సొంతింటి కల సాకారం | AP CM YS Jagan Launches YSR Jagananna Illa Pattalu Distribution | Sakshi
Sakshi News home page

సొంతింటి కల సాకారం

Published Sat, Dec 26 2020 5:38 AM | Last Updated on Sat, Dec 26 2020 11:50 AM

AP CM YS Jagan Launches YSR Jagananna Illa Pattalu Distribution - Sakshi

తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో ఓ చెల్లెమ్మకు ఇంటి స్థలం పట్టా అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

కొమరగిరి నుంచి సాక్షి ప్రతినిధి : క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోటి 24 లక్షల మందికి మేలు చేకూరే ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని చెప్పారు. శుక్రవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో వైఎస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌లో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పైలాన్‌ ఆవిష్కరించి, పేదలకు నిర్మించి ఇచ్చే ఇంటి మోడల్‌ను సందర్శించారు. అనంతరం లబ్ధిదారులనుఉద్దేశించి మాట్లాడారు. రూ.50,940 కోట్లతో రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇవాళే శ్రీకారం చుడుతున్నామన్నారు. వీటి విలువ అక్షరాలా రూ.28 వేల కోట్లు అని, వీటితో పాటు 2.62 లక్షల టిడ్కో ఇళ్లకు కూడా సేల్‌ అగ్రిమెంట్‌ ఇవ్వబోతున్నామని చెప్పారు.

రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్ల నిర్మాణం వచ్చే ఏడాది మొదలవుతుందన్నారు. ‘ఒక్కసారి ఈ లేఅవుట్‌లు చూస్తుంటే, ఇక్కడ వైఎస్సార్‌ జగనన్న కాలనీలు కాదు.. ఏకంగా ఊళ్లు రాబోతున్నాయి. అక్షరాలా 16,681 ఇళ్ల స్థలాల పట్టాలు. వాటిలో వైఎస్సార్‌ జనతా బజార్, వైఎస్సార్‌ క్లినిక్, బస్టాప్, అంగన్‌వాడీ కేంద్రం, ఫంక్షన్‌ హాలు, ప్రైమరీ స్కూల్, హైస్కూల్, కమ్యూనిటీ హాలు, పార్కుల వంటివి కాలనీ సైజును బట్టి ఏర్పాటవుతాయి’ అని వివరించారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..


ఒక్కో ప్లాటు విలువ రూ.4 లక్షలు
► ఇప్పుడు ఈ లేఅవుట్‌లోని ఒక్కో ప్లాటు మార్కెట్‌ విలువ రూ.4 లక్షలు. అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా నాతో దేవుడు ఇంత మంచి కార్యక్రమం చేయిçస్తున్నాడు. ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది?.

► సొంత ఇల్లు లేని వారి బాధ నాకు తెలుసు. నా సుదీర్ఘ 3,648 కి.మీ. పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చూశాను. ఆ పరిస్థితి మార్చాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో చెప్పాను.

► మనకు ఓటు వేయకపోయినా సరే అర్హత ఉంటే ఇవ్వాలని దిశా నిర్దేశం చేశాం. చెప్పిన దానికి మించి 30.75 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఇళ్లు కూడా కట్టించి ఇవ్వబోతున్నామని మీ బిడ్డగా గర్వంగా చెబుతున్నా.


ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు
► రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీలు వస్తున్నాయి. ఈ కాలనీల్లో లేఅవుట్లు వేసి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, తాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్‌ వంటి అన్ని సదుపాయాలు కల్పించబోతున్నాం. వాటికి మరో రూ.7 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా.  

► గతంలో 224 చదరపు అడుగుల ఇల్లు మాత్రమే కడితే, ఇవాళ 340 అడుగుల్లో లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కట్టించి ఇస్తున్నాం. మొత్తం 68,361 ఎకరాల్లో లేఅవుట్లు వేసి, ప్లాట్లు చేసి అక్క చెల్లెమ్మలకు ఇవ్వబోతున్నాం. వాటి మార్కెట్‌ విలువ అక్షరాలా రూ.25,530 కోట్లు. పట్టణ ప్రాంతాల్లో సెంటు నుంచి సెంటున్నర వరకు, గ్రామీణ ప్రాంతాల్లో కచ్చితంగా 1.5 సెంట్ల భూమి ఇస్తున్నాం.

► ఇంట్లో ఒక బెడ్రూమ్, లివింగ్‌ రూమ్, కిచెన్, వరండా, టాయిలెట్, పైన సింటెక్స్‌ ట్యాంక్, ఇంట్లో రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్‌ లైట్లు, మరో రెండు ఎల్‌ఈడీ లైట్లు కూడా ఉంటాయి. కాలనీల్లో 13 లక్షల మొక్కలు నాటిస్తాం.


రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలనుకున్నా..
► ఇల్లు కట్టించి ఇచ్చాక 5 ఏళ్లకు ఆ అక్క చెల్లెమ్మలకు అవసరమై ఆ ఇల్లు అమ్ముకోవాలన్నా లేదా ఇంటిపై రుణం పొందాలన్నా అన్ని హక్కులు ఉండేలా పక్కాగా రిజిస్ట్రేషన్‌ చేయించి ఇవ్వాలనుకున్నాను. అయితే కొందరి కుట్రలు, కుతంత్రాల వల్ల జాప్యం జరుగుతోంది.

► న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే, డి–ఫామ్‌ పట్టాల స్థానంలో సర్వ హక్కులతో అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించి ఇస్తాం. ఇందు కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా పోరాడుతుంది. కొందరి దుర్బుద్ధి వల్ల ఈ పట్టాల పంపిణీ ఇప్పటికే పలు మార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

► మన 18 నెలల పాలన కాలంలో ఏకంగా రూ.77 వేల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఇలా మేలు జరుగుతోంటే పసుపు పార్టీల ముఖాలు ఎరుపు రంగుకు ఎలా మారుతున్నాయో మీరంతా చూస్తున్నారు.


టిడ్కో ఇళ్లు (ఫ్లాట్లు)
► టిడ్కో ఇళ్లకు (ఫ్లాట్లు) గత ప్రభుత్వం రూ.3 వేల కోట్లు బకాయి పెట్టి, సగంలో వదిలేసి పోయింది. 2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందిస్తాము. వాటిని పూర్తి చేయడానికి మరో రూ.9,500 కోట్లు ఖర్చు చేయబోతున్నాం.

► ఈ టిడ్కో ఇళ్లలో 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికి ఇచ్చే జగనన్న స్కీమ్‌ కావాలా? లేక మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించే చంద్రబాబు స్కీమ్‌ కావాలా? అని రాష్ట్ర వ్యాప్తంగా ఆప్షన్‌ కోరితే ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీమ్‌ కావాలన్నాడు. ఆయన కోరిక ప్రకారం ఆయనకు ఆ స్కీమ్‌. మిగిలిన వారికి జగనన్న స్కీమ్‌ ఇస్తాం.

► 300 చదరపు అడుగుల ఇంటిని కేవలం ఒక్క రూపాయికే ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.3,805 కోట్ల భారం పడుతోంది. 365, 430 అడుగుల ఇళ్ల లబ్ధిదారులు వారు కట్టాల్సిన ముందస్తు వాటాలో 50 శాతం ప్రభుత్వం భరిస్తుండటం వల్ల ప్రభుత్వంపై రూ.485 కోట్లు భారం పడుతోంది. అయినా చిరునవ్వుతో భరిస్తున్నాం.  
చట్టబద్ధమైన హక్కు

► 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. అంటే ఇల్లు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అయినా కోర్టులకు వెళ్లడం, అవి స్టేలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.

► ఇల్లు ఇవ్వడం ద్వారా తరతరాలుగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలే కాకుండా, పేదరికంలో మరిగిపోయిన అగ్రకులాలకు చెందిన వారికి సామాజిక గౌరవాన్ని, హోదాను, ఆర్థిక, ఆరోగ్య, భద్రత, మొత్తంగా మా ఇల్లు అనే భావాన్ని కలగజేస్తున్నాం.

