సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఆర్‌డబ్ల్యూఎస్(గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం)లో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రాజెక్టు విభాగంపై చిచ్చు రేగుతోంది. ఇన్‌చార్జి ఎస్‌ఈ గాయత్రి దేవి, ప్రాజెక్టు ఈఈ విద్యాసాగర్ మధ్య ఈ విషయమై అభిప్రాయభేదాలొచ్చాయి. ప్రత్యేకంగా నడుస్తున్న ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి, దాని స్థానంలో పార్వతీపురంలో రెగ్యులర్ డివిజనొకటి ఏర్పాటు చేయాలని గాయత్రిదేవి తెరవెనుక ప్రయత్నిస్తుండగా, ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి తనను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ఎత్తుగడగా విద్యాసాగర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆర్‌డబ్ల్యూఎస్‌లో రెండు గ్రూపుల మధ్య విభేదాలు చినికి చినికి గాలివానగా మారినట్టు ఎక్కడివరకు దారితీస్తాయోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ పరిధిలో రెండు విభాగాలు నడుస్తున్నాయి.
అందులో ఒకటి రెగ్యులర్ విభాగం, మరొకటి ప్రాజెక్టు విభాగం. మంచినీటి సరఫరాను సక్రమంగా చేసే బాధ్యతల్ని రెగ్యులర్ విభాగం చూసుకోగా, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలను ప్రాజెక్ట్సు విభాగం చూసుకుంటోంది. రెగ్యులర్ విభాగం ఈఈగా గాయత్రి దేవి, ప్రాజెక్టు విభాగం ఈఈగా విద్యాసాగర్ ప్రస్తుతం ఉన్నారు. మొత్తం జిల్లా ఎస్‌ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ ఎస్‌ఈ ఇన్‌చార్జి బాధ్యతలను గాయత్రిదేవి తనకున్న పలుకుబడితో ఆమె చేతుల్లోకి తెచ్చుకున్నారు. అంటే ఒకవైపు రెగ్యులర్ విభాగం ఈఈ పోస్టుతో పాటు ఎస్‌ఈ పోస్టులో గాయత్రిదేవి కొనసాగుతున్నారు. అయితే గాయత్రిదేవి కంటే సీనియర్ అయిన విద్యాసాగర్ ఉన్నప్పటికీ ఆయన్ను కాదని ఆమెకు ఎస్‌ఈ ఇన్‌చార్జి బాధ్యతల్ని అప్పగించడం ఆయన వర్గానికి రు చించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2009లో మంత్రిగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజు రెగ్యులర్ డివిజన్, ప్రాజెక్టు డివిజన్ రెండూ విజయనగరంలో ఉంటే ఎలాగని, పార్వతీపురంలో రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేయాలని పట్టుబట్టి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అయితే, దీన్ని అప్పటి మరో మంత్రి బొత్స సత్య నారాయణ అడ్డుకున్నారన్న వాదనలు ఉన్నాయి.
ఇప్పుడా ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ద్వారా అక్కడొక రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రత్యేకంగా ప్రాజెక్టు విభాగం ఎందుకని, దాన్ని ఎత్తివేసి పార్వతీపురంలో మరో రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టు వర్కులన్నీ విజయనగరం, పార్వతీపురంలలో కొనసాగే రెగ్యులర్ డివిజన్‌లకు అప్పగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే, ఈ ప్రతిపాదనను ప్రస్తుత ప్రాజెక్టు విభాగంలో ఉన్న అధికారులు, ఇంజినీరింగ్ అధికారుల అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి రెగ్యులర్ డివిజన్‌లో కలిపేస్తే ప్రాజెక్టుల పనులు సక్రమంగా జరగవని, పర్యవేక్షణ లోపిస్తుందని, మంజూరైన భారీ మంచినీటి పథకాల నిర్మాణాలు ముందుకు సాగవని అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రాజెక్టు వర్కుల కోసం రెగ్యులర్ విభాగంలో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు వేస్తున్న ఎత్తుగడ అని, వారి స్వార్థం కోసం ప్రాజెక్టు డివిజన్‌ను బలి చేస్తున్నారని ఒక వర్గం వాదిస్తుండగా, రెగ్యులర్ విభాగ పరిధిలో గల పనులన్నీ జిల్లా వ్యాప్తంగా చూసుకోలేకపోతున్నామని, ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమా న్ని పర్యవేక్షణ చేయలేకపోతున్నామని మరో వర్గం వాదనకు దిగుతోంది.
కొసమెరుపు
ఈ రెండు వర్గాల వాదనలు ఎలా ఉన్నా ప్రాజెక్టుల పర్యవేక్షణ చేపడితే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చని, ఇంతవరకు దాన్ని మిస్సయిపోయామని ఒక వర్గం..భావన. ఇంతకాలం అనుభవించింది మిస్సయిపోతామని మరో వర్గం ఆందోళన.. ఈ నేపథ్యంలోనే తాజా పోరుకు తెరలేచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్‌డబ్ల్యూఎస్‌లో చాపకింద నీరు
Published Mon, Mar 16 2015 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement