లారీ, ఆర్టీసీ బస్సు ఢీ
రంగంపేట, న్యూస్‌లైన్ :ఏడీబీ రోడ్డుపై రంగంపేట ఎస్టీకాలనీలోని రైస్‌మిల్లు ఎదురుగా శనివారం ఉదయం సుమారు 8 గంటలకు లారీ, ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కుడికాలు విరిగిపోగా, బస్సులోని 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నుంచి రాజమండ్రి వస్తున్న ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు, రాజమండ్రి నుంచి పెద్దాపురం వస్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ వైపు భాగం నుజ్జునుజ్జయ్యింది. కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలం ముజ్జెనపల్లి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గంటా రాంబాబు కుడికాలు రెండుచోట్ల విరిగిపోయింది. ఎడమకాలికి స్వల్పగాయమైంది. అతడు సుమారు గంటకు పైగా లారీ కేబిన్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించాడు. లారీ క్లీనర్ స్వల్పగాయంతో బయటపడ్డాడు.
రంగంపేట ఎస్సై ఆర్.అంకారావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయిన్‌తో లారీడ్రైవర్‌ను బయటకు తీయించి, 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే లారీకి అతుక్కుపోయిన ఆర్టీసీ బస్సును కూడా ప్రొక్లెయిన్ సాయంతో విడదీశారు. గాయాలపాలైన ప్రయాణికులను రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం ఆస్పత్రులకు త రలించారు. బస్సు డ్రైవర్ కాకినాడ డిపోకు చెందిన కొండా కోదండ రాముడుతో పాటు ప్రయాణికులు కాకినాడకు చెందిన గవర్‌చంద్‌జైన్, ద్రాక్షారపు వీర్రాజు,నూకరత్నం, వీరనరేష్, పొన్నాడ వెంకట సూర్యగణేష్, నాగమణి, వాడపల్లి తేజశ్రీ, శేషసత్యరాగవేణి తదితరులకు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆర్టీసీ డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు చె బుతున్నారు.