Rural Water Supply Department
-
నేడు ఆర్డబ్ల్యూఎస్ జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్
కర్నూలు (అర్బన్): గ్రామీణ నీటి సరఫరా విభాగం జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 27న ఉదయం 9.30 గంటల నుంచి కర్నూలులోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక ఇంజినీర్ బి.నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ గాయత్రీదేవి పర్యవేక్షణలో ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుందని చెప్పారు. జోన్–4 పరిధిలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఏఈఈ/ఏఈ, డీఈఈలు వస్తారని, ఏఈఈ/ఏఈలకు సంబంధించి 84 ఖాళీలు ఉండగా, 114 స్థానాలు ఖాళీ ఏర్పడబోతున్నాయని వివరించారు. డీఈఈలకు 11 స్థానాలు క్లియర్ వేకెన్సీ కాగా, మరో 11 స్థానాలు ఖాళీ కాబోతున్నాయన్నారు. బదిలీలకు అర్హులైన వారితో పాటు పలు కారణాలతో రిక్వెస్ట్ కోరుతూ మరికొందరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని నోటీస్ బోర్డులో ఖాళీలు, భర్తీ అయిన స్థానాల వివరాలను పొందుపరుస్తామని చెప్పారు. -
ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు
సాక్షి, అమరావతి: ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలి ఇల్లు నిర్మాణ పనులు మొదలు పెట్టే సమయానికి.. అక్కడ ఇళ్ల సంఖ్య ఆధారంగా అవసరమైన మేరకు బోర్ల తవ్వకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బోరు తవ్విన చోట నీటిని నిల్వ ఉంచడానికి వీలుగా పెద్ద పెద్ద నీటి తొట్టెలు లేదా ప్లాస్టిక్ ట్యాంక్‌లను ఏర్పాటు చేయబోతోంది. ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులు కల్పించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించే ప్రక్రియను కూడా శుక్రవారం సీఎం జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మార్చి 15 నాటికి పూర్తి ► లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి కాలనీలో నీటి వసతిని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొదటి దశలో ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఎంపిక చేసిన దాదాపు 8,000 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పనకు గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లు కేటాయించింది. మొత్తంగా రూ.920 కోట్లు నీటి వసతి కోసం ప్రభుత్వం వెచ్చించనుంది. ► గృహ నిర్మాణ శాఖ నుంచి ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు ఇళ్ల స్థలాల వివరాలను సేకరించి.. ఎన్ని బోర్లు ఏర్పాటు చేయాలన్న దానిపై అంచనాలు తయారు చేసే పనులు ఇప్పటికే ప్రారంభించినట్టు ఆర్డబ్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ► మొదటి దశకు ఎంపిక చేసిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మార్చి 15 నాటికి నీటి వసతి కల్పించాలని ఆర్డబ్ల్యూఎస్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జనవరి మొదటి వారం కల్లా జిల్లాల వారీగా ఏయే కాలనీలలో ఎన్ని బోర్లు అవసరం అన్న దానిపై అంచనాలు సిద్ధం అవుతాయని ఆర్డబ్ల్యూఎస్ సీఈ సంజీవరెడ్డి చెప్పారు. పట్టణ కాలనీల్లో పబ్లిక్ హెల్త్.. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డబ్ల్యూఎస్ ద్వారా, పట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పనులు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిర్ధేశించుకున్న కాలనీలన్నింటికి నీటి వసతి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. – ఆర్.వి.కృష్ణారెడ్డి, ఈఎన్సీ, ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల్లోని కాలనీల్లో నీటి వసతికి రూ.279 కోట్లు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నీటి సరఫరా కోసం తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన కాలనీల్లో ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. బోర్లు వేయడంతో పాటు నీటి సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు రూ.279 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఈమేరకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. – చంద్రయ్య, ఈఎన్సీ, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం -
నేను చాలా స్ట్రిట్టు..!
