ప్రగతి పథంలో 'పల్లెలు'  | Development in full swing along with welfare in villages of AP | Sakshi
Sakshi News home page

ప్రగతి పథంలో 'పల్లెలు' 

Published Tue, Mar 23 2021 4:52 AM | Last Updated on Tue, Mar 23 2021 4:52 AM

Development in full swing along with welfare in villages of AP - Sakshi

వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి మండలం అలవలపాడులో రోజూ తాగునీటితో పాటు ఇతర అవసరాల కోసం పైపులైన్‌ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని ఇళ్లకు కొత్తగా కుళాయిలు ఏర్పాటు చేసింది. గ్రామంలో 564 ఇళ్లు ఉండగా 2020 ఏప్రిల్‌ తర్వాత ఒక్క ఏడాదిలో 308 ఇళ్లలో కుళాయిలు ఏర్పాటయ్యాయి.

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ప్రజల కనీస అవసరాలు తీర్చే మౌలిక సదుపాయాల కల్పనను తొలి ప్రాధాన్యంగా చేపట్టి పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. కేవలం ఒక్క ఏడాది కాలంలో రాష్ట్రంలో 11.38 లక్షల ఇళ్లలో ప్రభుత్వం కొత్తగా మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేసింది.  ఇక గత 20 నెలల వ్యవధిలో మొత్తం 12,57,434 ఇళ్లకు కొత్తగా నీటి కుళాయి వసతి కల్పించారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వంద శాతం ఇళ్లలో నీటి కుళాయిల ఏర్పాటు పూర్తికాగా ఇతర చోట్ల పురోగతిలో సాగుతున్నాయి. 1,493 గ్రామాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయిల ఏర్పాటు పూర్తయినట్లు గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు చెబుతున్నారు. దాదాపు రూ.12 వేల కోట్లు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో 95.66 లక్షల ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. తొలిదశలో రూ.4,800 కోట్లతో పనులు చేపట్టారు.

రూ.8,368 కోట్లతో భవనాల నిర్మాణాలు..
గ్రామీణ ప్రజలు మండల కేంద్రాలు, పట్టణాల దాకా వెళ్లి పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా  ప్రభుత్వ సేవలన్నీ ఆ ఊరిలోనే అందుబాటులో ఉండేలా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పాలనను పల్లెల చెంతకు చేర్చింది. గ్రామ సచివాలయాల నుంచి రైతుల     అన్ని అవసరాలు తీర్చేలా రైతు భరోసా కేంద్రాలు, ప్రాథమిక వైద్య సేవలు స్థానికంగా అందించేందుకు హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామాల్లో వివిధ రకాల భవనాల నిర్మాణానికి రూ.8,368 కోట్లు మంజూరు చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక కేవలం ఆరు నెలల వ్యవధిలో 1.34 లక్షల మందిని కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించిన విషయం తెలిసిందే. అన్ని గ్రామాల్లో ఆయా కార్యాలయాలకు ప్రత్యేక భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. 

వడివడిగా నిర్మాణాలు..
రాష్ట్రంలో 5,210 గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణాలు పూర్తి కాగా 1,495 చోట్ల పూర్తయ్యే దశలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామ సచివాలయాల  భవన నిర్మాణాలకు ప్రభుత్వం రూ.1,183 కోట్లు ఖర్చు చేసింది. రూ.2,300.61 కోట్లతో 10,408 చోట్ల రైతు భరోసా కేంద్రాలకు అదనపు భవనాల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. 1,545 భవనాలు ఇప్పటికే పూర్తవగా, మరో 243 పూర్తయ్యే దశలో ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల భవన నిర్మాణానికి రూ.357.88 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేసింది. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ భవనాల నిర్మాణానికి రూ. 191.61 కోట్లు, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు రూ. 335.38 కోట్లు, గ్రామాల్లో పాలసేకరణ కేంద్ర భవన నిర్మాణాలకు రూ.57.29 కోట్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేసినట్టు అధికారులు వెల్లడించారు.   

గ్రామీణ రోడ్లకు రూ. 973.64 కోట్లు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా రోడ్ల నిర్మాణం, అవసరమైన చోట మరమ్మతులకు రూ.973.64 కోట్లు ఖర్చు చేసినట్లు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఈఎన్‌సీ సుబ్బారెడ్డి వెల్లడించారు. పీఎంజీఎస్‌వై పథకం ద్వారా రూ.246.50 కోట్లతో 345 కి.మీ మేర కొత్తగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పటిదాకా సరైన రోడ్డు వసతి లేని చిన్నచిన్న గ్రామాలకు కొత్తగా రహదారి సదుపాయం కల్పించేందుకు రూ. 332 కోట్లు ఖర్చు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ విభాగాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం అంబటివారిపాలెం, తాటికాయలవారిపాలెం, పోతవరం గ్రామాలకు వెళ్లాలంటే పొలాల మధ్య ఉండే మట్టి రోడ్డే దిక్కు. వర్షం కురిసిందంటే నల్లరేగడి పొలాల్లో మట్టి రోడ్డులో నాలుగు చక్రాల వాహనంలో ప్రయాణం అసాధ్యమే. సాధారణ రోజుల్లో కూడా అక్కడి రైతులు ధాన్యం బస్తాలను ట్రాక్టర్లులో తరలించే వీలులేక ఎడ్ల బండ్లపైనే ఇంటికి తీసుకొస్తారు. రెండు నెలల క్రితం మట్టి రోడ్డు స్థానంలో రావులపాలెం ప్రధాన రహదారి నుంచి అంబటివారిపాలెం వరకు రెండు కిలోమీటర్ల మేర కొత్తగా తారు రోడ్డును ప్రభుత్వం నిర్మించింది. రేగడి నేలలో రోడ్డు కుంగిపోకుండా ఎక్కువ కాలం మన్నేలా అత్యంత ఆధునిక జియో మ్యాట్‌ టెక్నాలజీతో రూ.2.20 కోట్లతో రహదారి సదుపాయం కల్పించడంతో మూడు గ్రామాలకు ఇక్కట్లు తొలిగాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement