మంత్రి బాలరాజు
పాడేరు, న్యూస్‌లైన్: ఏజెన్సీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1100 కోట్లు మంజూరు చేసినట్టు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు తెలిపారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వంతాడపల్లి నుంచి అడ్డుమండ వరకు రూ.కోటి 79 లక్షలతో నిర్మించే తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. తుంపాడ, గుత్తులపుట్టు గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలు, రూ.13.50 లక్షలతో నిర్మించిన గుత్తులపుట్టు జీసీసీ గిడ్డంగిని ప్రారంభించారు.
పాడేరులోని పంచాయతీ కార్యాలయం వెనుక సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుంపాడలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఒక్క పాడేరు మండలం అభివృద్ధికే రూ.100 కోట్లు మంజూరు చేసినట్టు తెలిపారు. గిరిజనులకు విద్య, వైద్య కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తాగునీటి సౌకర్యాల కల్పనకు భారీగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. గిరిజన యువత ఉపాధికి చర్యలు తీసుకున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్, ఆర్డీవో ఎం.గణపతిరావు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ఈఈలు సుబ్బారావు, మురళీకృష్ణ, ఎం.ఆర్.జి.నాయుడు, జీసీసీ డీఎం ప్రతాప్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ బి.మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు, డీసీసీ కార్యదర్శి సతీష్‌వర్మ, పలు పంచాయతీల సర్పంచ్‌లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి
పాడేరు: కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులంతా గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేయాలని మంత్రి బాలరాజు కోరారు. స్పెషల్ డీఎస్సీ 2013 ద్వారా ఎంపికైన 56 మంది ఉపాధ్యాయులకు శనివారం రాత్రి ఐటీడీఏ కార్యాలయంలో ఆయన నియామకపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. వసతి, తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది చలి కాలానికి ముందే గిరిజన సంక్షేమ ఆశ్రమాల్లోని విద్యార్థులందరికీ రగ్గులు పంపిణీ చేశామని చెప్పారు. ఉపాధ్యాయులంతా సాటి గిరిజనుల విద్యాభివృద్ధికి కృషి చేసి మంచి గిరిజన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వినయ్‌చంద్, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మౌలిక సదుపాయాలకు రూ.1100 కోట్లు
Published Sun, Dec 15 2013 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement
Advertisement