జలకన్య, మత్స్య కన్య అని వినపడగానే ఎక్కడ? ఎక్కడ? అని చూస్తుంటారు చాలామంది. శరీర పైభాగం మనిషిగా, కింది భాగం చేపరూపంలో ఉండే జలకన్యలంటే ఆసక్తి ఉండనిదెవరికి? జలకన్యను చూసేందుకు అందరూ ఆరాటం దగ్గరే ఆగిపోతే, మాస్ గ్రీన్ మాత్రం మత్స్యకన్యపై మరింత మక్కువతో తానే ఓ జలకన్యగా మారి పోయింది. మత్స్యకన్యలా ఈదుతూ... ఈ ఉద్యోగం ఎంత బావుందో అని తెగ సంబరపడిపోతుంది.
యూకేలోని టార్క్వే నగరానికి చెందిన ముప్ఫైమూడేళ్ల మాస్‌గ్రీన్ 2016లో ఇటలీలోని సిసిలీ వెళ్లింది. అక్కడ ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన సమయంలో ఏం చేయాలో తోచక కొత్తగా ఏదైనా చేయాలనుకుంది. అలా ఆలోచిస్తున్న సమయంలో ఇంటికి దగ్గరలో ఉన్న బీచ్‌లో ఒకతను ‘మ్యాజికల్ మెర్మాన్’ డ్రెస్‌లో కనిపించాడు. అది చూసిన మాస్‌కు చాలా ఆసక్తిగా అనిపించింది. వెంటనే జలకన్య ఎలా ఉంటుందో తెలుసుకుని, తను కూడా అలా తయారవాలనుకుంది. అప్పటి నుంచి జలకన్యగా తయారవడం తనకెంతో ఇష్టమైన హాబీగా మార్చుకుంది. మత్య్సకన్యగా రెడీ అయ్యి తనని తాను చూసుకుంటూ తెగమురిసిపోయేది.
ఇన్‌స్టాగ్రామ్ ఆఫర్‌తో...
మత్య్సకన్యగా తయారైన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేస్తుండేది. ఆ ఫొటోలు చూసిన ఓ సంస్థ మత్య్స కన్య ఉద్యోగం ఇస్తాం అని మాస్‌ని పిలిచింది. దీంతో సిసిలీ బీచ్‌కు దగ్గర్లో ఉన్న ‘లాంపేడుసా’ ఐలాండ్‌లో మత్య్సకన్యగా పనిచేస్తోంది. ఊపిరిని బిగపట్టి నీటి అడుగు భాగంలో డైవింగ్ చేయడం, నిజమైన జలకన్యలా అటు ఇటు తిరగడం వంటి విన్యాసాలతో పర్యాటకుల్ని ఆకర్షించడమే ఆమె ఉద్యోగం.
బోట్ టూర్స్‌కు గైడెన్స్ ఇస్తూనే, జలచరాలు నీటిలో ఎలా కదులుతాయో చెబుతూ పర్యాటకులకు ఈదడం నేర్పించడం ఈ ఉద్యోగంలో చేయాల్సిన ఇతర ముఖ్యమైన పనులు. వేసవి సమయాల్లో రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసం మాస్ వివిధ రకాల చేపల కదలికను గమనించి, ఈదడంలో మెళకువలు నేర్చుకుంది. ఊపిరిని బిగపట్టడాన్ని ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని కష్టపడి అభ్యసించింది. ప్రస్తుతం తన వృత్తిలో ఎంతో సంతోషంగా ఉంది మాస్ గ్రీన్.మాస్ గ్రీన్ తన ఆసక్తితో సరికొత్త ఉద్యోగాన్ని సృష్టించి ఎంతో మంది నిరుద్యోగులకు కొత్త దారి చూపించింది. ఇష్టం, చేయాలన్న సంకల్పం ఉంటే ఏదో రకంగా దారి దొరుకుతుందనడానికి ఈ జలకన్య ఉద్యోగమే ఉదాహరణగా నిలుస్తోంది.
ఖర్చులకు సరిపోతుంది..
‘‘టీచర్‌గా పనిచేసేటప్పుడు వచ్చే జీతం కంటే మత్య్సకన్య ఉద్యోగానికి జీతం తక్కువే. అయినా నా ఖర్చులకు తగినంత సంపాదిస్తున్నాను. ఇది చాలు. ఈ ఉద్యోగం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. అమ్మకు.. మత్య్స కన్య హాబీ గురించి తెలిసినప్పుడు.. అసాధారణమైనదిగా భావించారు. కానీ దీనినే కెరీర్‌గా ఎంచుకుంటానని ఆమె అస్సలు అనుకోలేదు. నా సంతోషం చూసి ఇప్పుడు అమ్మే నన్ను∙ప్రోత్సహిస్తున్నారు’’ .
– మాస్ గ్రీన్.
Comments
Please login to add a commentAdd a comment