కర్నూలు(అర్బన్): పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణాలు పూర్తయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తోంది. కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తోంది. జిల్లాలో మొత్తం 672 జగనన్న లేఅవుట్ల ఉన్నాయి. వీటిలో పలు లే అవుట్లకు సరైన దారి సౌకర్యం లేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ నిర్మాణాల్లో వేగం పెరగడం లేదు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని 46 లేఅవుట్లకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.2.35 కోట్లు మంజూరు చేసింది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
రూ.25 లక్షలతో గోడౌన్ల నిర్మాణం
ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులు సిమెంట్, స్టీల్ తీసుకువెళ్లేందుకు ఇబ్బంది పడకూడదనే భావనతో జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో అదనంగా గోడౌన్లను నిర్మించనున్నారు. ఆదోని, హొళగుంద, ఉడుములపాడు, దొరపల్లిగుట్ట, నందికొట్కూరులోని పగిడ్యాల రోడ్‌లో ఈ గోడౌన్లను నిర్మించనున్నారు. ఒక్కో గోడౌన్ నిర్మాణానికి రూ.5 లక్షలు వెచ్చించనున్నారు. జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఈ పనులు చేపట్టనున్నారు.
అందుబాటులో ఇసుక
గృహాలు నిర్మించుకుంటున్న పేదలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇసుకను అందుబాటులో ఉంచారు. జిల్లాలోని 28 పెద్ద లేఅవుట్లను గుర్తించి వాటిలో ఇసుకను డంప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 12,737 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచారు. లబ్ధిదారులకు సంబంధిత మండల ఏఈ ఇండెంట్‌ను రైజ్ చేసిన వెంటనే, ఆయా సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ ఇసుకను అందించి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారు.
చాలా సంతోషం
మాకు ఎమ్మిగనూరు రోడ్డులోని మంచాల కాలనీ 1లో ఇల్లు మంజూరైంది. రోడ్డు సౌకర్యం లేక పోవడంతో వంక దాటి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కాలనీలోకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు మంజూరు చేయడం చాలా సంతోషం. రోడ్డు వేస్తే ఇంటి నిర్మాణం వేగంగా పూర్తవుతుంది.
– జంగం పంకజ, మంత్రాలయం
గృహ నిర్మాణాల్లో వేగం పెరిగింది
లేఅవుట్లలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తోంది. దీంతో గృహ నిర్మాణాల్లో వేగం పెరిగింది. జగనన్న కాలనీలకు ప్రత్యేకాధికారులను నిర్మించాం. వీరు లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంది.
– నారపురెడ్డి మౌర్య, జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)
ఉపయోగకరం
మా ఇల్లు బేస్‌మెంట్ లెవెల్ పూర్తయి, గోడల పని జరుగుతోంది. కాలనీలోకి వెళ్లేందుకు రోడ్డు కొంచెం ఇబ్బందిగా ఉంది. అప్రోచ్ రోడ్డు వేస్తామని అధికారులు చెబుతున్నారు. గృహాలు నిర్మించుకుంటున్న మా లాంటి వారికి ఈ రోడ్డు ఉపయోగకరంగా ఉంటుంది.
– ఎద్దులదొడ్డి భువనేశ్వరి, పత్తికొండ
Comments
Please login to add a commentAdd a comment