ఆడ దుస్తులలో మగధీరులు
జోన్ అరియార్ట్ చేస్తున్నది ఎవరికైనా నిరర్థకమైన పనిగానే అనిపిస్తుంది. కొందరికది యవ్వన చాపల్యంగా కూడా అనిపించవచ్చు. ఈ యువ ఫొటోగ్రాఫర్ చేస్తున్నదేమిటంటే మగధీరుల చేత స్త్రీల దుస్తులు తొడిగించి ఫొటోలు తీయడం! పైగా దానికొక పేరు. ‘ది మెన్ అండర్ ది ఇన్‌ఫ్లుయెన్స్’. ఏమిటి ఈ వెర్రి? ‘కాస్త సహృదయంతో అర్థం చేసుకుంటే నా తపన ఏమిటో అర్థమౌతుంది అంటాడు జోన్.
‘‘సమాజంలో స్త్రీలు క్రమంగా పురుష పాత్రల్లోకి వచ్చేస్తున్నారు. ఆ క్రమంలోనే నేను ఫురుషుల్ని స్త్రీలుగా ఫ్రేములలో బిగిస్తున్నాను. నా భావం... మగాడు తనని తను స్త్రీలో కోల్పోతున్న ఆవేదనలో ఉన్నా డని!’’ జోన్ ఇలా అన్నప్పుడు పురుషజాతిపై ఎనలేని సహానుభూతి కలుగుతుంది ఏ మగాడికైనా! జోన్ పుట్టింది స్పెయిన్‌లో. జోన్‌కి ఈ బుద్ధి పుట్టింది న్యూయార్క్‌లో. ప్రస్తుతం అతడి ప్రాజెక్ట్ వర్క్ నడుస్తున్నది స్పెయిన్‌లో. రకరకాల ఫొటోలు తీశాడు జోన్. ఫొటో జర్నలిజం కూడా చేశాడు. మగాళ్లకు ఆడవాళ్ల దుస్తులు తొడిగి ఫొటోలు తియ్యడం అనే ప్రాజెక్టును 2009లో మొదలుపెట్టాడు. మొదట అతడి ఉద్దేశం ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత్తర్వాత కూడా స్నేహితులు మాత్రమే అతడికి సహకరించారు.
గర్ల్ ఫ్రెండ్ గానీ, భార్య గానీ ఉన్న మగవాళ్లను మాత్రమే జోన్ తన ఫొటో షూట్‌కి ఎంచుకుంటాడు. వాళ్లయితే బయటి నుంచి దుస్తులను తెచ్చుకునే పని ఉండదు కదా. ఫోటోలు వచ్చాక భర్తను తన డ్రెస్‌లో చూసుకుని భార్య, బాయ్‌ఫ్రెండ్‌ని తన దుస్తుల్లో చూసుకుని గర్ల్‌ఫ్రెండ్ పడీపడీ నవ్వేవారట. అయితే ఇది ఏమంత నవ్వదగిన విషయం కాదని జోన్ అంటాడు. ‘‘రాజ్యాలను పోగొట్టుకున్న రాజులను చూసి నవ్వుతామా? ఇదీ అలాగే. దీన్ని మీరు జోక్‌గానో, సరదా అయిన సంగతిగానో తీసుకోకండి. స్త్రీ సాధికారతను, పురుషుడి ఆధిక్యాల బదలాయింపును వీక్షించండి’’ అని చెప్తున్న జోన్ మరిన్ని నగరాలు తిరిగి మరిన్ని ఫొటోలు ఇలాంటివే తీయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అది స్త్రీలను ప్రశంసించడమో, పురుషులకు సానుభూతి తెలియబరచడమో కానీ, మొత్తానికైతే ఓ ప్రయోగం! ఇంకో విశేషం కూడా ఉంది. జోన్ అజ్ఞాతంలో ఉండి ఈ పనంతా చేస్తున్నాడు!! అతడి అసలైన ఫొటో ఎక్కడా కనిపించదు.