► అనంతరం ఇంటి స్థలం పట్టా (డి–ఫామ్‌ పట్టా), ఇంటికి సంబంధించిన నిర్మాణం మంజూరు పేపరు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు సీఎం అందజేశారు. కొమరగిరి లేఅవుట్‌లోని మోడల్‌ హౌస్‌ను సంబంధిత లబ్ధిదారురాలికి  అందజేశారు.

► పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, పి.విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.


30 రకాల వృత్తుల వారికి ఉపాధి
8 ఇల్లు నిర్మాణం అంటే, ముగ్గు పోసి పునాదులు తవ్వడంతో అయిపోదు. ఇన్ని ఇళ్లు కట్టడం అంటే రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందన్నది చూస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. తాపీ మేస్త్రి మొదలు.. కూలీలు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వెల్డర్లు.. ఇలా కనీసం 30 రకాల వృత్తుల వారికి ఉపాధి దొరుకుతుంది.
8    తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్లకు 69.70 లక్షల టన్నుల సిమెంట్, 7.4 లక్షల టన్నుల స్టీల్, 310 లక్షల టన్నుల ఇసుక, 235 కోట్ల ఇటుకలు, 223 కోట్ల మెట్రిక్‌ టన్నుల మెటల్‌ వాడుతున్నారు. వ్యవస్థలో ఆర్థికంగా బూస్ట్‌ వస్తుంది. లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది.


ఇంటి నిర్మాణానికి అక్కచెల్లెమ్మలకు మూడు ఆప్షన్లు
ఆప్షన్‌ 1 : ప్రభుత్వం చూపిన నమూనా మేరకు అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రి ప్రభుత్వం సరఫరా చేస్తుంది. లేబర్‌ చార్జీలు మీ చేతికి ఇస్తాం. మీరే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవచ్చు.

ఆప్షన్‌ 2 : లబ్ధిదారులే ఇంటి సామగ్రి తెచ్చుకుని ఇల్లు కట్టుకోవచ్చు. పనుల పురోగతిని బట్టి దశల వారీగా డబ్బులు మీ చేతికి ఇస్తాం.

ఆప్షన్‌ 3 : ప్రభుత్వమే స్వయంగా మంచి మెటీరియల్‌తో ఇల్లు కట్టించి ఇస్తుంది.
ఇందులో ఏ ఆప్షన్‌ తీసుకున్నా ఫరవాలేదు. వలంటీర్ల సహాయంతో మీకు కేటాయించిన స్థలం వద్ద ఉండండి. అధికారులు మీ దగ్గరకు వచ్చి మీకు డి–ఫామ్‌ పట్టాలు ఇస్తారు. మీ ఫొటోలు తీస్తారు. మీరు ఏ విధానంలో ఇల్లు కావాలో ఆ ఆప్షన్‌కు టిక్‌ చేసి ఇవ్వండి. ఇంకా అర్హులెవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో కేటాయిస్తాం.

ఇది నాకు దేవుడిచ్చిన వరం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి:  ‘పాదయాత్ర సమయంలో సొంతిల్లు లేని నిరుపేదల కష్టాన్ని కళ్లారా చూశాను. వారి సొంతింటి కలను నెరవేరుస్తానని నాడు మాట ఇచ్చా’నని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. ఈరోజు అక్షరాలా 30.75 లక్షల ఇంటి స్థల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం, అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడడం దేవుడిచ్చిన అదృష్టంగా, వరంగా భావిస్తున్నట్లు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. అలాగే, రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్‌ జగన్‌ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం రోజున ముక్కోటి దేవతల ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందం, ఆరోగ్యాలతో విలసిల్లాలని ప్రార్థిస్తున్నానన్నారు. అంతేకాక.. సాటి మనుషులపట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువులపట్ల క్షమ వంటి క్రీస్తు సందేశాలు మనల్ని సన్మార్గంలో నడిపించాలని, రాష్ట్ర ప్రజలపై క్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు.  

మా జీవితంలో నిజమైన పండుగ
అద్దె ఇంట్లో 16 ఏళ్లుగా ఉంటూ ఎన్నో కష్టాలు పడుతున్న మా కుటుంబానికి నేడు నిజమైన పండుగ వచ్చింది. సంక్రాంతి, దసరా వంటి పండుగలు ఏటా వస్తాయి. కానీ ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటున్న ఇంటి స్థలం, సొంత ఇల్లు నేడు సీఎం జగన్‌ అన్న ఇస్తుంటే మా జీవితంలో ఇదే నిజమైన పండుగ. నా భర్తకు రూ.6 వేల జీతం. ఇద్దరు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తున్నాం. ఇంటికి అమ్మా నాన్నలను కూడా పిలవలేని పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేదు. ఇప్పుడు దరఖాస్తు చేయగానే ఇంటి స్థలం వచ్చింది. మా సొంత అన్నే వచ్చి ఈ స్థలం ఇచ్చినట్లుంది. సీఎం జగనన్న రుణం తీర్చుకోలేనిది.  

– రామశెట్టి నాగమల్లేశ్వరి, 3వ వార్డు, కాకినాడ

మీరే మా దేవుడు
సీఎం జగనన్నా.. మీరు మా కుటుంబానికి దేవుడు. మా కలను నిజం చేస్తూ ఇంటి స్థలాన్ని అందించారు. మేము చాలా పేదోళ్లం. ఏటా ఇంటి అద్దె రూ.500 పెంచుతుంటే, ఆ డబ్బులతో మమ్మల్ని  చదివించాలని తక్కువ అద్దెకు దొరికే ఇళ్ల కోసం మా అమ్మ ఎన్నో వీధులు తిరిగిన రోజులు కళ్లెదుట మెదలుతున్నాయి. పెళ్లయ్యాక ఓ రోజు ఇంటి యజమాని మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. చిన్న బాబును ఎత్తుకుని అద్దె ఇంటి కోసం వీధి వీధి తిరిగాం. ఇకపై ఆ కష్టాలు ఉండవన్నా. పిలిచి ఇంటి స్థలం మహిళల పేరుతోనే ఇస్తున్నారు. మీకు కోటి వందనాలన్నా.  
    
– పెంకే నాగ భవాని, బర్మా కాలనీ, 7వ వార్డు, కాకినాడ


అందరికి చోటు ఇస్తేనే అది సమాజం అనిపించుకుంటుంది. అందరికి మంచి చేస్తేనే అది ప్రభుత్వం అని అనిపించుకుంటుంది. అన్ని కులాలు, మతాలు ఉంటేనే రాజధాని అవుతుంది. అటువంటి సమాజాన్ని, ప్రభుత్వాన్ని, రాజధానిని మీ అందరి చల్లని దీవెనలతో నిర్మించుకుందాం.

2011 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4.95 కోట్లు. ఇప్పుడు దాదాపు 31 లక్షల ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నామంటే, ఒక్కో ఇంట్లో సగటున నలుగురిని లెక్కేసుకున్నా దాదాపు 1.24 కోట్ల మందికి మేలు చేస్తున్నాం. ఇదే తూర్పు గోదావరి జనాభా 51.54 లక్షలు. గుంటూరు జిల్లా జనాభా 48.88 లక్షలు. కడప, శ్రీకాకుళం జిల్లాలు కూడా కలిపితే 1.24 కోట్ల మంది. అంటే ఏ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతోందో ఆలోచించండి. 175 నియోజక వర్గాల్లో నేటి నుంచి 15 రోజులు పాటు ఇళ్ల పండుగ జరగబోతోందని సగర్వంగా చెబుతున్నా.
– సీఎం వైఎస్‌ జగన్‌



తూర్పు గోదావరి జిల్లా కొమరగిరిలో పట్టాల ప్రారంభ కార్యక్రమం సభకు భారీగా హాజరైన మహిళలు  


తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన బహిరంగ సభలో ఇళ్ల స్థలాల లేఔట్‌ను చూపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఇళ్ల పట్టాల లేఔట్‌లో లబ్ధిదారులు


సభ ప్రాంగణం సమీపంలో నమూనా ఇంటిని పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌; తూర్పుగోదావరి జిల్లా కొమరగిరిలో జరిగిన బహిరంగ సభ ప్రాంగణం సమీపంలో ఇళ్ల స్థలాల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement