కృషి, పట్టుదలతోపాటు చలించని ఆత్మబలం ఉంటే అద్భుత విజయాలు సాధించవచ్చునని చెబుతోంది
ఇంగ్లిషు టీచరునవుతా
Apr 1 2016 1:19 AM | Updated on Sep 3 2017 8:57 PM
రంగంపేట : కృషి, పట్టుదలతోపాటు చలించని ఆత్మబలం ఉంటే అద్భుత విజయాలు సాధించవచ్చునని చెబుతోంది మండలంలోని సింగంపల్లి హైస్కూల్ టెన్త్ విద్యార్థిని దేవిశెట్టి రోజారాణి. రంగంపేట హైస్కూల్‌లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు చక్రరావు, బేబిల మేనరికం వివాహం వల్ల తాను పుట్టుకతో అంధురాలినని చెప్పింది.
తల్లిదండ్రులు, మిత్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే టెన్త్ పరీక్షలు రాస్తున్నానని తెలిపింది. పాఠశాలలో ఉపాధ్యాయులు చెబుతున్నప్పుడు శ్రద్ధగా వింటానని, ఇంటి వద్ద తమ్ముడు వినయ్ (పెద్దమ్మ కుమారుడు), చెల్లి శిరీష చదువుతూ వుంటే వాటిని జ్ఞాపకముంచుకుంటూ ప్రతి తరగతిని చదువుతూ వచ్చానంది.
తన చెల్లి శిరీష ప్రతి తరగతిలోను పరీక్షలు రాసిందని, ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు మా స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న శ్రీధరరావుకు చెబుతుండగా అతను రాస్తున్నాడని తెలిపింది. మా స్కూల్‌లో ఇంగ్లీషు మాస్టారు ఛార్లెస్ స్ఫూర్తితో తాను కూడా ఇంగ్లిషు టీచరు అవ్వాలని ఉందని చెప్పింది. అంధత్వం ఆత్మవిశ్వాసానికి అడ్డుకాదని పేర్కొంది. మంచి గ్రేడుతోనే పదవతరగతి పరీక్షల్లో విజేతగా నిలుస్తానని ధీమా వ్యక్తం చేసింది.
Advertisement
Advertisement