‘నేను రోజుకు పది గంటలు పనిచేస్తున్నా.. నిన్న ఒక్క రోజే రూ.90లక్షల బిల్లులు పాస్ చేశా. ఒక్క పైసా బాకీ లేదు. నా గురించి ఎవరో తప్పుగా చెప్తున్నరు..’ అంటూ పరిగి గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ కిరణ్ కుమార్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన జోక్యం చేసుకుంటూ పైవిధంగా స్పందించారు. ఈ క్రమంలో ఆయన తడబాటు.. చెప్పిన విషయాన్నే పదేపదే చెప్పడం.. పైఅధికారులు వారిస్తున్నా వినకుండా కొంత దూకుడుగా వ్యవహరించడంతో.. మద్యం సేవించి వచ్చారా సార్.. అంటూ సభ్యులు సెటైర్లు విసిరారు. ఇంతలో మంత్రి మహేందర్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ఆయన ఆరోగ్యం బాలేదంటూ వెనకేసుకొచ్చారు. అయినప్పటికీ.. ఈఈ వ్యవహారశైలిపై విచారణ చేపట్టాలని కలెక్టర్ అంతర్గతంగా ఆదేశించినట్లు తెలిసింది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా -
రూ.37.65 కోట్లు ఇవ్వండి ప్లీజ్..
సాక్షి, సంగారెడ్డి: జిల్లాను కలవరపెడుతున్న తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వానికి రూ.37.65 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను అందజేసింది. కరువు, భూగర్భ జలమట్టాలు పడిపోవటం, రిజర్వాయర్లలో నీళ్లు నిండుకోవటంతో తాగునీటి ఇబ్బందులు మొదలయ్యాయి. గ్రామాల్లో బోరుబావులు ఇంకిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్డబ్ల్యూఎస్ రూ.37.65 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది. సీఆర్ఎఫ్ కింద రూ.9.47 కోట్లతో 4,314 పనులు ప్రతిపాదించగా నాన్ సీఆర్ఎఫ్ కేటగిరిలో రూ.28.18 కోట్లతో 76,511 పనులను ప్రతిపాదించింది. తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకోవటం, తాగునీటి రవాణా, బోరుబావులు, రక్షిత మంచినీటి పథకాల మరమ్మతులు, పైప్‌లైన్ పనులను అధికారులు ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేసిన వెంటనే గ్రామాల్లో తాగునీటి సమస్య నివారణ కోసం చర్యలు తీసుకోనున్నారు. 1,939 ఆవాసాల్లో ఎద్దడి.. జిల్లాలోని 1939 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో ఉంటున్న 21.49 లక్షల మంది జనాభా తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు అధికారులు చెప్పారు. ఆయా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ కేటగిరీల్లో నిధులు మంజూరవుతాయని చెబుతున్నారు. గతంలో తాగునీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నాన్ సీఆర్ఎఫ్ కింద భారీగా నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం కరువు పరిస్థితులు, నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగం కోరినంత మేర నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని అంటున్నారు. -
జీతాలకు నోచని నాణ్యతా సిబ్బంది!
రాష్ట్ర వ్యాప్తంగా 8 నెలలుగా జీతాలు నిల్ జిల్లాలో మూడు నెలలుగా పస్తులు మంత్రి, జిల్లా యంత్రాంగానికి విన్నవించినా ప్రయోజనం శూన్యం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : గ్రామీణ నీటి సరఫరా విభాగంలో నీటి నాణ్యతా పరిశీలన సిబ్బంది జీతాల్లేక విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు వ్యక్తిగత బోర్ల నీటి శాంపిళ్లను పరిశీలించాల్సిన సిబ్బందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆందోళన చెందతున్నారు. వాటర్ ఎనలిస్ట్స్, మైక్రో బయాలజిస్ట్‌లు, లాబ్ అసిస్టెంట్లు, హెల్పెర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కన్సల్టెంట్లగా ప్రభుత్వం థర్డ్ పార్టీ ఔట్సోర్సింగ్ విభాగాల ద్వారా సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తోంది. వాస్తవానికి 2009 నుంచీ వీళ్లందర్నీ శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2013లో మరో క మిటీ వేసింది. అయినప్పటికీ చాలీ చాలని జీతాలతోనే తాము కుటుంబాల్ని నెట్టుకువస్తున్నా మని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ఇదీ పరిస్థితి రాష్ర్ట వ్యాప్తంగా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో మొత్తం 497 మంది సిబ్బంది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా శ్రీకాకుళం జిల్లాలో 39 మంది ఉన్నారు. వీరందరికీ 8 నెలల నుంచీ జీతాల్లేవు. సిబ్బంది గగ్గోలు పెడుతుండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయాల ద్వారా ఐదు నెలల వరకూ జీతాలు చెల్లించేసినా మూడు నెలల నుంచీ ఈ విషయమై పట్టించుకోవడం లేదు. జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది సమస్యను అధికార యంత్రాంగం సహా రాజకీయ నేతలు తీసుకెళ్లనీయకుండా చేసిందన్న విమర్శలున్నాయి. అదే విషయమై హైదరాబాద్‌లో ఉన్న చీఫ్ ఇంజినీర్ (గతంలో ఇంజినీర్ ఇన్ చీఫ్) సహా మంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 ల్యాబ్‌లుండగా జిల్లాలో ఎనిమిది మంచినీటి శుద్ధి నాణ్యతా ల్యాబులున్నాయి. 19 డివిజన్లలో, 73 సబ్ డివిజన్ల పరిధిలో 13 జిల్లా స్థాయి ల్యాబ్‌లున్నా ఇందులో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి వీరి జీతాలు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే సంబంధింత జిల్లా సూపరింటెండెంట్ అధికారి ద్వారా చెల్లిస్తారు. ‘స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్’ (ఎస్ఎస్ఆర్) ద్వారా రూ.9 వేల నుంచి రూ.20 వేల (స్థాయిని బట్టి) వరకు చెల్లిస్తున్నారు. అదీ కొంతమందికి నిబంధనలకు అనుగుణంగా కూడా చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. పెండింగ్ వేతనాలకు సంబంధించి గత ఫిబ్రవరిలో కమిటీ వేసి నెల వ్యవధిలో నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఫలితం లేకపోయిందని సిబ్బంది చెబుతున్నారు. -
ఆర్‌డబ్ల్యూఎస్‌లో చాపకింద నీరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఆర్డబ్ల్యూఎస్(గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం)లో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రాజెక్టు విభాగంపై చిచ్చు రేగుతోంది. ఇన్చార్జి ఎస్ఈ గాయత్రి దేవి, ప్రాజెక్టు ఈఈ విద్యాసాగర్ మధ్య ఈ విషయమై అభిప్రాయభేదాలొచ్చాయి. ప్రత్యేకంగా నడుస్తున్న ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి, దాని స్థానంలో పార్వతీపురంలో రెగ్యులర్ డివిజనొకటి ఏర్పాటు చేయాలని గాయత్రిదేవి తెరవెనుక ప్రయత్నిస్తుండగా, ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి తనను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ఎత్తుగడగా విద్యాసాగర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆర్‌డబ్ల్యూఎస్‌లో రెండు గ్రూపుల మధ్య విభేదాలు చినికి చినికి గాలివానగా మారినట్టు ఎక్కడివరకు దారితీస్తాయోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రెండు విభాగాలు నడుస్తున్నాయి. అందులో ఒకటి రెగ్యులర్ విభాగం, మరొకటి ప్రాజెక్టు విభాగం. మంచినీటి సరఫరాను సక్రమంగా చేసే బాధ్యతల్ని రెగ్యులర్ విభాగం చూసుకోగా, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలను ప్రాజెక్ట్సు విభాగం చూసుకుంటోంది. రెగ్యులర్ విభాగం ఈఈగా గాయత్రి దేవి, ప్రాజెక్టు విభాగం ఈఈగా విద్యాసాగర్ ప్రస్తుతం ఉన్నారు. మొత్తం జిల్లా ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ ఎస్ఈ ఇన్చార్జి బాధ్యతలను గాయత్రిదేవి తనకున్న పలుకుబడితో ఆమె చేతుల్లోకి తెచ్చుకున్నారు. అంటే ఒకవైపు రెగ్యులర్ విభాగం ఈఈ పోస్టుతో పాటు ఎస్ఈ పోస్టులో గాయత్రిదేవి కొనసాగుతున్నారు. అయితే గాయత్రిదేవి కంటే సీనియర్ అయిన విద్యాసాగర్ ఉన్నప్పటికీ ఆయన్ను కాదని ఆమెకు ఎస్ఈ ఇన్చార్జి బాధ్యతల్ని అప్పగించడం ఆయన వర్గానికి రు చించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2009లో మంత్రిగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజు రెగ్యులర్ డివిజన్, ప్రాజెక్టు డివిజన్ రెండూ విజయనగరంలో ఉంటే ఎలాగని, పార్వతీపురంలో రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేయాలని పట్టుబట్టి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అయితే, దీన్ని అప్పటి మరో మంత్రి బొత్స సత్య నారాయణ అడ్డుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడా ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ద్వారా అక్కడొక రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రత్యేకంగా ప్రాజెక్టు విభాగం ఎందుకని, దాన్ని ఎత్తివేసి పార్వతీపురంలో మరో రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టు వర్కులన్నీ విజయనగరం, పార్వతీపురంలలో కొనసాగే రెగ్యులర్ డివిజన్లకు అప్పగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే, ఈ ప్రతిపాదనను ప్రస్తుత ప్రాజెక్టు విభాగంలో ఉన్న అధికారులు, ఇంజినీరింగ్ అధికారుల అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి రెగ్యులర్ డివిజన్లో కలిపేస్తే ప్రాజెక్టుల పనులు సక్రమంగా జరగవని, పర్యవేక్షణ లోపిస్తుందని, మంజూరైన భారీ మంచినీటి పథకాల నిర్మాణాలు ముందుకు సాగవని అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రాజెక్టు వర్కుల కోసం రెగ్యులర్ విభాగంలో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు వేస్తున్న ఎత్తుగడ అని, వారి స్వార్థం కోసం ప్రాజెక్టు డివిజన్‌ను బలి చేస్తున్నారని ఒక వర్గం వాదిస్తుండగా, రెగ్యులర్ విభాగ పరిధిలో గల పనులన్నీ జిల్లా వ్యాప్తంగా చూసుకోలేకపోతున్నామని, ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమా న్ని పర్యవేక్షణ చేయలేకపోతున్నామని మరో వర్గం వాదనకు దిగుతోంది. కొసమెరుపు ఈ రెండు వర్గాల వాదనలు ఎలా ఉన్నా ప్రాజెక్టుల పర్యవేక్షణ చేపడితే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చని, ఇంతవరకు దాన్ని మిస్సయిపోయామని ఒక వర్గం..భావన. ఇంతకాలం అనుభవించింది మిస్సయిపోతామని మరో వర్గం ఆందోళన.. ఈ నేపథ్యంలోనే తాజా పోరుకు తెరలేచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏడాదిలోగా ప్రతి స్కూల్లో మరుగుదొడ్లు!
హైదరాబాద్: 2015 ఆగస్టు 15 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి సదుపాయం కూడా కచ్చితంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. సచివాలయంలో సోమవారం పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్ పరిస్థితులపై విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులతో పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు, విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. టాయిలెట్ల నిర్మాణానికి చేపట్టాలని చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భేటీ నిర్ణయాలను జగదీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం 24,364 వరకు పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 4,693 వరకు పాఠశాలల్లో తాగునీటి సదుపాయం కల్పించేందుకు రెండుశాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. 2,100 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ సదుపాయం కల్పించాల్సి ఉందని తేల్చారు. పాఠశాలల్లో టాయిలెట్ల పరిస్థితిపై సమగ్ర నివేదికలను వారంరోజుల్లో తమకు అందజేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.