గందరగోళం నడుమ సభ 15 నిమిషాలు వాయిదా పడింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ యాదవ్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ సాధ్వి సావిత్రి భాయ్ పూలే లోక్‌సభలో చర్చ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక, ఓట్ల లెక్కింపు సందర్భంగా ఓటింగ్ సరళి బయటకు తెలియకుండా ఉండేందుకు టోటలైజర్ అనే కొత్త ఓట్ల లెక్కింపు మెషిన్‌ను ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో శుక్రవారం వెల్లడించారు. ఈ ప్రతిపాదనపై తామింకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 24 తర్వాతే అఖిలపక్ష భేటీ: కేంద్రం సివిల్ సర్వీసెస్ పరీక్షా వివాదంపై అఖిలపక్ష భేటీ ఈ నెల 24న తర్వాతే ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. ఈ నెల 24న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్ష పూర్తయిన తర్వాతే అఖిలపక్ష భేటీ నిర్వహిస్తామని వెంకయ్య చెప్పారు. -
ఆడ దుస్తులలో మగధీరులు
జోన్ అరియార్ట్ చేస్తున్నది ఎవరికైనా నిరర్థకమైన పనిగానే అనిపిస్తుంది. కొందరికది యవ్వన చాపల్యంగా కూడా అనిపించవచ్చు. ఈ యువ ఫొటోగ్రాఫర్ చేస్తున్నదేమిటంటే మగధీరుల చేత స్త్రీల దుస్తులు తొడిగించి ఫొటోలు తీయడం! పైగా దానికొక పేరు. ‘ది మెన్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్’. ఏమిటి ఈ వెర్రి? ‘కాస్త సహృదయంతో అర్థం చేసుకుంటే నా తపన ఏమిటో అర్థమౌతుంది అంటాడు జోన్. ‘‘సమాజంలో స్త్రీలు క్రమంగా పురుష పాత్రల్లోకి వచ్చేస్తున్నారు. ఆ క్రమంలోనే నేను ఫురుషుల్ని స్త్రీలుగా ఫ్రేములలో బిగిస్తున్నాను. నా భావం... మగాడు తనని తను స్త్రీలో కోల్పోతున్న ఆవేదనలో ఉన్నా డని!’’ జోన్ ఇలా అన్నప్పుడు పురుషజాతిపై ఎనలేని సహానుభూతి కలుగుతుంది ఏ మగాడికైనా! జోన్ పుట్టింది స్పెయిన్‌లో. జోన్‌కి ఈ బుద్ధి పుట్టింది న్యూయార్క్‌లో. ప్రస్తుతం అతడి ప్రాజెక్ట్ వర్క్ నడుస్తున్నది స్పెయిన్‌లో. రకరకాల ఫొటోలు తీశాడు జోన్. ఫొటో జర్నలిజం కూడా చేశాడు. మగాళ్లకు ఆడవాళ్ల దుస్తులు తొడిగి ఫొటోలు తియ్యడం అనే ప్రాజెక్టును 2009లో మొదలుపెట్టాడు. మొదట అతడి ఉద్దేశం ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత్తర్వాత కూడా స్నేహితులు మాత్రమే అతడికి సహకరించారు. గర్ల్ ఫ్రెండ్ గానీ, భార్య గానీ ఉన్న మగవాళ్లను మాత్రమే జోన్ తన ఫొటో షూట్‌కి ఎంచుకుంటాడు. వాళ్లయితే బయటి నుంచి దుస్తులను తెచ్చుకునే పని ఉండదు కదా. ఫోటోలు వచ్చాక భర్తను తన డ్రెస్‌లో చూసుకుని భార్య, బాయ్‌ఫ్రెండ్‌ని తన దుస్తుల్లో చూసుకుని గర్ల్‌ఫ్రెండ్ పడీపడీ నవ్వేవారట. అయితే ఇది ఏమంత నవ్వదగిన విషయం కాదని జోన్ అంటాడు. ‘‘రాజ్యాలను పోగొట్టుకున్న రాజులను చూసి నవ్వుతామా? ఇదీ అలాగే. దీన్ని మీరు జోక్గానో, సరదా అయిన సంగతిగానో తీసుకోకండి. స్త్రీ సాధికారతను, పురుషుడి ఆధిక్యాల బదలాయింపును వీక్షించండి’’ అని చెప్తున్న జోన్ మరిన్ని నగరాలు తిరిగి మరిన్ని ఫొటోలు ఇలాంటివే తీయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అది స్త్రీలను ప్రశంసించడమో, పురుషులకు సానుభూతి తెలియబరచడమో కానీ, మొత్తానికైతే ఓ ప్రయోగం! ఇంకో విశేషం కూడా ఉంది. జోన్ అజ్ఞాతంలో ఉండి ఈ పనంతా చేస్తున్నాడు!! అతడి అసలైన ఫొటో ఎక్కడా కనిపించదు.