సాక్షి, అమరావతి: ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి ఇల్లు నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయానికి.. అక్కడ ఇళ్ల సంఖ్య ఆధారంగా అవసరమైన మేరకు బోర్ల తవ్వకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోరు తవ్విన చోట నీటిని నిల్వ ఉంచడానికి వీలుగా పెద్ద పెద్ద నీటి తొట్టెలు లేదా ప్లాస్టిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయబోతోంది. ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులు కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించే ప్రక్రియను కూడా శుక్రవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
మార్చి 15 నాటికి పూర్తి
► లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీలో నీటి వసతిని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపిక చేసిన దాదాపు 8,000 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పనకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్‌డబ్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.920 కోట్లు నీటి వసతి కోసం ప్రభుత్వం వెచ్చించనుంది.
► గృహ నిర్మాణ శాఖ నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల వివరాలను సేకరించి.. ఎన్ని బోర్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అంచనాలు తయారు చేసే పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు ఆర్‌డబ్యూఎస్ ఈఎన్‌సీ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
► మొదటి దశకు ఎంపిక చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మార్చి 15 నాటికి నీటి వసతి కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి మొదటి వారం కల్లా జిల్లాల వారీగా ఏయే కాలనీలలో ఎన్ని బోర్లు అవసరం అన్న దానిపై అంచనాలు సిద్ధం అవుతాయని ఆర్‌డబ్ల్యూఎస్ సీఈ సంజీవరెడ్డి చెప్పారు.
పట్టణ కాలనీల్లో పబ్లిక్ హెల్త్.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూఎస్
వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ ద్వారా పనులు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధేశించుకున్న కాలనీలన్నింటికి నీటి వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం.
– ఆర్.వి.కృష్ణారెడ్డి, ఈఎన్‌సీ, ఆర్‌డబ్ల్యూఎస్
పట్టణాల్లోని కాలనీల్లో నీటి వసతికి రూ.279 కోట్లు
వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా కోసం తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన కాలనీల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్లు వేయడంతో పాటు నీటి సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.279 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈమేరకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది.
– చంద్రయ్య, ఈఎన్‌సీ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం
ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు
Published Sun, Dec 27 2020 4:59 AM | Last Updated on Sun, Dec 27 2020 5:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment