
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 9.30కు తాడేపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు బయలుదేరతారు. 11.20కి ఊరందూరు చేరుకొని పైలాన్ ఆవిష్కరించి, పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేస్తారు. అనంతరం అక్కడ జరిగే సభలో ప్రసంగిస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. కాగా, ఊరందూరులో వైఎస్సార్ జగనన్న కాలనీలో 167 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో 6,232 ప్లాట్లు వేశారు. వీటిలో 4,299 ప్లాట్లను పట్టణ పేదలకు, 465 శ్రీకాళహస్తి రూరల్, 1,468 ప్లాట్లు ఏర్పేడు రూరల్ ప్రాంతాలకు చెందిన పేదలకు కేటాయించారు. తొలివిడతలో భాగంగా 5,548 ఇళ్ల నిర్మాణానికి సోమవారమే శ్రీకారం చుట్టనున్నారు. కాలనీని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు 8,600 మొక్కలు నాటారు.