ఇన్నోవా, లారీ ఢీకొన్న దృశ్యం
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి సమీపంలో ఆదివారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 9 మంది ఇన్నోవా వాహనంలోనే మరణించగా.. దాన్ని నడుపుతున్న పెళ్లికుమార్తె తండ్రి, బీజేపీ నేత కోకా వెంకటప్పనాయుడు (58) ఆస్పత్రిలో ప్రాణాలొదిలారు. అనంతపురం–బళ్లారి జాతీయ రహదారిపై ఇన్నోవా వాహనం, ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న పెద్దలారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన వెంకటప్పనాయుడు కుమార్తె వివాహవేడుక ఆదివారం కర్ణాటక బళ్లారిలో జరిగింది. పెళ్లి ముగిశాక వెంకటప్పనాయుడు, ఆయన బంధువులు 8 మంది ఇన్నోవా వాహనంలో నింబగల్లుకు బయలుదేరారు. వెంకటప్పనాయుడు డ్రైవింగ్ చేయసాగారు. బూదగవి వద్ద వీరి వాహనం, అనంతపురం నుంచి బళ్లారి వైపు ఇనుప ఖనిజం లోడుతో వెళుతున్న లారీని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు రెండు వాహనాలు రోడ్డుపక్కనున్న పొలంలోకి దూసుకెళ్లాయి. ఇన్నోవా ముందుభాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాలన్నీ ఛిద్రమై.. ఇన్నోవాలోనే ఇరుక్కుపోవడంతో జేసీబీ సాయంతో వెలికి తీయాల్సి వచ్చింది.
చదవండి: చిన్నారిని లాక్కొని గొంతు నులుముతూ.. గొలుసివ్వకపోతే.. చంపేస్తాం!
అంతా బంధువులే..
ప్రమాదంలో కోకా వెంకటప్పనాయుడుతో పాటు బంధువులు బొమ్మనహాళ్ మండల కేంద్రానికి చెందిన సరస్వతి(60), ఆమె కుమారుడు అశోక్(35), కుమార్తె స్వాతి(38), స్వాతి కవల పిల్లలు జాహ్నవి (12), జశ్వంత్ (12), కణేకల్లు మండలం హనుమాపురానికి చెందిన రాధమ్మ(48), రాయలప్పదొడ్డికి చెందిన సుభద్రమ్మ(60), పిల్లలపల్లికి చెందిన శివమ్మ (35) మృతిచెందారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఇన్నోవా వంద కిలోమీటర్లకుపైగా వేగంతో వెళుతున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదస్థలాన్ని ఎస్పీ ఫక్కీరప్ప, గుంతకల్లు డీఎస్పీ నర్సింగప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రి మార్చురీలోని మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పరిశీలించి, మృతుల కుటుంబాలను ఓదార్చారు. కాగా మృతుల కుటుంబాలకు ఎంపీ తలారి రంగయ్య సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment