Internal Fighting
-
అధికార పార్టీలో ధిక్కార స్వరం.. ‘కారు’కు ఏమైంది? సైలెంట్ అవ్వడం తాత్కాలికమేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అధికార పార్టీలో అసమ్మతి స్వరం పెరుగుతోంది. ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుండగా, తాజాగా మహేశ్వరంలో మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సబితారెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం అభివృద్ధే ధ్యేయమంటూ హస్తం పార్టీకి బైబై చెప్పి.. గులాబీ కండువా వేసుకున్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక్కడ అధికార పార్టీ తరఫున పోటీచేసి ఓటమి పాలైన నగర మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి అధిష్టానం హామీతో తాత్కాలికంగా సైలెంట్ అయ్యారు. కోడలు అనితారెడ్డికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టడంలో సఫలీకృతుడయ్యారు. ఇదిలా ఉండగా పార్టీ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో తనకు సరైన ప్రాధాన్యః దక్కడం లేదంటూ ఇటీవల ధిక్కార స్వరం అందుకున్నారు. భగ్గుమంటున్న విభేదాలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సరూర్‌నగర్, ఆర్కేపురం డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో టీఆర్ఎస్కు మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఆయనను చైర్మన్‌గా ఎన్నుకుంది. ఆ తర్వాత మంత్రితో చైర్మన్‌కు పొసగకపోవడంతో ఆయన టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్లలో మెజార్టీ స్థానాలను గులాబీ పార్టీ సొంతం చేసుకుంది. అధికార పార్టీ ఇక్కడ మేయర్లుగా ఎన్నికయ్యారు. వీరిలో బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత.. మంత్రి సబితకు మధ్య అంతర్గత విబేధాలు తార స్థాయికి చేరాయి. మంత్రితో పొసగక మేయర్ దంపతులు, మరో ఇద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అసమ్మతి వర్గం కార్పొరేటర్లతో చర్చలు జరుపుతున్న సమయంలోనే అనూహ్యంగా గత మంగళవారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మంత్రినే టార్గెట్ చేస్తూ ఆమెపై విరుచుకుపడ్డారు. ఇదంతా టీ కప్పులో తుఫాను వంటిదేనని, అన్నతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దుతానని సబిత ప్రకటించారు. నేతల చూపు.. కాంగ్రెస్ వైపు పరిస్థితి చక్కబడకముందే బుధవారం అదే పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కొత్త మనోహర్‌రెడ్డి మంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్లో కొనసాగుతున్న మనోహర్‌రెడ్డితో పాటు మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు బడంగ్పేట్, మీర్‌పేటకు చెందిన మరికొందరు కార్పొరేటర్లు కూడా అసమ్మతి స్వరం వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా అధిష్టానం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసమ్మతి స్వరం పెంచిన సీనియర్లంతా త్వరలోనే పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది. -
కారు ‘ఓవర్‌లోడు’ సౌండ్.. సుమారు 45 నియోజకవర్గాల్లో నువ్వా నేనా?
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీని బహుళ నాయకత్వ సమస్య వెంటాడుతోంది. సొంత పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలతో కారు ఓవర్ లోడ్ కావడం కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను సుమారు 45 స్థానాల్లో టీఆర్ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్యను ఎదుర్కొంటోంది. మరో 20 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితా లను కొంతమేర ప్రభావం చూపగలిగే నేతలు ఉన్నారు. మొత్తంగా కనీసం 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సొంత పార్టీలోని బలమైన నేతలతో తలపడాల్సిన పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ టికెట్ తమనే వరిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలు ఆశావహుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు తమకు టికెట్ కష్టమని భావి స్తున్నవారు.. విపక్ష పార్టీలు చేరికల కోసం చేస్తున్న ప్రయత్నాలను అవకాశంగా తీసుకుని ఒకరి వెంట మరొకరు అన్నట్టుగా సొంతదారి చూసుకుంటున్నారు. మరికొందరు అసంతృప్త నేతలు మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే నేతల అంతర్గత విభేదాలపై ఆరా తీసిన అధినేత ఇప్పటికే దిద్దుబాటు చర్యలకు దిగినట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి. చదవండి👉🏼సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు పీకే నివేదికల నేపథ్యంలో.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బృందం ఈ ఏడాది మార్చిలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు అందజేసింది. ఈ నివేదికలను లోతుగా పరిశీలించి, ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో ఉండే రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో సిట్టింగులు, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సొంత రాజకీయ అస్తిత్వం కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన తప్పనిసరి స్థితిలో కొందరు నేతలు ఇప్పటినుంచే సొంతదారిని వెతుక్కునే పనిలో పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం దక్కదని భావించిన అసంతృప్త నేతలు నల్లాల ఓదెలు (చెన్నూరు), బూడిద భిక్షమయ్య (ఆలేరు), విజయారెడ్డి (ఖైరతాబాద్), తాటి వెంకటేశ్వర్లు (అశ్వారావుపేట) తదితరులు ఇప్పటికే సొంతదారి చూసుకున్నారు. చదవండి👉🏼కేటీఆర్ సెటైర్, దేశ ప్రజలకు మోదీ అందించిన బహుమతి ఇదే! ప్రత్యర్థితో బహిరంగ యుద్ధం రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న కొద్దీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఓ వైపు పార్టీపై, అధినేతపై విశ్వాసం ప్రకటిస్తూనే మరోవైపు స్థానికంగా ఉన్న తమ రాజకీయ ప్రత్యర్థితో బహిరంగ యుద్ధానికి దిగుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు..ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, తాండూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి.. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి..మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బొంతు జన్మదినం పురస్కరించుకుని మంగళవారం భారీయెత్తున దర్శనమిచ్చిన ఫ్లెక్సీలు నియోజకవర్గంలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గం కూడా ఈ జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. హుస్నాబాద్, నకిరేకల్ తదితర అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతల నడుమ ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తోంది. రేగ కాంతారావు, పాయం వెంకటేశ్వర్లు (పినపాక), భానోత్ హరిప్రియ, కోరం కనకయ్య (ఇల్లందు), వనమా వెంకటేశ్వర్రావు, జలగం వెంకటరావు (కొత్తగూడెం), కందాల ఉపేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు (పాలేరు) ఈ జాబితాలో ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరినవారు కావడం గమనార్హం. ఆధిపత్య పోరు కొనసాగుతున్న మరికొన్ని నియోజకవర్గాలు, నేతలు -
టీడీపీలో అంతర్గత పోరు.. మహానాడు సాక్షిగా బీసీ నేతకు అవమానం
టీడీపీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంది. ఆ పార్టీ మహానాడు సాక్షిగా ఒక్కొక్కటి వెలుగుచూస్తున్నాయి. నిన్నటి వరకూ ఫ్లెక్సీల వివాదం నడిస్తే.. నేడు నగరంలోని పార్టీ కార్యాలయాల అంశంలోనూ వర్గ విభేదాలు వెలుగు చూస్తున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన జిల్లా అధ్యక్షుడి కార్యాలయాన్ని మహానాడుకు వచ్చిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు కన్నెత్తి చూడకపోవడంతో వెలవెలబోతోంది. గుంటూరు రోడ్డులోని దామచర్ల కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులు, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. ఇదేమి సామాజిక న్యాయం అంటూ సొంత పార్టీ నాయకులే పెదవి విరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీకి మహానాడు అనేది ఒక పండుగలాంటిది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడ జరుగుతోంది. దాదాపు రెండు వారాలుగా పార్టీ ముఖ్య నాయకుల హడావిడి ఎక్కువగా ఉంది. అయితే ప్రకాశం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈ హడావిడి ఇసుమంతైనా కనపడలేదు. దీంతో భాగ్యనగర్‌లోని ఆ కార్యాలయం వెలవెలబోతోంది. ఈ వైపు టీడీపీకి చెందిన ముఖ్య నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటమే టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం వెలవెలబోవటానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పాత గుంటూరు రోడ్డులోని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కార్యాలయం మాత్రం కళకళలాడుతోంది. చదవండి: చంద్రబాబు, బాలకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్ బీసీలకు టీడీపీ గుండెకాయ వంటిది అని చంద్రబాబు నిత్యం చెబుతుంటారు. టీడీపీకి బీసీలు వెన్నుపూసలాంటి వారు అని కూడా ఆయనే వల్లెవేస్తుంటారు. కానీ బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకే పదవులు ఎరవేయడం, ఆ తర్వాత వారిని అవమానించడం టీడీపీలో కొత్తేమీ కాదు. బీసీ సామాజిక వర్గానికి చెందిన నూకసాని బాలాజీకి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టారు. అయితే పార్టీ అధిష్టానం జిల్లా పార్టీ కార్యాలయానికి, జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇవ్వాల్సిన గౌరవ, మర్యాదలు మాత్రం నేతి బీరకాయలో నేతి చందంగా తయారయ్యాయి. ఆ పార్టీ పండుగలా మహానాడును నిర్వహిస్తున్న సమయంలోనూ భాగ్యనగర్ మూడోలైన్‌లో జిల్లా పార్టీ కార్యాలయం ఓ అనాథలా వెలవెలబోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. పది, పదిహేను రోజుల నుంచి రాష్ట్ర పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ నగరానికి వచ్చి వెళ్తున్నారు. బాలాజీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక్కసారి వచ్చి వెళ్లారు. జనార్దన్ ఆఫీసు కళకళ: ఒంగోల మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌కు చెందిన పాత గుంటూరు రోడ్డులోని కార్యాలయం మాత్రం ఎప్పుడూ నాయకులతో, ముఖ్య నేతలతో కళకళలాడుతోంది. మహానాడుకు వచ్చిన ముఖ్య నేతలు కూడా అక్కడికే వచ్చి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికి చెందిన నేత దామచర్ల జనార్దన్ కావటమే ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. మరి జిల్లా పార్టీ కార్యాలయం ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంటూ ఆ పార్టీలోని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. జనార్దన్ అసలు జిల్లా పార్టీ కార్యాలయంలో అడుగు కూడా పెట్టలేదు. జనార్దన్ ఆయన పార్టీ కార్యాలయం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. టీడీపీలో బీసీలకు పేరుకే పదవులు..అధికారం మాత్రం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారిదేనన్న వాదనలు అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ కేడర్‌లోనూ బలంగా వినిపిస్తోంది. మరి జిల్లా అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వటం ఎందుకు, నూకసాని బాలాజీని ఈ విధంగా అగౌరవ పరచటం ఎందుకని బీసీలకు చెందిన కొందరు నేతలు నేరుగానే ప్రశి్నస్తున్నారు. ఏదిఏమైనా మహానాడు వేదికగా బీసీ నేతకు తీవ్ర అవమానం జరిగిందనే చెప్పాలి. ఫ్లెక్సీల్లో కూడా.. మహానాడు సందర్భంగా ఒంగోలు నగరం మొత్తం టీడీపీ ముఖ్య నేతలతోపాటు ఇతర నాయకుల ఫొటోలతో ఇబ్బడిముబ్బడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల ఏర్పాటులో కూడా బీసీ నేత, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీకి తీవ్ర అవమానం జరిగింది. ఏ పదవులు లేని వారి ఫొటోలను సైతం తాటికాయంతా సైజుల్లో వేసుకున్న ఫ్లెక్సీలో ఏ ఒక్కచోట కూడా బాలాజీ ఫొటోలు ఆ సైజులో లేకపోవడం గమనార్హం. కొన్నింటిలో అయితే బాలాజీ ఫొటోలే లేవు. -
టీడీపీలో చలో ముట్లూరు టెన్షన్..!
సాక్షి, గుంటూరు: ప్రత్తిపాడు టీడీపీ నేతల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే రావెల, జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు గ్రూపులుగా ఏర్పడి పరస్పరం ఘర్షణలకు దిగుతున్నారు. గత నెలలో వినాయకుని విగ్రహం వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రావెలపై మరో వర్గం దాడికి యత్నించిన విషయం తెలిసిందే. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఓ మంత్రి ఒత్తిడితో అరెస్టు చేయకుండా వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత ఎమ్మెల్యేపైన దాడి జరిగి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు నిందితులను అరెస్టు చేయకపోవడంపై దళిత సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పటికే జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు అందడంతో విచారణ జరిపేందుకు కమిషన్ సభ్యుడు రాములు మంగళవారం ముట్లూరు గ్రామానికి రావాల్సి ఉంది. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్నా«థ్ సింగ్ పర్యటన నేపథ్యంలో బుధవారానికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. దళిత సంఘాలు మంగళవారం చలో ముట్లూరు కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అర్బన్ జిల్లా పరిధిలో 30 పోలీసు యాక్ట్, వట్టిచెరుకూరు మండలంలో 144 సెక్షన్ పెట్టారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలో గత నెలలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహానికి పూజలు చేసేందుకు వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును ఆయన వ్యతిరేక వర్గీయులు అడ్డుకుని దాడికి యత్నించిన విషయం తెలిసిందే. దీనిపై రావెల పీఏ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి నెల కావస్తున్నా, నిందితుల్లో ఏ ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే రావెల వర్గీయులతో పాటు, దళిత సంఘాలు మండి పడుతున్నాయి. సాక్షాత్తు దళిత ఎమ్మెల్యేపై దాడి జరిగితేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్య దళితులకు రక్షణ ఎక్కడిదంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఇప్పటికే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వారు పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం తెలిసిందే. అయితే నిందితులను అరెస్టు చేయకుండా జిల్లాలోని ఓ మంత్రితో పాటు, కొందరు ముఖ్యనేతలు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని, అవసరమైతే రాజీనామాకైనా సిద్ధపడతానంటూ మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు రెండో వర్గం సైతం ఎమ్మెల్యే రావెల తమపై అక్రమ కేసులు పెట్టించి వేధింపులకు గురిచేస్తున్నారంటూ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇంటి వద్ద ఆందోళనకు దిగిన విదితమే. ఇలా ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతుండటంతో జిల్లా టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చలో ముట్లూరు పిలుపుతో ఉద్రిక్తత ఈ నేపథ్యంలో దళిత సంఘాల నేతలు మంగళవారం చలో ముట్లూరుకు పిలుపునివ్వడంతో ముట్లూరు గ్రామంతో పాటు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చలో ముట్లూరుకు అనుమతులు లేవని, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. చలో ముట్లూరుకు అనుమతి లేదు గుంటూరు: చలో ముట్లూరు కార్యక్రమానికి పోలీసుల నుంచి ఎవరూ అనుమతులు తీసుకోని నేపథ్యంలో ఆ కార్యక్రమానికి పోలీసు అనుమతులు లేవని అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సోమవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే అర్బన్ జిల్లాలో పోలీస్ యాక్ట్–30 అమల్లో ఉన్న నేపథ్యంలో ధర్నాలు, ర్యాలీలు, «నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే రావెల కిషోర్‌బాబును వినాయక చవితి వేడుకల్లో పాల్గొనడాన్ని అడ్డగించిన నేపథ్యంలో వెల్లువెత్తిన ఫిర్యాదులపై మంగళవారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు ముట్లూరులో పర్యటిస్తారని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు కొనసాగించడం, అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నేరమని తెలిపారు. ముట్లూరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా 144 సెక్షన్ అమలు చేస్తున్నామని వివరించారు. డివిజన్ స్థాయి బందోబస్తుతో పాటు స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలను కూడా కేటాయిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. టీడీపీ హయాంలో దళితులకు రక్షణ లేదు టీడీపీ ప్రభుత్వ హయాలలో దళితులకు రక్షణలేదు. దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేపై దాడికి పాల్పడినవారిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం దురదృష్టకరం. ఎమ్మెల్యే రావెలపై దాడికి యత్నించి నెలరోజులు గడుస్తున్నా నేటికీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు గాని, టీడీపీ పెద్దలు గాని ఆ విషయంపై స్పందించలేదు. అగ్రకుల అహంకారంతో దళితులను టీడీపీ పెద్దలు చిన్న చూపు చూస్తున్నారు. దళితులకు టీడీపీ ప్రభుత్వంలో రక్షణ లేదనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ విషయాలన్నింటిని ఎస్సీ కమిషన్ సభ్యుడికి వివరిస్తాం. –చార్వాక, అంటరానితనం నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
టీడీపీలో అసమ్మతి 'రాజు'కుంటోంది
టీడీపీలో క్షత్రియ సామాజిక వర్గం ప్రాభవం.. ప్రాధాన్యత రెండూ కోల్పోయింది. పుంగనూరు నుంచి వెంకటరమణ రాజును పక్కకు తప్పించిన అధినేత నగరిలో అశోక్‌రాజుకు మొండిచెయ్యి చూపారు. మరో వైపు టీటీపీ అధినేత ముందస్తు అభ్యర్థుల ప్రకటన నగరిలో బూమ్రాంగ్ అయ్యింది. గాలి భాను అభ్యర్థిత్వంపై అసమ్మతి సెగలు కక్కుతోంది. ఒకే కుటుంబానికి ఏళ్ల తరబడి అవకాశం కల్పిస్తుండడంపై పాతకాపులు ఒక్కటవుతున్నారు. అధినేత వద్ద తాడోపేడో తేల్చుకొనేందుకు అమరావతికి పయనమవుతున్నారు. పుత్తూరు: టీడీపీ అధినేత క్షత్రియ సామాజిక వర్గానికి మొండిచెయ్యి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని వెంకటరమణరాజు నుంచి తప్పించి అనీషా రెడ్డికి ప్రకటించిన చంద్రబాబునాయుడు, నగరి టీడీపీ పగ్గాలను దివంగత ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌కు కట్టబెట్టడంపై క్షత్రియ సామాజిక వర్గం ఆగ్రహం తో రగలిపోతోంది. అధినేత తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతం నుంచి∙క్షత్రియ సామాజిక వర్గానికి చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పుంగనూరు, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో క్షత్రియ సామాజిక వర్గం బలంగా ఉంది. గతంలో నగరి నియోజకవర్గం నుంచి డి.రాజగోపాలరాజు, టీడీపీ తరఫున ఈవీ గోపాలరాజు, దొరస్వామిరాజు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పుంగనూరు నుంచి వెంకటరమణరాజును పక్కన పెట్టడంతో నగరి నుంచి క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ అశోక్‌రాజుకు అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో ఆ సామాజిక వర్గం మొత్తం ఆశగా ఎదురుచూసింది. అధినేత రిక్తహస్తం చూపడంతో క్షత్రియ సామాజిక వర్గం భగ్గుమంటోంది. బయటపడుతున్న విభేదాలు.. నగరి టీడీపీలో విభేదాలు బయటపడుతున్నాయి. గాలి భానుప్రకాష్ అభ్యర్థిత్వంపై పాతకాపులు ఒక్కటవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ముద్దుకృష్ణమనాయుడికే అధిష్టానం అవకాశం కల్పించింది. మళ్లీ ఇప్పుడు వాళ్ల కుటుంబానికే ప్రాధాన్యతనివ్వడంపై అసమ్మతి రాజుకుంటోంది. ముద్దు మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని ఆయన భార్య సరస్వతమ్మకు కట్టబెట్టిన అ«ధినేత నగరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కూడా వారి కుటుంబానికే ఇవ్వడంపై ఆశావహులు ఆక్రోశం వెళ్ల్లగక్కుతున్నారు. ముద్దుకృష్ణమ ఉన్నంత వరకు ఆయన అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లకే పార్టీలో, ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి వాళ్ల అభిప్రాయాలు తీసుకొని గాలి భాను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అమరావతికి పయనం.. టీడీపీకి అయువుపట్టయిన ఒక సామాజిక వర్గంలోనే గాలి భానుప్రకాష్ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నగరికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తినాయుడు, పుత్తూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ కీలక నాయకుడు కొరపాటి నరేంద్రబాబు, నిండ్ర, విజయపురం మండలాల్లోని సామాజిక వర్గం నాయకులు గాలి భాను అభ్యర్థిత్వాన్ని తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి పాకా రాజా, క్షత్రియ సామాజిక వర్గం నుంచి అశోక్‌రాజు, కమ్మ సామాజిక వర్గం నుంచి కృష్ణమూర్తినాయుడుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో శనివారం అమరావతికి పయనమవుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అశావహుల్లో ముఖ్యడైన అశోక్‌రాజు మాత్రం ప్రస్తుతానికి గుంభనంగానే ఉన్నారు. -
కావలికి కళా ఝలక్!
ప్రతిభాభారతి... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా స్పీకరు! జిల్లా నుంచి సుదీర్ఘకాలం మంత్రిగా కూడా ప్రాతినిధ్యం వహించిన దళిత మహిళ! టీడీపీ ఆవిర్భావం నుంచీ చివరకు పార్టీ కష్టకాలంలో సైతం పక్కపార్టీల వైపు చూడకుండా వెన్నంటిఉన్న సీనియర్ నాయకురాలు! కానీ ఈ ‘ప్రతిభ’ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన కొండ్రు మురళీమోహన్ ముందు వెలవెలబోయింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆశ చూపించిన ‘సముచిత స్థానం’ అనే బ్రహ్మపదార్థాన్ని నమ్ముకొని ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పేసేలా ఉన్న ఆమె నిర్ణయం రాజాం నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీ గ్రూపు రాజకీయాల్లో చివరకు మంత్రి అచ్చెన్న చేతులెత్తేయడం, మరో మంత్రి కళావెంకటరావుదే పైచేయి కావడం, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా చేజారిపోవడంతో కావలి రాజకీయ వారసత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: కావలి ప్రతిభాభారతి ఎస్సీ రిజర్వుర్డ్ ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి 1983–1999 మధ్యకాలంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కళావెంకటరావు ప్రజారా జ్యం పార్టీలోకి వెళ్లి మళ్లీ టీడీపీలోకి వెనక్కివచ్చినా ఆమె మాత్రం టీడీపీనే నమ్ముకున్నారు. 1999 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా తలపడిన కోండ్రు మురళీమోహన్ను మట్టికరిపించారు. అయితే 2004 ఎన్నికల్లో కోండ్రు చేతిలోనే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. 2009 సంవత్సరంలో ఎచ్చెర్ల జనరల్ నియోజకవర్గంగా, రాజాం ఎస్సీ రిజర్వుర్డ్గా మారడంతో ఆమె రాజాంకు మారారు. ఆమె స్వగ్రామం కావలి కూడా రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలంలోనే ఉండటంతో ఇదే తనకు సుస్థిర స్థానమని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. అయితే కళా ఇలాకా రేగిడి మండలం రాజాం నియోజకవర్గంలోనే ఉండటం, ఆయన క్యాంపు కార్యాల యం కూడా రాజాంలోనే ఏర్పాటు చేసుకోవ డం, తద్వారారాజకీయ, అధికారిక కార్యకలాపాల్లో కళా జోక్యం మితిమీరడం ప్రతిభాభారతికి గిట్టేదికాదు. పార్టీ గ్రూపు రాజకీయాల్లో మంత్రి అచ్చెన్నాయుడు కొంత సపోర్టు ఇవ్వడంతో ప్రతిభాభారతి కళాను ఢీకొట్టే ప్రయత్నం చేశా రు. కానీ కళా చాపకిందనీరులా పావులు కదిపా రు. చివర్లో అచ్చెన్న చేతులెత్తేయడంతో ఆమె రాజకీయ భవితవ్యమే గందరగోళంలో పడింది. ‘డిపాజిట్’ దక్కని వలస నేతే ఆధారం... గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిభాభారతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల జోగులు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికలలోనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్‌కు డిపాజిట్ కూడా దక్కలేదు. దాదాపు 4,600 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆయన వ్యక్తిగత బలమేమిటో ఆ ఎన్నికలలో తేలిపోయింది. కానీ రాజాం రాజకీయపటంపై నుంచి కావలి కుటుంబ రాజకీయ వారసత్వానికి శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టేలా కళా పావులు కదిపారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిభాభారతి వేదనను పార్టీ అధినేత కూడా పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అసలు గత ఎన్నికలలో కళావెంకటరావు అనుచరులు తనకు సహకరించకపోవడం వల్లే ఓడిపోయానని ఆమె ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కళాకు మంత్రి పదవి ఇస్తే తాను ఆత్మత్యాగానికీ వెనుకాడబోనని హెచ్చరించినా అరణ్యవేదనే అయ్యింది. చివరకు ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పితాని సత్యనారాయణకు కళావెంకటరావుపై ఫిర్యాదు ఇచ్చినా పాచికలు పారలేదు. కౌంటర్‌గా రాజాం నియోజకవర్గంలోని కళా అనుచర నాయకులు అంతా నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రతిభాభారతిని కట్టడిచేసేందుకు కాంగ్రెస్ నుంచి కోండ్రును తీసుకొచ్చి రాజాం పీఠంపై కూర్చోబెట్టారు. ప్రజలు ఎన్నుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కంబాల జోగులకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా వాటిని టీడీపీ తమ్ముళ్లకు మళ్లించుకోవడానికి సృష్టించిన రాజాం నియోజకవర్గ ఇన్చార్జి పదవి కూడా ప్రతిభాభారతి చేతి నుంచి జారిపోయింది. ఆ స్థానాన్ని కోండ్రు మురళీమోహన్‌కు కట్టబెట్టింది. ప్రతిభ అనుచరులు ఎటు... కోండ్రు ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండలానికి చెందినవారు. ఆ నియోజకవర్గంలో తన స్వలాభం కోసమే కళావెంకటరావు కోండ్రును రాజాం నియోజకవర్గానికి తీసుకొచ్చారనే ఆవేదన ప్రతిభాభారతి వర్గీయుల్లో కనిపిస్తోంది. కోండ్రు రెండుసార్లూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాబల్యం గెలిచి, గత ఎన్నికలలో సొంత బలం చూపించుకోలేక మట్టికరిచినా ఎందుకు తమపై రుద్దుతున్నారో తెలియక గందరగోళపడుతున్నారు. మరోవైపు కోండ్రు దూకుడు వైఖరిని తలచుకొని లోలోనే మదనపడుతున్నారు. అసలు ‘సముచిత స్థానం’ అంటే ఏమిటో తేల్చుకోకుండా తమ నాయకురాలు స్టీరింగ్ వదిలేయడంతో తమ గమ్యస్థానం ఏమిటనే ఆందోళనలో ఉన్నారు. గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ ‘సముచిత స్థానం’ అనే బ్రహ్మాపదార్థంతోనే సంతకవిటిలో సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడికి ఝలక్ ఇచ్చిన వైనాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారంతా కోండ్రు నిర్వహిస్తున్న సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. రాజాం ఏఎంసీ చైర్మన్ పైల వెంకటరమణ, రేగిడి మండలానికి చెందిన కరణం శ్రీనివాసరావు, రాజాంకు చెందిన వంగా వెంకటరావు, టంకాల కన్నంనాయుడు వంటి సీనియర్ నాయకులు అందులో ఉండటం గమనార్హం. కళా, కోండ్రు ద్వయాన్ని ఎదుర్కోవడానికి కావలి వర్గం ఎలాంటి పావులు కదుపుతుందో చూడాలి. ఈ పోరులో చేతులెత్తేస్తే కావలి రాజకీయవారసురాలు గ్రీష్మప్రసాద్ భవితవ్యానికి భరో సా ఎలా దక్కుతుందనేదీ మిలయన్ డాలర్ల ప్రశ్న!! -
మంత్రి సునీత సమక్షంలో బట్టబయలైన వర్గపోరు
ఒంగోలు సబర్బన్: బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ సమీక్షలో సంతనూతలపాడు పార్టీ ఇన్చార్జి వ్యవహారంలో అంతర్గత పోరు బట్టబయలైంది. పార్టీకి సంబంధించి ఆదివారం స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి, పార్టీ బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. సంతనూతలపాడు ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండటం లేదంటూ ఓ వర్గం నాయకులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయనను ఇన్చార్జి బాధ్యతల నుంచి మార్చాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇదిలా ఉంటే విజయకుమార్‌కు అనుకూలంగా కొందరు నాయకులు మాట్లాడారు. విజయకుమార్‌ను కొనసాగించాల్సిందేనంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గుంటూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలపై తొలుత సమీక్షించారు. అనంతరం చీరాల, పర్చూరు, అద్దంకి స్థానాలు, చివరగా సంతనూతలపాడు నియోజకవర్గ నాయకులతో రాత్రి పొద్దుపోయేవరకు మాట్లాడారు. సమీక్షకు చీరాల నుంచి ఎమ్మెల్సీ పోతుల సునీత, అద్దంకి నుంచి ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి హాజరుకాలేదు. సంతనూతలపాడుపై సోమవారం కూడా మరోసారి సమీక్ష నిర్వహిద్దామని నాయకులకు చెప్పి పంపారు. సమీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. అంగన్వాడీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి ఒంగోలు టౌన్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పి.సునీత ఆదేశించారు. ఆదివారం స్థానిక ఎన్ఎస్పీ అతిథి గృహంలో ఐసీడీఎస్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మాణం ప్రారంభించని భవనాలను, అసంఫూర్తిగా ఉన్న వాటిని త్వరగా నిర్మించాలని ఆదేశించారు. అన్న అమృతహస్తం, బాలామృతం పథకాల అమలు తీరు గురించి ఐసీడీఎస్ పీడీ సరోజినిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో న్యూట్రి గార్డెన్స్‌కు అవసరమైన స్థలాలు, వన్ స్టాప్ సెంటర్‌పై పీడీతో చర్చించారు. డీఆర్డీఏ, వెలుగు లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ పీడీ ఎంఎస్ మురళిని మంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో ఎనిమిది స్త్రీ శక్తి భవన నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి పీడీ వివరించారు. జిల్లాలో 35 కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. -
రెండు మంత్రి పదవులిస్తే సరి... లేదంటే రచ్చరచ్చే!
⇔ సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తే తమ పరిస్థితేంటని వ్యతిరేకుల్లో ఆందోళన ⇔ టార్గెట్ అయిపోతామన్న భయం ⇔ రెండో మంత్రి పదవికోసం లలిత, గీతల ఆశలు ⇔ కన్పించని సానుకూల సంకేతాలు ⇔ నాయకులతో పాటు అధికారుల్లో ఆందోళన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవ్వడంతో జిల్లా నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా నాడు బయటపడినవారంతా ఇప్పుడు భయపడుతున్నారు. తాము కాదన్నవారికి మంత్రిపదవి దక్కుతుందన్న సంకేతాలు రావడమే దానికి కారణం. బయటపడినవారిలో ఒక్కరికైనా స్థానం కల్పించకుంటే ఇక పార్టీలో అంతర్గత పోరు ఖాయమన్న భావన కనిపిస్తోంది. వ్యతిరేకించినవారిని అణగదొక్కే ప్రయత్నాలు మొదలవుతాయన్న వాదన వినిపిస్తోంది. అంతేనా...అధికారుల్లోనూ అభద్రతా భావం మొదలైంది. సురక్షిత స్థానాలకు చేరుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి బాహాటంగానే చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడ్ని కలిసి కూడా తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఓసీకిస్తే బీసీలంతా దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు. జిల్లాలోని బీసీ సంఘాలు కూడా వీరి అభిప్రాయానికి మద్దతు పలికి, గొంతు కలిపారు. కానీ అదిష్టానం పట్టించుకున్నట్టుగా లేదు. సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తున్నామన్న సంకేతాలిస్తోంది. అదే జరిగితే బహిరంగంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి ఇబ్బంది కరంగా మారనుంది. వారిలో అంతర్మధనం మొదలయ్యింది. తాము కాదన్న వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే తప్పనిసరిగా టార్గెట్ అవుతామని టెన్షన్ పడుతున్నారు. లలిత, గీత ఆశలు ఫలించేనా? మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, మీసాల గీత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి మృణాళినిని తప్పిస్తే వెలమ, మహిళ సామాజిక వర్గ సమీకరణాల్లో తనకొస్తుందని కోళ్ల లలితకుమారి, కాపు సామాజిక వర్గం నుంచి తనకొస్తుందని మీసాల గీత ఆశించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు నేరుగా కోళ్ల లలితకుమారిని కలసి మంత్రి పదవిని ఆశించొద్దని, సుజయకృష్ణకు ఇచ్చేందుకు ఇప్పటికే ఖరారైపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె అవాక్కై... తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో చెప్పుకుని బాధపడ్డారు. అంతకుముందు మీసాల గీత పేరు కూడా తెరపైకి వచ్చింది. కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చేశాయి. దాంతో ఆమెకు ఆశలు చిగురించాయి. కానీ, కొద్ది రోజుల్లోనే ఆ వాదన కనుమరుగైపోయింది. తాజాగా కోళ్ల లలితకుమారి పేరు కూడా పరిశీలిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా నుంచి ఇద్దరికి అవకాశమిస్తే లలితకుమారికి బెర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇదేదీ కాదని ఒక్క సుజయ్‌కే మంత్రి పదవి ఇస్తే ఆయన్ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ గడ్డు కాలమే. అంతర్గతంగా ఇబ్బందులు పడక తప్పదు. ఈ మేరకు ఇప్పటికే బొబ్బిలి రాజుల శిబిరం నుంచి రాజకీయంగా పావులు కదులుతున్నట్టు తెలుస్తోంది. తమ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న ద్వారపురెడ్డి జగదీష్‌ను జిల్లా అధ్యక్ష పదవినుంచి తప్పించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇదే తరహాలో మిగతా ఎమ్మెల్యేలను కూడా లక్ష్యం చేసుకోవచ్చని అసమ్మతి నేతల అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మృణాళినిని తప్పిస్తే... మంత్రి పదవి నుంచి మృణాళినిని తప్పిస్తే ఆమెను నమ్ముకున్న నాయకులంతా ఇబ్బందులు పడక తప్పదు. రెండు మూడు నియోజకవర్గాల్లో మృణాళిని మద్దతుతో రాజకీయాలు చేస్తున్న నాయకుల భవిష్యత్ అగమ్య గోచరం కానుంది. అంతేకాదు ఆమెను నమ్ముకుని వచ్చిన అధికారులు సైతం ఇబ్బందులు పడేలా ఉన్నారు. మృణాళినిని నమ్ముకునే వారితో పాటు అసమ్మతి స్వరం విన్పిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంబంధాలున్న అధికారులు సైతం ఆందోళనలో ఉన్నారు. మంత్రి కానున్నామన్న అభిప్రాయంతో ఇప్పటికే తనకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల జాబితాను ఓ ఎమ్మెల్యే వర్గం తయారు చేస్తున్నది. తామొచ్చేలోపు వెళ్లిపోతే సరి... లేదంటే తాము సాగనంపాల్సి వస్తుందన్న సంకేతాలను ఇప్పటికే పంపించారు. దీంతో ఆ అధికారులు ముందస్తు జాగ్రత్తగా దార్లు వెతుక్కుంటున్నారు. -
టీడీపీ ఇంటి పోరు
మొక్కుబడిగా ఎన్టీఆర్ గృహాల మంజూరు పంపిణీలో పోటీ పడుతున్న అధికార పార్టీ నాయకులు బహిర్గతమవుతున్న అంతర్గత పోరు దిక్కుతోచని అధికారులు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పట్టున్న ఓ మండలంలో అధికార పార్టీ నాయకులు ఇళ్ల కోసం పోటీ పడుతున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులున్న టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ పశువులను కట్టేసుకోడానికి పక్కా గృహాన్ని మంజూరు చేయించుకున్నారు. మండలస్థాయి ప్రజా ప్రతినిధి సోదరుడు ఇంతకుముందే ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహం కట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇల్లు మంజూరు చేయించుకున్నారు. సత్యవేడు మండలంలోని టీడీపీ నాయకుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత కుమ్ములాటలు పక్కాగృహాల మంజూరు సందర్భంగా బహిర్గతమయ్యాయి. ఈ మండలానికి కేవలం 89 ఇళ్లు కేటాయించారు. అవి కూడా అధికార పార్టీ కార్యకర్తలకే కేటాయించారు. ఇందులో జన్మభూమి కమిటీలు ప్రముఖ పాత్ర పోషించాయి. ఇదిలా ఉండగా చెరివి పంచాయతీలో ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వారికి ఇళ్లు కేటాయించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, చిత్తూరు: జిల్లాలోని అధికార పార్టీ నాయకుల్లో పక్కా గృహాల పోరు మొదలైంది. జిల్లాకు పక్కా గృహాలు మొక్కుబడిగా మంజూరయ్యాయి. వీటి పంపకాల్లో పొత్తులు కుదరక అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తులు, ఇళ్లు ఉన్న వారు కూడా ప్రభుత్వ గృహాల కోసం పోటీపడుతున్నారు. పేదల పరిస్థితి ఎలా ఉన్నా తమ పార్టీ అధికారంలో ఉండగా తమకు ఇళ్లు దక్కాల్సిందేనని పట్టుబట్టుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడు సంవత్సరాయింది. ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతోందని భావించిన ప్రభుత్వం నియోజకవర్గానికి 900 ఇళ్లు, అర్బన్ నియోజకవర్గాలకు 350 ఇళ్లు కేటాయించింది. గతంలో కేటాయించిన ఇళ్లను రద్దు చేసి వాటిని మదించి కొత్తగా కేటాయించింది. దీంతో అధికారీ పార్టీ నాయకులకు కొత్త తిప్పలు మొదలయ్యాయి. గ్రామానికి కనీసం 5 ఇళ్లు కూడా రాకపోవడంతో కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయి. పూతలపట్టు మండలానికి 100 ఇళ్లు కేటాయించారు. వీటిని 25 పంచాయతీలు పంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కో పంచాయతీకి 4 ఇళ్లే. ఒక పంచాయతీలో ఎంత తక్కువ కాదన్నా 4 గ్రామాలుంటాయి. ఒక్కో గ్రామానికి ఒక ఇల్లు మంజూరు చేసినట్టే. దీనికి తోడు గ్రామాల్లో గ్రూపులు ఉండటంతో పంపకాలు పూర్తి కావడంలేదు. ఒకవేళ పంపిణీ అయినా టీడీపీలో గ్రామస్థాయిలో బలమైన నాయకుడు తీసుకోవడంతో మిగిలిన వారు కక్కలేక మింగలేక ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పంచాయతీ ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్చార్జిల దృష్టికి వెళ్లడంతో వారు పంపిణీలో నిమగ్నమయ్యారు. చాలీచాలని ఇళ్లు కేటాయించడంపై ప్రభుత్వంపై ప్రజలతో పాటు.. పార్టీ కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు. అనర్హులకు ఎన్టీఆర్ గృహాలు ఎన్టీఆర్ గృహాలను అనర్హులకు కేటాయిస్తున్నారు. అన్ని ఇళ్లు అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకే కట్టబెట్టడానికి లాంఛనాలు ఇదివరకే పూర్తయ్యాయి. వీరిలో కూడా ఆర్థికంగా స్థితిమంతంగా ఉన్నవారికి కేటాయిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి ఆకాశాన్ని తాకుతోంది. డబ్బున్నవారికి ఇళ్లు కేటాయించినా ఉపయోగం ఉండదనీ.. వారు పశువుల కొట్టాలుగా వినియోగించుకుంటారని కార్యకర్తలు వాపోతున్నారు. పంపకాలు కుదరక.. మరోవైపు పంపకాలు కుదరక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేదంటే నియోజకవర్గ ఇన్చార్జిల చుట్టూ తిరుగుతున్నారు. మొక్కుబడిగా ఇళ్లు కేటాయించడం, తరువాత వాటి కేటాయింపులో నాయకులు నాన్చుడు దోరణితో పంపిణీలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. -
చెప్పులతో కొట్టుకున్న ‘తమ్ముళ్లు’
అనంతపురం జిల్లా : కూడేరులోని బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన వేరుశనగ విత్తన పంపిణీ కేంద్రం వద్ద శుక్రవారం తెలుగు తమ్ముళ్లు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. అధికార పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు బోర్ల సత్యనారాయణ, కొర్రకోడు కుంటెన్నలు చెప్పులతో కొట్టుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు అందించిన వివరాల మేరకు నాగిరెడ్డిపల్లికి చెందిన బోర్లు సత్యనారాయణ విత్తన ఏజెన్సీ నిర్వహణలో సభ్యునిగా ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ భర్త ఎర్రిస్వామి విత్తన వేరుశనగ కాయలు ఇవ్వాలని సత్యనారాయణను కోరారు. సత్యనారాయణ ససేమిరా అన్నప్పటికి మిగిలిన సభ్యుల అంగీకారం మేరకు పర్మిట్లు లేకనే మూడు బస్తాలు నేరుగా డబ్బులు చెల్లించి పొందాడు. ఈ సమయంలో సత్తిలాంటి వాళ్ళు ఉంటే టీడీపీకి ఓట్లు పడవు అనడం ఆ విషయం సత్తికి తెలిసింది. అందులో భాగంగానే శుక్రవారం సత్యనారాయణ పంపిణీ కేంద్రం వద్ద ఉండగా ఎర్రిస్వామి మిత్రుడు కొర్రకోడూరుకు చెందిన కుంటెన్న వచ్చి గొడవ పడి చొక్కా పట్టుకున్నాడు. దీంతో సత్యనారాయణ చెప్పు తీసుకొని కొట్టాడు. కుంటెన్న కుమారుడు సత్యనారాయణపై చేయి చేసుకొని చెప్పుతో కొట్టాడు. అక్కడ ఉన్న రైతులు, పోలీసులు వారిని అక్కడ నుంచి పక్కకు పంపించారు. వారిరువురు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. పర్మిట్లు లేకనే ఏజెన్సీ నిర్వాహకులు ఎలా విత్తన కాయలు పంపిణీ చేశారని రైతులు చర్చించుకుంటున్నారు. ఇలాగైతే అధికార పార్టీ నాయకులు సబ్సిడీ విత్తన కాయలను పక్కదారి పట్టించే అవకాశం ఉందని రైతుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
టీడీపీలో వర్గపోరు బహిర్గతం
ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముందు నుంచీ టీడీపీలో ఉన్న వారికి, ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వర్గీయులకు మధ్య వర్గపోరు తలెత్తింది. దీనికి తోడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వ్యవహరిస్తున్న తీరుపై దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు భగ్గుమం టున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ సమావేశం సాక్షిగా శనివారం టీడీపీ వర్గపోరు బహిర్గతమైంది. స్థానిక నగర పంచాయతీ కార్యాల యంలో చైర్పర్సన్ కొప్పాడ పార్వతి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమవుతుండగా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. వారు కారణం చెప్పకపోవడంతో మిగిలిన కౌన్సిలర్లకు విషయం తెలియక అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యేను సమావేశానికి పిలవకపోవడంతో వాకౌట్ చేసినట్టు వరుపుల వర్గానికి చెందిన కౌన్సిలర్లు తెలి పారు. ఎమ్మెల్యే ఇంటివద్ద అజెండా కాపీ ఇచ్చి ఆయన సతీమణి నుంచి సంతకం తీసుకున్న రశీదును మరో వర్గం వారు విలేకరులకు చూపిం చారు. టీడీపీ కేడర్ అంతా కలిసి పనిచేద్దామంటే కావాలనే గ్రూపు రాజకీయాలకు పాల్పపడుతున్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలను పాల్పపడితే తాము సత్తాచూపుతామని ప్రజలనుంచి తాము టీడీపీ తరఫున గెలిచామని, పార్టీ ఫిరాయించలేదని, ఒరిజినల్‌గా తమదే అసలైన టీడీపీయని మరో వర్గం చెబుతోంది. ఎమ్మెల్యే వరుపుల తీరుపై ఎంపీకి ఫిర్యాదు శంఖవరం: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైఖరిపై దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు ఎంపీ తోట నరసింహానికి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వరుపుల ఆది నుంచి పార్టీలో ఉంటున్నా తమ ఆధిపత్యాన్ని అణచివేసే చర్యలకు దిగుతున్నారని రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని పలువురు గ్రామస్థాయి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పర్వత వర్గీయు లు ఎంపీ తోట నరసింహాన్ని శనివారం రాత్రి శంఖవరం రప్పించుకుని రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా రౌతులపూడి మండలంలో గిడజాం, పల్లపుచామవరం గ్రామాల్లో గతంలో తొలగించిన ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లను ఎమ్మెల్యే వరుపుల తిరిగి నియామకం చేశారని ప్రధానంగా ఆరోపించినట్టు చెబుతున్నారు. బంగారయ్యపేట నుంచి ఎమ్మెల్యే వరుపుల ఇంటికి వెళ్లిన పూర్వపు టీడీపీ కార్యకర్తలు కొందరిని తనవద్దకు రావద్దు వెళ్లిపొమ్మన్నారనే విషయంపై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అంతేగాక ఉపాధి కూలీలకు ఇచ్చే మజ్జిగ కార్యక్రమాన్ని కూడా తన అనుయాయులకే కట్టబెట్టుకున్నారని ఆరోపించారని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పార్టీకి గుడ్‌బై చెప్పాల్సి వస్తోందని హెచ్చరించినట్టు తెలిసింది. దీనిపై ఎంపీ తోట పార్టీ అధిష్ఠానం సూచన మేరకు సమన్వయంతో పనులు సాగించుకోవాలని సూచించినట్టు తెలిసింది. గ్రామాల్లో అన్ని పనుల్నీ టీడీపీ కార్యకర్తలతో కలిసి చేసుకోమని ఎమ్మెల్యే వరుపుల తన అనుయాయులందరికీ చెబుతున్నారని, ఆ మేరకే అన్ని గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారని వరుపుల వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో పొరపొచ్చాలు తీసుకు వచ్చేందుకు ఇలాంటి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ సమావేశానికి ఎంపీ తోట హాజరు కావడం చూస్తే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అన్నాడీఎంకేలో అంతర్గత పోరు
తిరువళ్లూరు: ఐదేళ్లుగా బయటకు పొక్కని అధికార పార్టీ అంతర్గత విభేదాలు ఒక్క సారిగా భగ్గుమనడంతోపాటు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే స్థాయికి రావడంతో పార్టీ పరువు బజారున పడింది. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా అధికార అన్నాడీఎంకే పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. క్రమశిక్షణ గలిగిన పార్టీగా పేరున్న అన్నాడీఎంకేలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న సంఘటనలు లేవు. గతంలో గ్రూపు రాజకీయాలు ఉన్నా, మాజీ మంత్రి రమణ జిల్లా కార్యదర్శి పదవిని చేపట్టిన తరువాత వాటికి చెక్ పెట్టి పార్టీనీ ఏకతాటిపై నడిపించారు. చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటినీ తానే చక్కదిద్దేవారు. అయితే రమణ తన సతీమణితో ఏకాంతంగా వున్న పోటోలు బయటకు రావడంతో మంత్రి పదవి, జిల్లా కార్యదర్శి తదితర జోడు పదవుల నుంచి ముఖ్యమంత్రి జయలలిత రమణనూ తొలగించారు. దీంతో రమణ జిల్లా రాజకీయాలకు దూరంగా వుంటూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక విధిలేనీ పరిస్థితుల్లో కాంచీపురం జిల్లా కన్వీనర్‌గా వున్న వాలాజాబాద్ గణేషన్‌కు జిల్లా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం గణేష్‌కు రెండు జిల్లాల బాధ్యతలను చూడడం కష్టంగా మారింది. పైగా నియోజకవర్గం ప్రచారంలోనూ బిజీగా ఉండడంతో అయన తిరువళ్లూరుపై పెద్దగా దృష్టి పెట్టలేనీ పరిస్థితి ఏర్పడి ంది. ఈ నేపథ్యంలో రమణ ఉన్నంత వరకు నిశ్శబ్దంగా వున్న అంతర్గత విభేదాలు రమణ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి రోడ్డున పడింది. గత రెండు వారాల క్రితం జరిగిన అన్నాడీఎంకే కార్యకర్తల సమావేశంలో అంతర్గత విబేధాలు బయటపడి ఇరువర్గాలు తన్నుకునే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి విభేదాలు అధికార పార్టీలో రావడంతో ఒక్క సారీగా పార్టీ నేతలు షాక్ తిన్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో వర్గాలుగా చీలి ఘర్షణ పడడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని పలువురు సీనీయర్ నేతలు సైతం వాపోతున్నారు. చైర్మన్‌పై ఫేస్బుక్లో ప్రచారం: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానీకి ఆసక్తి ఉన్న నేతల నుంచి అన్నాడీఎంకే దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందులో భాగంగానే తిరువళ్లూరు నుండి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్న మున్సిపల్ చైర్మన్ భాస్కరన్, ఇటీవల ఇంటర్వ్యూలకు సైతం హాజరయ్యారు. త్వరలోనే అభ్యర్థుల జాబితా విడుదల చేసే పరిస్థితి వున్న నేపథ్యంలో తిరువళ్లూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భాస్కరన్‌ను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జయలలితకు థ్యాంక్స్ అంటూ కొందరు ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. క్షణాల్లో సంబంధిత పోస్టు షేర్ కావడంతో పాటు అన్నాడీఎంకే పేజ్‌లోనే షేర్ చేశారు. వీటిని గమనించిన అధిష్టానం, మీకు ఎవరు సీటు ఇచ్చారు, సీటు ఇవ్వకుండానే ఇదేమీ ప్రచారం అంటూ నిలదీసినట్టు తెలిసింది. దీంతో తనకు సీటు రాకుండా తన వ్యతిరేక వర్గం ఇలా చేసిందని భావించిన భాస్కరన్ డీఎస్పీ విజయకుమార్‌కు ఫిర్యాదు చేశారు. తనపై ఫేస్బుక్లో వచ్చిన పోస్టింగ్‌ను వెంటనే నిలిపివేయడంతోపాటు పోస్టింగ్ పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలనీ కోరారు. నన్ను బెదించారు: భాస్కరన్‌పై వచ్చిన పోస్టింగ్‌ను తిరువళ్లూరు యువజన అన్నాడీఎంకే కార్యదర్శి జయవీరన్ పెట్టినట్టు గుర్తించారు. ఇతను భాస్కరన్ వ్యతిరేక వర్గం లో కొనసాగుతున్నట్టు గుర్తించిన భాస్కరన్ అతని ఇంటి వద్దకు వెళ్లి హత్య చేస్తానని బెదిరించారనీ తిరువళ్లూరు టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రత కల్పించడంతో పాటు హత్య చేస్తాననీ బెదిరించిన మున్సిపల్ చైర్మన్‌ను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరు వర్గాల వద్ద విచారణ చేపడుతున్నారు. ఇది ఇలా వుండగా ఎన్నికలకు కేవలం రెండు నెలల వ్యవధి కూడా లేని పక్షంలో అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు బయటకురావడం చర్చీనీయాం శంగా మారింది. అధికార పార్టీలో నానాటికీ పెరుగుతున్న కుమ్మలాటల వల్ల పార్టీకి ఎలాంటి పరిస్థితి పడుతుందోనన్న ఆందోళన కరుడుగట్టిన పార్టీ నేతల్లో ఏర్పడింది. -
టీడీపీ సారథి ఎవరో?
► పర్వత వారసుడి కోసం తర్జనభర్జన ► కాపు సామాజికవర్గానికే మళ్లీ పగ్గాలు! ► బీసీలకు అవకాశం ఇవ్వాలని మరో వాదన ► మొగ్గు మెట్టవైపా? కోనసీమకా? ► పోటీలో సీనియర్ నాయకులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు ఆకస్మిక మృతి జిల్లాలో ఆ పార్టీకి పెద్దలోటే. మంత్రుల మధ్య వర్గపోరు నడుస్తున్నా పర్వత పార్టీలో అందరివాడుగా ఉండేవారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం చేతులెత్తేయడం, రాజధాని భూముల వ్యవహారంలో అక్రమాలు, కేంద్ర నిధుల సాధనలో వైఫల్యం, మరోవైపు గ్రామాల్లో జన్మభూమి కమిటీల పెత్తనం తదితర కారణాలతో ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జిల్లా సారథిగా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేయూలంటే అధిష్టానానికి కష్టమే. ఈ పదవి కోసం కొందరు సీనియర్ నాయకులు అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో లభించే వెసులుబాటును ఉపయోగించుకొని రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే తపన ఉన్న జూనియర్ నాయకులు కూడా తమ వంతు కృషి చేసుకుంటున్నట్టు తెలిసింది. కాగా జిల్లాలో పార్టీ పగ్గాల్ని మళ్లీ కాపు సామాజిక వర్గానికే ఇస్తారా లేక బీసీ, ఎస్సీల్లో ఎవరికైనా ఇస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించే అవకాశం ఉన్న దృష్ట్యా కాపు నాయకుడికే టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ కాపులకే ఇచ్చినా మెట్ట ప్రాంతం వారికా లేదా కోనసీమ నేతలకా అనేది మరో చర్చ. చిక్కాలకు దక్కుతుందా..? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ప్రస్తుతం ఎలాంటి పద వీ లేని వ్యక్తి చిక్కాల రామచంద్రరావే కనిపిస్తున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. వివాదాస్పదం కాని వ్యక్తిగా, సౌమ్యుడిగా పేరుంది. గతంలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందనే ప్రచారం జరిగినా అధిష్టానం మొండిచెయ్యి చూపింది. కనీసం నామినేటెడ్ పదవైనా ఇస్తారనుకున్నా అదీ లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ కాపు సామాజిక వర్గానికే సారథ్య బాధ్యతలు అప్పగించాలనుకుంటే చిక్కాలకే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే.. ఇప్పటికే ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదంటూ ముద్రగడ కాపు ఉద్యమం తలపెట్టిన దృష్ట్యా సౌమ్యుడు చిక్కాల కన్నా దూకుడుగా ఉండే కాపు నాయకుడు ఎవరికైనా అవకాశం ఇవ్వవచ్చనే వాదనా వినిపిస్తోంది. అదే కోణంలో అయితే రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు అవకాశం రావచ్చు. అలా పార్టీ జిల్లా సారథి అయితే మాత్రం తోట మంత్రి పదవి కలలపై నీళ్లు చల్లినట్లే! మరో సీనియర్ నాయకుడు, కోనసీమ ప్రాంతానికి చెందిన బండారు సత్యానందరావు పేరు కూడా వినిపిస్తోంది. కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత చిర్ల జగ్గిరెడ్డితో పోటీపడి ఓటమి పాలైన ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్టానం భావిస్తే.. బండారుకు మళ్లీ చక్రం తిప్పే అవకాశం లభిస్తుంది. అందుకే ఆయన కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. పదవి కోసం రాజా యత్నం..! కాపు ఉద్యమాన్ని తలకెత్తుకున్న ముద్రగడ పద్మనాభం, వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ వంటి సీనియర్ నాయకులను ఎదుర్కోవాలంటే మెట్ట ప్రాంతం వారికే పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలనే వాదన కూడా టీడీపీ శ్రేణుల్లో మొదలైంది. ఈ కోణంలో అవకాశం వస్తుందనే ఆశతో డీసీసీబీ అధ్యక్షుడు వరుపుల రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. రేసులో పిల్లి సత్యనారాయణ..! ఇప్పటివరకూ జిల్లాలో బలీయమైన కాపు సామాజిక వర్గానికే జిల్లాలో టీడీపీ సారథ్య బాధ్యతలు దక్కుతున్నాయి. జిల్లాలో బీసీలు కూడా ప్రాధాన్య స్థానంలోనే ఉన్నారు. ఆ వర్గాలను ఆకట్టుకోవడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు చాన్స్ ఇవ్వవచ్చనే చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయనకే ఇస్తే మంత్రి పదవిపై ఆయన ఆశలు దాదాపు ఆవిరైనట్లే! కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భర్త సత్యనారాయణ కూడా ఈ రేస్‌లో ఉన్నట్లు తెలిసింది. హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్న సమయంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏదిఏమైనా అటు అధిష్టానానికి, ఇటు జిల్లాలో మంత్రులిద్దరికీ అనుకూలమైనవారికే టీడీపీ అధ్యక్ష పదవి దక్కుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. పార్టీ మారనున్న ప్రసాద్..! ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా కూడా పర్వత చిట్టిబాబే వ్యవహరించేవారు. ఆయన మరణంతో టీడీపీ శ్రేణులు అక్కడ కూడా నాయకుడి అన్వేషణలో పడ్డాయి. ఈ నియోజకవర్గ రాజకీయాల్లో పర్వత, వరుపుల, ముద్రగడ కుటుంబాలదే ఇప్పటివరకూ పైచేయి. ఏ పార్టీ అయినా ఆ కుటుంబాల నుంచే రావాలి. ఈ నేపథ్యంలో పర్వత కుటుంబంలోనే ఎవరికైనా ఇవ్వవచ్చనే చర్చ మొదలైంది. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పర్వత ప్రసాద్ పేరు తెరపైకి రావడం గమనార్హం. సోమవారం చిట్టిబాబు కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లిన ఆయన సాయంత్రం వరకూ ఆ ఇంటివద్దే ఉన్నారు. పరామర్శకు వచ్చిన ఎంపీ తోట నరసింహంతో ఎక్కువ సమయం మాట్లాడుతూ కనిపించడంతో ప్రసాద్ పార్టీ మారతారని టీడీపీ శ్రేణుల్లో చర్చ మొదలైంది. -
ఓట్లు కొల్లగొట్టి బలిపశువు చేస్తారా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ టీడీపీ నేత పి.వి.రమణను స్థానిక ఎమ్మెల్యే సహా ఆమె ఆనుచరులు బహిష్కరణ వేటుకు తీర్మానించిన విషయం అదే పార్టీలో రెండోరోజూ చర్చనీయాంశమైంది. జిల్లా టీడీపీ నేతలు కొంతమంది ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షురాలు శిరీష దృష్టికి సోమవారం తీసుకువెళ్లినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న కళింగవైశ్యులు రమణ విషయంలో సానుభూతి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీకి 30యేళ్లపాటు సేవలందించిన రమణను స్థానిక ఎమ్మెల్యే టార్గెట్ చేశారని, ఉన్న పదవుల్ని తీయించి, కొత్త పదవులు రానీయకుండా చేశారంటూ నిందిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లా మంత్రి ఊళ్లో లేని సమయంలో ఆయనకు తెలియకుండా రమణను పార్టీ నుంచి బహిష్కరించాలని తీసుకున్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో కళింగ వైశ్యుల్ని బీసీలో చేరుస్తామంటూ ప్రకటనలు గుప్పించి, వారి ఓట్లను కొల్లగొట్టి ఇప్పుడు అదే కులానికి చెందిన రమణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఇదే విషయమై పార్టీ పెద్దల వద్ద తాడోపేడో తేల్చుకుంటామని రమణ వర్గీయులు చెబుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడితే భవిష్యత్తులో ఇబ్బందులుంటాయనే భావనతో ఈ విషయం బయటకు చెప్పలేకపోతున్నా రమణను పార్టీలో కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని శపథం చేసినట్టు తెలిసింది. వివరణ తీసుకోరా? పార్టీకి సేవలందిస్తున్న కార్యకర్త తప్పుచేశారని భావిస్తే కనీసం వివరణ తీసుకునే ప్రయత్నం చేయరా? అంటూ రమణ వర్గీయులు ఎమ్మెల్యే చర్యల్ని తప్పుబడుతున్నారు. నియోజకవర్గ సమావేశానికి రమణను రానీయకుండా చేసి, జిల్లా అధ్యక్షురాలి అనుమతి తీసుకోకుండానే బహిష్కరణ అంశాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని ఆక్షేపిస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అధిష్టానం ద్వారా చెప్పించడమో, సమన్వయకమిటీ సమావేశంలో చర్చించడమో చేయకుండా ఏకపక్షంగా బలిచేసే ప్రయత్నాన్ని కళింగ వైశ్యులు అంగీకరించడం లేదు. ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదులొస్తే ఒక్కరినే సస్పెండ్ చేయాలని చూడడం, తన వర్గీయుల్ని ఎమ్మెల్యే కాపాడుకుందామని ప్రయత్నిండంపై కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారని కళింగవైశ్య కులస్తులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్‌కు నిధుల ప్రకటించిన విషయాన్ని మంత్రి పేరు కాకుండా సీఎం, మునిసిపల్ మంత్రి పేర్లు ఎమ్మెల్యే ప్రస్తావించడాన్ని గుర్తుచేసుకుంటున్నారు. హాజరుపట్టీ సంతకాలతోనా? ఎమ్మెల్యే ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షలో కొంతమంది పార్టీ పెద్దలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ మేరకు అందరి వద్దా ఎమ్మెల్యేలు సంతకాలు తీసుకున్నారని, అవే సంతకాలు చూపించి రమణపై బహిష్కరణ వేటు వేయాలని అంతా తీర్మానించారని ఎమ్మెల్యే వర్గీయులు మిగతా నాయకులకు చెప్పడాన్ని కూడా ఖండిస్తున్నారు. హాజరుపట్టీ సంతకాల్నే తీర్మాన సంతకాలుగా ఎలా గుర్తిస్తారని, పార్టీ జిల్లా అధ్యక్షురాల్ని కూడా ఇదే విషయమై ప్రశ్నిస్తామని చెబుతున్నారు. ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తే విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్తామంటున్నారు. రానున్న మునిసిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పేలా లేదని, రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్న వైఎస్సార్సీపీయే మేయర్ పీఠాన్ని కొల్లగొడుతుందని టీడీపీలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలో ఆవరించిన భయాన్ని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. -
లలిత వర్సెస్ హైమావతి
► ఎస్‌కోట టీడీపీలో ఆధిపత్యపోరు ► నామినేటెట్ పదవుల్లో లలితకుమారి హవా ► జీర్ణించుకోలేకపోతున్న హైమావతి వర్గీయులు ► జెంటిల్మన్ ఒప్పందం అమలుపైనా అనుమానాలు టీడీపీలో ఆధిపత్యపోరు చాపకింద నీరులా సాగుతోంది. ఇప్పుడిప్పుడే అన్ని నియోజకవర్గాలకూ అది పాకుతోంది. తాజాగా ఎస్‌కోట నియోజకవర్గంలో ఈ విషయాలు కాస్తా బహిర్గతమవుతున్నాయి. అక్కడి ఇంతుల మధ్య పోరు రసవత్తరంగానే ఉంది. ఎవరికి వారే తమ పట్టుకోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. పైచేయి సాధించేందుకు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. వీరి మధ్య వైరం గతంలో జరిగిన జెంటిల్మన్ ఒప్పందం అమలుపైనా పడుతుందేమోనని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : శృంగవరపుకోట టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న నామినేటేడ్ పదవుల నియామకాలు వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ పదవిలో ఉన్నది తన కుమార్తె అయినప్పటికీ హైమావతి మాట చెల్లుబాటు కావడంలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే లలితకుమారి పెత్తనమే సాగుతోంది. ఈ పరిణామాలు శోభా వర్గీయుల్ని కలవర పెడుతోంది. ఆదినుంచీ వైరమే... తొలి నుంచి వీరి మధ్య విభేదాలున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్కోసం గట్టీ పోటీ నడిచింది. జెడ్పీ ఎన్నికలు రావడం... నీకొకటి- నాకొకటి అన్న రీతిలో పదవుల పంపకాలు జరగడంతో వివాదం సద్దుమణిగింది. హైమావతి కుమార్తె స్వాతిరాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యాక ఎస్‌కోట నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదిపారు. ఎస్‌కోట, వేపాడ మండలాల్ని తమకే వదిలేయాలని పరోక్ష సంకేతాలు పంపించారు. కానీ, ఎమ్మెల్యే లలితకుమారి ససేమిరా అన్నారు. అయినప్పటికీ చాపకింద నీరులా ఆ రెండు మండలాల్లో హైమావతి వర్గమే ఆధిపత్యం సాగిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు అంతర్గతంగా ముదిరి ఒకరిపై ఒకరు పరోక్షంగా దెబ్బకొట్టుకుంటూనే ఉన్నారు. ఎస్‌కోట పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రద్దు, వేపాడ, కొత్తవలస మండల పరిషత్ కార్యాలయాల్లో పలు వివాదాలకు ఆధిపత్య పోరే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. నామినేటెడ్‌లో కోళ్ల హవా... తాజాగా నామినేటెడ్ పదవుల పోరుకు తెరలేచింది. కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం అటు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇటు శోభా హైమావతి చెరొకరిని ప్రతిపాదించారు. లక్కవరపుకోట మండలం గొలజాంకు చెందిన ఏరువాక సులోచనను లలితకుమారి, కొత్తవలస మండలం అప్పన్నపాలేనికి చెందిన తిక్కాన చినదేముడును హైమావతి ప్రతిపాదించారు. కానీ, ఎమ్మెల్యే తనుకున్న పలుకుబడిని ఉపయోగించి పంతాన్ని నెగ్గించుకున్నారు. దాదాపు పాలకవర్గం మొత్తం ఆమె ప్రతిపాదించిన వారే. తాజాగా జామి ఎల్లారమ్మ, ధర్మవరం సన్యాసయ్య ఆలయ కమిటీలను వేశారు. ఇక్కడా ఎమ్మెల్యే సిఫార్సులే పనిచేశాయి. త్వరలో ఖరారు చేయనున్న పుణ్యగిరి దేవస్థానం కమిటీలోనూ ఆ వర్గానికే చోటు కల్పించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు హైమావతి వర్గీయులు తట్టుకోలేకపోతున్నారు. జెడ్పీని ఖాతరు చేయకుండా... అభివృద్ధి పనుల విషయంలోనూ ఎమ్మెల్యే ఓవర్ టేక్ చేస్తున్నారు. జెడ్పీతో పనిలేకుండా నేరుగా మంత్రి, కలెక్టర్ ద్వారా చేయించుకున్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనుల్నీ పెద్ద ఎత్తున మంజూరు చేయించుకున్నారు. అంతేకాకుండా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లగుడు సింహాద్రిని తన వర్గంగా చేసుకుని, నియోజకవర్గంలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. లగుడు సింహాద్రికి ప్రత్యర్థిగా జామి జెడ్పీటీసీ పెదబాబును హైమావతి వర్గీయులు దించినప్పటికీ హవా మాత్రం సాగించలేకపోతున్నారు. ఈ వ్యవహారం కాస్తా చినబాబు దృష్టికి వెళ్లేలా ఉంది. జెంటిల్మన్ ఒప్పందంపై అనుమానాలు వీరిమధ్య పోరు ఎస్‌కోట, జామి ఎంపీపీ పదవులకోసం చేసుకున్న జెంటిల్మెన్ ఒప్పందం అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఎంపీపీ పదవుల్ని చెరో రెండున్నరేళ్లు చేపట్టేలా రెండువర్గాలూ ఒప్పందం చేసుకున్నారు. ఎస్‌కోటలో హైమావతికి చెందిన రెడ్డి వెంకన్న, జామిలో లలితకుమారికి చెందిన సరసాన అప్యయ్యమ్మ ఎంపీపీలుగా తొలుత నియమితులయ్యారు. రెండున్నరేళ్ల గడువు సమీపించడం, వీరి మధ్య అంతర్గత పోరు తీవ్రమవ్వడంతో జెంటిల్మెన్ ఒప్పందం అమలుపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆ పదవులకోసం ఎస్‌కోటలో రాయవరపు చంద్రశేఖర్, జామిలో ఇప్పాక చంద్రకళ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడేమవుతుందోనన్న భయం ఆశావహులకు పట్టుకుంది. -
ఆర్‌డబ్ల్యూఎస్‌లో చాపకింద నీరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం:ఆర్డబ్ల్యూఎస్(గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం)లో అంతర్గత పోరు నడుస్తోంది. ప్రాజెక్టు విభాగంపై చిచ్చు రేగుతోంది. ఇన్చార్జి ఎస్ఈ గాయత్రి దేవి, ప్రాజెక్టు ఈఈ విద్యాసాగర్ మధ్య ఈ విషయమై అభిప్రాయభేదాలొచ్చాయి. ప్రత్యేకంగా నడుస్తున్న ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి, దాని స్థానంలో పార్వతీపురంలో రెగ్యులర్ డివిజనొకటి ఏర్పాటు చేయాలని గాయత్రిదేవి తెరవెనుక ప్రయత్నిస్తుండగా, ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి తనను ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ఎత్తుగడగా విద్యాసాగర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆర్‌డబ్ల్యూఎస్‌లో రెండు గ్రూపుల మధ్య విభేదాలు చినికి చినికి గాలివానగా మారినట్టు ఎక్కడివరకు దారితీస్తాయోనని ఉద్యోగ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. జిల్లా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రెండు విభాగాలు నడుస్తున్నాయి. అందులో ఒకటి రెగ్యులర్ విభాగం, మరొకటి ప్రాజెక్టు విభాగం. మంచినీటి సరఫరాను సక్రమంగా చేసే బాధ్యతల్ని రెగ్యులర్ విభాగం చూసుకోగా, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాలను ప్రాజెక్ట్సు విభాగం చూసుకుంటోంది. రెగ్యులర్ విభాగం ఈఈగా గాయత్రి దేవి, ప్రాజెక్టు విభాగం ఈఈగా విద్యాసాగర్ ప్రస్తుతం ఉన్నారు. మొత్తం జిల్లా ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ ఎస్ఈ ఇన్చార్జి బాధ్యతలను గాయత్రిదేవి తనకున్న పలుకుబడితో ఆమె చేతుల్లోకి తెచ్చుకున్నారు. అంటే ఒకవైపు రెగ్యులర్ విభాగం ఈఈ పోస్టుతో పాటు ఎస్ఈ పోస్టులో గాయత్రిదేవి కొనసాగుతున్నారు. అయితే గాయత్రిదేవి కంటే సీనియర్ అయిన విద్యాసాగర్ ఉన్నప్పటికీ ఆయన్ను కాదని ఆమెకు ఎస్ఈ ఇన్చార్జి బాధ్యతల్ని అప్పగించడం ఆయన వర్గానికి రు చించడం లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే 2009లో మంత్రిగా ఉన్న శత్రుచర్ల విజయరామరాజు రెగ్యులర్ డివిజన్, ప్రాజెక్టు డివిజన్ రెండూ విజయనగరంలో ఉంటే ఎలాగని, పార్వతీపురంలో రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేయాలని పట్టుబట్టి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెప్పించుకున్నారు. అయితే, దీన్ని అప్పటి మరో మంత్రి బొత్స సత్య నారాయణ అడ్డుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడా ఉత్తర్వులను ఆధారంగా చేసుకుని పార్వతీపురం ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ద్వారా అక్కడొక రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రత్యేకంగా ప్రాజెక్టు విభాగం ఎందుకని, దాన్ని ఎత్తివేసి పార్వతీపురంలో మరో రెగ్యులర్ డివిజన్ ఏర్పాటు చేయాలని, ప్రాజెక్టు వర్కులన్నీ విజయనగరం, పార్వతీపురంలలో కొనసాగే రెగ్యులర్ డివిజన్లకు అప్పగించాలన్నది తాజా ప్రతిపాదన. అయితే, ఈ ప్రతిపాదనను ప్రస్తుత ప్రాజెక్టు విభాగంలో ఉన్న అధికారులు, ఇంజినీరింగ్ అధికారుల అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ప్రాజెక్టు విభాగాన్ని ఎత్తివేసి రెగ్యులర్ డివిజన్లో కలిపేస్తే ప్రాజెక్టుల పనులు సక్రమంగా జరగవని, పర్యవేక్షణ లోపిస్తుందని, మంజూరైన భారీ మంచినీటి పథకాల నిర్మాణాలు ముందుకు సాగవని అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రాజెక్టు వర్కుల కోసం రెగ్యులర్ విభాగంలో పనిచేస్తున్న ఒకరిద్దరు అధికారులు వేస్తున్న ఎత్తుగడ అని, వారి స్వార్థం కోసం ప్రాజెక్టు డివిజన్‌ను బలి చేస్తున్నారని ఒక వర్గం వాదిస్తుండగా, రెగ్యులర్ విభాగ పరిధిలో గల పనులన్నీ జిల్లా వ్యాప్తంగా చూసుకోలేకపోతున్నామని, ముఖ్యంగా వ్యక్తిగత మరుగుదొడ్ల కార్యక్రమా న్ని పర్యవేక్షణ చేయలేకపోతున్నామని మరో వర్గం వాదనకు దిగుతోంది. కొసమెరుపు ఈ రెండు వర్గాల వాదనలు ఎలా ఉన్నా ప్రాజెక్టుల పర్యవేక్షణ చేపడితే నాలుగు కాసులు వెనకేసుకోవచ్చని, ఇంతవరకు దాన్ని మిస్సయిపోయామని ఒక వర్గం..భావన. ఇంతకాలం అనుభవించింది మిస్సయిపోతామని మరో వర్గం ఆందోళన.. ఈ నేపథ్యంలోనే తాజా పోరుకు తెరలేచిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏఆర్‌లో అంతర్గత పోరుతో కలెక్టర్‌కు అగౌరవం !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్... జిల్లా పోలీస్ శాఖలో కీలకమైన విభాగమిది. ఈ విభాగానికి చెందిన కానిస్టేబుళ్లు, ఎస్ఐలే ఎస్కార్ట్, గార్డు, గన్‌మెన్, స్క్వాడ్ డ్యూటీలు చేస్తారు. పోలీస్ అధికారుల వాహనాల నిర్వహణ ఈ విభాగం అధికారులే చూస్తారు. పోలీసు మైదానం వారి పరిధిలోనే ఉంటుంది. అక్కడే కార్యక్రమాలు జరిగినా వాళ్లే బాధ్యత వహించాలి. అంతటి ప్రాధాన్యం గల ఆర్మ్డ్ రిజర్వు విభాగం ఇప్పుడు అంతర్గత పోరుతో సతమతమవుతోంది. ఈ క్రమంలోనే అధికారులు ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పూర్తిగా సమన్వయం లోపించింది. సోమవారం జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో చోటు చేసుకున్న పరిణామమే ఇందుకు ఉదాహరణ. బేరక్స్‌లో జరిగే ఉత్సవాల్లో కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించేందుకు ఇన్స్పెక్షన్ వాహనం ఏర్పాటు చేయాలి. ఏటా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. కానీ ఈసారి కలెక్టర్‌కు ఇన్స్పెక్షన్ వాహనం ఏర్పాటు చేయలేదు. దీంతో కాలి నడకన వెళ్లి గౌరవవందనం స్వీకరించారు. ఎందుకిలా చేశారని అడిగితే వాహనం రిపేర్‌లో ఉందని కొందరు, ఆ సమయానికి డ్రైవర్ రాలేదని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కలెక్టర్‌ను అగౌరవ పరిచినట్టే చెప్పుకోవాలి. మూడు ముక్కలాట ఆర్మడ్ రిజర్వుడు విభాగంలో ముగ్గురు అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. తమ వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారని ఒకరిని మిగతా ఇద్దరు అధికారులు విభేదిస్తుండగా, వారిద్దరి అవినీతి వ్యవహారాలు బయటపెడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆవేదనతో ఆ అధికారి ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి తీవ్ర స్థాయిలో పోరు నడుస్తోంది. బ్యాంకుల నగదు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసేందుకు ఎస్కార్ట్ డ్యూటీలకు పంపించే కానిస్టేబుళ్లకు అలెవెన్సులు ఇవ్వకుండా మింగేస్తున్నారని, కొందరికే డ్యూటీలేసి ఇంకొందర్ని వదిలేస్తున్నారని, యూనిఫారం స్టిచ్చింగ్ ఛార్జీల్లో కక్కుర్తి పడుతున్నారనే ఆరోపణల్ని ఒక అధికారి మూటగట్టుకోగా, ఇంకో అధికారి గన్మెన్ల నుంచి నెలకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకూ వసూలు చేశారని, ఆయనపై విచారణ కూడా జరిగిందన్న ఆరోపణలున్నాయి. వాహనాల నిర్వహణలో కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీరిద్దరూ తన చేతికి చిక్క లేదని మరో అధికారి గుర్రుగా ఉన్నారు. తనదైన శైలీలో చర్యలు తీసుకుంటున్నారన్న వాదనలు ఉన్నాయి. ఆ మధ్య ఎన్నికల వ్యయం కింద వచ్చిన నిధుల్లో రూ.50లక్షలు దుర్వినియోగమైనట్ట ఆరోపణలున్నాయి. ఈ విధంగా ఆ ముగ్గురు అధికారులు ఒకరికొకరు విభేధించుకుని పాలనా వ్యవహారాల్ని గాలికొదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యవహరిస్తుండడంతో క్రమశిక్షణ కూడా లోపించినట్టు తెలుస్తోంది. అందుకు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో చోటుచేసుకున్న సంఘటననే ఉదాహరణ. ప్రతిసారి రిపబ్లిక్ డే ఉత్సవాలకు కలెక్టర్ గౌరవ వందనం స్వీకరణ కోసం చింతవలస ఏపీ ఎస్పీ బెటాలియన్ నుంచి ఇన్స్పెక్షన్ వాహనం మూడు రోజుల ముందే తీసుకొచ్చి, దానితో పెరైడ్ ప్రాక్టీసు చేస్తారు. లోటుపాట్లు ఏవైనా ఉంటే ఈలోగానే పరిష్కరించుకుంటారు. ఉత్సవాలు జరిగే నాటికి అంతా పక్కాగా సిద్ధం చేస్తారు. కానీ సోమవారం జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాల్లో స్పష్టమైన లోటు కన్పించింది. కలెక్టర్‌కు సమకూర్చాల్సిన ఇన్స్పెక్షన్ వాహనాన్ని గౌరవవందనం స్వీకరించే సమయానికి తీసుకురాలేదు. అంతా సిద్ధమయ్యేసరికి వాహనం ఎక్కడని తలో దిక్కు చూశారు. ఎంతసేపైనా మైదానంలోకి వాహనం రాలేదు. దీంతో గత్యంతరం లేక కలెక్టర్ ఎం.ఎం.నాయక్ కాలి నడకన వెళ్లి గౌరవ వందనం స్వీకరించారు. బయటకి వ్యక్తం చేయలేకపోయినా కలెక్టర్‌కు ఈ పరిణామం కాసింత అవమానకరంగానే చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇన్స్పెక్షన్ వాహనం పాడైందని, అందుకనే ఏర్పాటు చేయలేకపోయామని చెప్పుకొచ్చారు. కానీ ఏఆర్ సిబ్బందిలో మాత్రం భిన్న వాదనలు విన్పించాయి. పాడవడం వల్ల అని కొందరు, ఆ సమయానికి డ్రైవర్ లేకపోవడం వల్ల వాహనం పెట్టలేకపోయామని మరికొందరు చెప్పుకొచ్చారు. -
ఢీఎంకే
చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎంకేలో జరుగుతున్న సంస్థాగత ఎన్నికలు అంతర్గత పోరుకు దారితీశాయి. వర్గపోరుతో ఇరుపక్షాలు పరస్పర దాడులకు పాల్పడగా ఎన్నికల కేంద్రాలు ఆగ్రహావేశాలతో అట్టుడికిపోయాయి. పెట్రోబాంబులు, వేటకొడవళ్లు రంగ ప్రవేశం చేయడంతో రణరంగంగా మారిపోయాయి. ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో డీఎంకే మట్టికరిచిపోగా పార్టీ అయోమయంలో పడిపోయింది. పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసిన వారిని డీఎంకే అధినేత కరుణానిధి పార్టీ నుంచి గెంటేశారు. మరికొందరిని కీలక బాధ్యతల నుంచి తప్పించారు. పార్లమెంటు ఫలితాలు పునరావృతం కాకుండా అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు కరుణ, స్టాలిన్లు నడుంబిగించారు. స్టాలిన్ రాష్ట్రమంతా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను పునరుత్తేజ పరిచే పనిలో పడ్డారు. వేట కొడవళ్లు, పెట్రోబాంబులు చెన్నై నగరంలోని వార్డుల్లో జరుగుతున్న పార్టీ ఎన్నికలు శనివారం గొడవలకు దారితీశాయి. కోయంబేడు లోని ఒక కల్యాణ మండపంలో 127 వార్డు ఎన్నికలకు రెండు వర్గాలు పోటీపడ్డాయి. 200 మంది మహిళలు, 600 మంది పురుషులు హాజరయ్యూరు. ఎన్నికల నిర్వహణ సమయంలో రెండు పక్షాల మధ్యన మాటామాటా పెరగడంతో కుర్చీలను విసురుకున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యక్తులు రహస్యంగా దాచుకున్న వేటకొడవళ్లను బైటకు తీసి 76వ వార్డుకు చెందిన పన్నీర్ అనే కార్యకర్తని గాయపరిచారు. ఇరుపక్షాలు గొడవపడుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు మండ పం వెలుపల నుంచి లోనికి రెండు పెట్రోబాంబులను విసిరారు. అయితే అదృష్టవశాత్తు అవి పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బాంబులు విసిరిన వారు పరారు కావడంతో పోలీసులు గాలిస్తున్నారు. 14వ వార్డులో ఎమ్మెల్యే అన్బగళన్, మాజీ మేయర్ సుబ్రమణ్యం మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరడంతో ఎన్నికలను వాయిదా వేశారు. పార్టీ నేతల మధ్య రాజీపరిచి ఎన్నికలను ఏకగ్రీవం చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు. అన్నాడీఎంకే నుంచి డీఎంకేలో చేరిన నేతకు పెద్దపీట వేయడం ఘర్షణకు దారితీయడంతో 12 వ వార్డులో ఎన్నికలు వాయిదాపడ్డాయి. -
టీడీపీలో అంతర్గత పోరు!
బొబ్బిలి:బొబ్బిలి పురపాలక సంఘంలోని కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక టీడీపీలో చిచ్చు రగిలి స్తుంది. రాష్ర్టంలో అధికారంలో ఉన్నా ఇక్కడ మునిసిపాలిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆ పార్టీలో ఇప్పుడు కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక చిచ్చు రగులుస్తుంది. ఆ పార్టీలోని నాయకుల మధ్యే సమన్వయం లేకపోవడంతో సభ్యుని ఎన్నికకు ఆ పార్టీ కౌన్సిలర్ల మద్దతే కరువైంది. పురపాలక సంఘంలో ఒక జనరల్ స్థానంతో పాటు క్రిష్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కో ఆప్షన్ స్థానాలున్నాయి. ముందుగా జనరల్ స్థానానికి ఎన్నిక జరిపిన అనంతరం మిగిలిన రెండు మెజార్టీ సభ్యుల ఆమోదంతో భర్తీ చేపట్టాల్సి ఉంది. జనరల్ స్థానానికి మున్సిపాలిటీ ఇచ్చిన నోటిఫికేషన్లో 12 మంది కౌన్సిలర్లు దరఖాస్తు చేసుకున్నారు. బీసపు వైపే టీడీపీ మొగ్గు.. వైఎస్ఆర్సీపీ బి ఫారంపై గెలిచి ఇటీవల చైర్పర్సన్ ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చిన 15వ వార్డు కౌన్సిలర్ బీసపు పార్వతి భర్త, మాజీ కౌన్సిలరు బీసపు చిన్నారావుకు కో ఆప్షన్‌గా నియమించడానికి టీడీపీలోని ఓ వర్గం సుముఖంగా ఉండడంతో అదే పార్టీలోని మిగిలిన వారు వ్యతిరేకిస్తున్నారు. చిన్నారావు పేరు సూచించకుండా ఎవరిని సూచించినా మద్దతు ఉంటుందంటూ 8, 16 వార్డుల కౌన్సిలర్లు ఈ నెల 8న జరిగిన కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా ఉండిపోయారు. దాంతో ఆనాటి సమావేశం కోరం లేక వాయిదా పడింది. 8, 16 వార్డుల కౌన్సిలర్లు ఇద్దరిని కౌన్సిల్ హాలుకు పంపించడానికి జరిపిన మంతనాల్లో నాయకులు, కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం. పట్టుబడుతున్న కాంగ్రెస్ చైర్పర్సన్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చిన విధంగా కో ఆప్షన్ స్థానం ఇవ్వాలని ఆ పార్టీ వారు పట్టుబడుతున్నారు. చైర్పర్సన్ ఎన్నికకు టీడీపీకి బలం చాలకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12, 28 వార్డుల కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు కో ఆప్షన్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఇప్పుడు దానిని ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనికి టీడీపీ చేతులెత్తేయడంతో ఆ సభ్యులు కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎన్నికకు సన్నాహాలు కో ఆప్షన్ ఎన్నికను టీడీపీ నాయకులు అనుకున్న వారికి ఇప్పించడానికి ఓటింగు ద్వారా కాకుండా మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండుసార్లు కౌన్సిల్ సమావేశం వాయిదాపడితే మూడో సమావేశంలో చైర్పర్సన్ తన అధికారంతో మెజార్టీ సభ్యుల ఆమోదంతో సభ్యుని ఎన్నిక జరుపుకొనే అవకాశం ఉంది. ఈ నెల 16న రెండోసారి సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం కూడా కోరం చాలక వాయిదా పడేటట్లు చేయడానికి అధికార పార్టీ ప్రణాళికలు వేస్తుంది. అప్పుడు మూడోసారి సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరపడానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
పట్టు కోసం ఎమ్మెల్యే ల పోరు
శృంగవరపుకోట టీడీపీలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో వ్యవహారం కొనసాగుతోంది. వీరి మధ్య పోరు నడవడం కొత్తేమి కాకపోయినా ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీటు కోసం పోరు నడిచింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే పదవితో ఒకరు, చేతికొచ్చిన జెడ్పీ చైర్పర్సన్ పవర్‌తో ఇంకొకరు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ భయంతో కోళ్ల లలితకుమారి ఒక అడుగు ముందుకేసి తమ అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలకు ముందు ఎస్.కోట ఎమ్మెల్యే టిక్కెట్‌పై కోళ్ల లలితకుమారి, శోభా హైమావతి కన్నేశారు. నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారికి వ్యతిరేకత ఉందన్న అస్త్రంతో హైమావతి ముందుకెళ్లగా, కొప్పల వెలమ సామాజిక వర్గం ఎక్కువగా నియోజకవర్గంలో ఉన్నారని, అదే సామాజిక వర్గానికి చెందిన తనకు టిక్కెట్ ఇవ్వాలన్న నినాదంతో లలితకుమారి టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. దీంతో ఇరువురు రెండు గ్రూపులుగా విడిపోయి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ వాదనను అప్పట్లో వినిపించారు. అవకాశం వచ్చినప్పుడుల్లా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. అధినేత చంద్రబాబునాయుడు వద్ద తమదైన బాణీలో వాణి విన్పించారు. ఈలోపే జెడ్పీటీసీ ఎన్నికలు రావడంతో వీరిద్దరికీ ఉపశమనం లభించింది. లలితకుమారికి ఎమ్మెల్యే టిక్కెట్, హైమావతి కుమార్తె స్వాతిరాణికి జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామని అధిష్టానం ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో మనసులు కలిసి ఎన్నికల్లో ఐక్యతగా పని చేశారు. గెలిచారు. ఇద్దరికీ పదవులు లభిం చాయి. దీంతో హమ్మయ్యా! అని టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో మళ్లీ వారి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేగా తన ఆధిపత్యం కొనసాగాలని కోళ్ల లలితకుమారి ప్రయత్నిస్తుండగా, జెడ్పీ చైర్పర్సన్ హోదాలో పట్టు సాధించాలని హైమావతి ఆరాట పడుతున్నారు. ముఖ్యంగా వేపాడ, ఎస్.కోట మండలాలను పూర్తిగా తనకే వదిలేయాలని, ఆ రెండింటిలో అభివృద్ధి, సంక్షేమ, కాంట్రాక్ట్ కార్యక్రమాలు తానే చూసుకుంటానని శోభా హైమావతి పార్టీ శ్రేణుల వద్ద అంతర్లీనంగా చెబుతున్న వార్తలతో కోళ్ల లలితకుమారి ఆవేదన చెందుతోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గమంతా తన పర్యవేక్షణలో ఉంటుందని, రెండు మండలాలను వేరుగా చూడటమేంటని కోళ్ల వర్గీయులు మండి పడుతున్నారు. ఇదంతా భవిష్యత్ వ్యూహామేనని, హైమావతి అల్లుడ్ని ఇక్కడ బరిలోకి దించాలనే ఆలోచన ఉందని, స్వతహాగా ఆమె అల్లుడు గణేష్ కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారని, అందుకోసం ఇప్పటి నుంచే కేడర్‌ను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారని కోళ్ల లలితకుమారి అభద్రతా భావానికి లోనవుతున్నారు. మరో పవర్ సెంటర్ తయారైతే ఇబ్బందులొస్తాయని భావిస్తూ లలితకుమారి అప్రమత్తమయ్యారు. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని, తనకే నియోజకవర్గం సొంతం కావాలని పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని శోభా హైమావతికి వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. -
తేలని.. పంచాయితీ!
నల్లగొండ టౌన్ : ఒక్క గది కోసం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇటీవల ఆధునిక హంగులతో మరమ్మతులు చేపట్టిన క్యాజువాలిటీ విభాగమే ఈ అంతర్గత పోరుకు ఆజ్యం పోసింది. ఈసీజీ విభాగం ఉద్యోగులకు, నర్సింగ్ ఉద్యోగులకు మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత స్థాయిలో పోరు సాగుతోంది. వీరి పంచాయితీని పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే క్యాజువాలిటీ విభాగం ప్రారంభానికి నోచుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీని కారణంగా రోగులతోపాటు ఆస్పత్రి సిబ్బంది కూడా తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు. క్యాజువాలిటీ విభాగంలో మూడు గదులను ఏర్పాటు చేశారు. అందులో రెండు నర్సులకు, ఒకటి ఈసీజీ విభాగానికి కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. దీనిని నర్సులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే తమకు సౌకర్యంగా ఉండడానికి మూడు గదులను కేటాయించాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. నర్సులతోపాటు మహిళా స్వీపర్లు కూడా ఇక్కడ విధులలో ఉంటారని, అందరూ డ్యూటీ ముగిసిన తరువాత డ్రెస్‌లు మార్చుకోవడానికి అనుకూలంగా ఉండడంతోపాటు రాత్రి విధులలో ఉండేవారికి సౌకర్యంగా ఉంటుందని వాదిస్తున్నారు. అసలు ఈసీజీ విభాగం ఉద్యోగులు అత్యవసరమైనప్పుడు పిలిపిస్తే వచ్చి ఈసీజీ తీస్తారని, వారికి గది అవసరం లేదని నర్సులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే నర్సులకు రెండు గదులు సరిపోతాయని, తమకు గది కేటాయించకపోతే ఆరుబయట ఈసీజీని తీయాలా అని ప్రశ్నిస్తున్నారు. గదిలో ఈసీజీ తీయడానికి బెడ్‌తోపాటు రోగి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. గది లేకపోతే మహిళా రోగులకు బయట ఈసీజీని తీయగలమా అని ప్రశ్నిస్తున్నారు. తమకు ఎట్టిపరిస్థితులలో గదిని కేటాయించాల్సిందేనంటూ అధికారుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇరువర్గాలకు చెందిన యూనియన్ లీడర్లు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని గది కోసం పట్టుబడుతున్నారు. దీనిపై ఏమి నిర్ణయం తీసుకోలేని అధికారులు క్యాజువాలిటీ ప్రారంభించానికి జంకుతున్నట్లు సమాచారం. ఇరు విభాగాల సిబ్బంది అంతర్గత పోరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లడంతో ఆస్పత్రి అధికారులకు తలనొప్పిగా మారింది. ఉద్యోగులపై అధికారుల అజమాయిషీ లేకపోవడం వల్లే గది కోసం అంతర్గత పోరు సాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏదిఏమైనా దీనిపై ఒక నిర్ణయం తీసుకుని క్యాజువాలిటీని వెంటనే ప్రారంభించి రోగులకు సరైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
టీడీపీలో అంతర్గత పోరు!
సాలూరు, న్యూస్‌లైన్: సాలూరు నియోజకవర్గంలోని టీడీపీలో అంతర్గత పోరు నెలకొంది. ఇన్నాళ్లూ అంతా సవ్యం గానే ఉందనుకున్న నేతల మధ్య విభేదాలు ఇప్పు డు బయటపడుతున్నాయి. సాలూరు అసెంబ్లీ టిక్కెట్‌ను ఆర్పీ భంజ్‌దేవ్‌కు కేటాయించడంతో సంధ్యారాణి వర్గీయులు భగ్గుమంటున్నారు. గత ఎన్ని కల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలైనప్పటి నుంచీ ఈసారి కూడా సాలూరు అసెంబ్లీ అభ్యర్థివి నువ్వే...కష్టపడి పని చేయని చెబుతూ వచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు ఆఖరు నిమిషంలో మొండిచేయి చూపడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన ఆమెను కాదని, చివరి నిమిషంలో భంజ్‌దేవ్‌కు ఎందుకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై కార్యకర్తలు ఆరా తీస్తున్నారు. అయితే సంధ్యారాణికి అసెంబ్లీ టిక్కెట్ ఇస్తే.. పార్టీలో ఉంటూ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ ఆమె గెలుపునకు ఎట్టి పరిస్ధితుల్లోనూ సహకరించరని, అందువల్లే ఆయనకు టిక్కెట్ ఇచ్చినట్టు నేతలు చెబుతున్నారు. అందుకే భంజ్‌దేవ్‌కు సాలూరు అసెంబ్లీ స్థానాన్ని, సంధ్యారాణికి ఎంపీ టిక్కెట్ ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. కానీ పార్టీలో ఎవరిని కదిపినా.. సంధ్యారాణికి అన్యా యం జరిగిందనే అంటున్నారు. ఐదేళ్ల పాటు పార్టీ ని నడిపించిన ఆమే గెలవకుంటే.. భంజ్‌దేవ్ ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు. -
టీఆర్ఎస్లో అంతర్గత పోరు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో అంతర్గత పోరు రగులుతోంది. గ్రూపు రాజకీయాలకు చిరునామాగా పేర్కొన్న కాంగ్రెస్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉద్యమ పార్టీలో కూడా నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండటం ఎన్నికల వేళ చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ముఖ్య నాయకులు రెండు, మూడు గ్రూపులుగా విడిపోయారు. కొందరు ముఖ్య నాయకులు పార్టీ అధినేత కేసీఆర్ తనయుడు కేటీఆర్ వర్గీయులుగా పేరుండగా, మరికొందరు హరీష్‌రావు సన్నిహితులుగా ముద్రపడింది. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న శ్రీహరిరావు కేటీఆర్ కు సన్నిహితులు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న, పశ్చిమ జిల్లా అధ్యక్షులు లోక భూమారెడ్డి తదితరులకు హరీష్‌రావుతో మంచి సంబంధాలున్నాయి. ఇటీవల నిర్మల్‌కు చెందిన అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకు జోగు రామన్న, లోక భూమారెడ్డి తదితరులు ప్రత్యేక చొరవ చూపినట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ మేరకు వీరు అధినేత కేసీఆర్‌ను కలిసి ఐకే రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరిరావుకు ఏమాత్రం మింగుడు పడలేదు. నిర్మల్‌లో తనకు చెక్‌పెట్టే విధంగా ఈ నాయకులు వ్యవహరించడంతో ఆయన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆయన కేటీఆర్‌ను ఆశ్రయించి నిర్మల్ టిక్కెట్ విషయంలో స్పష్టమైన హామీ తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముథోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారిది మరో దారి. మిగతా నేతలతో ఈయనకు సంబంధాలు అంతంత మాత్రమే. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఉన్న గోడం నగేష్‌ను ఇటీవల పార్టీలోకి చేర్చుకోవడం వేణుగోపాలాచారికి ఏ మాత్రం ఇష్టం లేదని ఆ పార్టీ నాయకులు ప్రైవేట్ సంభాషణల్లో పేర్కొం టున్నారు. నగేష్, చారీలు టీడీపీ లో ఉన్నప్పుడు ఎవరికివారే అన్న చందంగా వ్యవహరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. బోథ్ నియోజకవర్గానికి రాములునాయక్ చాలా రోజులుగా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు నగేష్ రాకతో రాములుకు చెక్ పడినట్లయింది. నగేష్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో బోథ్ నుం చి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారనే ప్రచారం ఉంది. కాగా ఇటీవల జెడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్ల విషయంలో రాములునాయక్ వర్గీయులకు మొండిచేయి మిగి లింది. నగేష్ వెంట టీడీపీ నుంచి కొత్తగా వచ్చిన ఆయన అనుచరులకే దాదాపు టిక్కెట్లన్నీ దక్కడంతో రాములునాయక్ వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఖానాపూర్‌లో నియోజకవర్గ నేతల్లోని విభేదాలైతే ఏకంగా రచ్చకెక్కా యి. పార్టీలో కొత్తగా చేరిన రేఖాశ్యాంనాయక్ అసలు ఎస్టీనే కాదనే వాదన తెరపైకి రాగా, పైగా స్థానికేతరులకు టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకులు బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. తూర్పు జిల్లాలోనూ.. తూర్పు జిల్లా టీఆర్ఎస్లోనూ లుకలుకలున్నాయి. సిర్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మహిళ నాయకురాలు పాల్వాయి రాజ్యలక్ష్మిలు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా రెండు వర్గాలు వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చెన్నూర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, పార్టీ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్ మధ్య అంతర్గత విభేధాలు కొనసాగుతున్నాయి. కొత్తగా పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ గడ్డం వివేక్ పార్టీలోకి రావడంతో ఇక్కడ పార్టీ శ్రేణులు మూడు వరా్గాలుగా విడిపోయాయి. మంచిర్యాలలో టీఆర్ఎస్ టిక్కెట్ బీసీలకే కేటాయించాలని పార్టీ స్థానిక నాయకులు నడిపెల్లి దివాకర్‌రావు టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను ముట్టడించిన విషయం విధితమే. అంతర్గత పోరు ఈ ఎన్నికల్లో ఎటుదారి తీస్తుందోనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
దేశంలో సిగపట్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు :జిల్లా దేశంలో నేతల మధ్య అంతర్గత పోరు పెచ్చుమీరుతోంది. ఎవరికి వారే తమ ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు పావులు కదుపుతూ కార్యకర్తలను గందరగోళ స్థితికి నెట్టేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ బాబు ద్వారా సీట్లు కేటాయిస్తామంటూ ఆశలు రేపుతున్నారు. జిల్లాలో దాదాపు ఐదారు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురవుతుండటంతో అక్కడి ఆశావహుల్లో అలజడి రేగుతోంది. చిలకలూరిపేటనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుకు పోటీగా కాంగ్రెస్ తరఫున గుంటూరు చందనాస్ ఆస్పత్రి అధినేత డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య, సత్తెనపల్లినుంచి గత ఎన్నికల్లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన బైరా దిలీప్చక్రవర్తితోపాటు మరికొందరి పేర్లు వినబడుతున్నాయి. దిలీప్ బరిలో నిలిస్తే తనకు నష్టం తప్పదని గ్రహించిన ప్రత్తిపాటి ‘బాబు’ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి బైరా దిలీప్‌కు సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట సీటు ఇప్పించే యత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ విధంగా మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌కు చెక్ పెట్టాలని ఆయన భావిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ తరఫున చిలకలూరిపేట నుంచి పోటీ చేస్తానని చెప్పిన దిలీప్ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నానని సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని సన్నిహితులకు చెబుతున్నారు. దీనిపై సాక్షి ప్రతినిధి ఆయనతో మాట్లాడగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిలకలూరిపేట సీటుపై హామీ ఇచ్చినా పోటీ చేసే ఆలోచన లేదని చెప్పినట్టు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంతో సత్తెనపల్లిపై ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ దేశం ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యే వై.వి.ఆంజనేయులు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావుల్లో ఆందోళన మొదలైంది. రేపల్లె నియోజకవర్గ దేశం ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాద్ అక్కడ చురుకుగా పనిచేస్తున్నా సినీనటుడు సుమన్‌ను బరిలోకి దింపేందుకు పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. సినీనటుడు బాలకృష్ణతోపాటు పార్టీ నాయకుడు కేశన శంకరరావు సైతం సుమన్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాజ్యసభ సభ్యుడైన సుజనా చౌదరి మాత్రం ఈ స్థానాన్ని కమ్మ సామాజికవర్గానికి చెందిన దేవినేని మల్లిఖార్జునరావుకు కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. తాడికొండ నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా అక్కడి సీనియర్లు కొందరు పావులు కదుపుతున్నారు. ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వవద్దని మాజీ మంత్రి పుష్పరాజ్ వర్గం అధినేతపై ఒత్తిడి తీసుకువస్తోంది. తమ నాయకుడు పుష్పరాజ్‌కే ఇవ్వాలని పట్టుపడుతోంది. దీనిపై వారంతా ఇటీవల గుంటూరులో సమావేశంలో నిర్ణయించుకున్నారు కూడా. పార్టీలోని సీనియర్లు చెరో వర్గానికి మద్దతుగా నిలవడంతో చంద్రబాబు వద్ద సెక్యూరిటీ అధికారి సమీప బంధువైన రవికిషోర్‌కు సీటు ఇప్పించేందుకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలోని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో అనేక మంది సీనియర్లు పార్టీ కోసం పనిచేస్తుంటే, కొందరు సీనియర్లు వారిని కాకుండా ఆర్థికవనరులు పుష్కలంగా ఉన్నవారిని తెరపైకి తీసుకువస్తున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన హకీంకు తూర్పు సీటు ఖరారు కానుందని ఆయన్ను భుజాన వేసుకున్న కొందరు నేతలు చెబుతుంటే మరికొందరు వైశ్య సామాజికవర్గానికి చెందిన దేవరశెట్టి సుబ్బారావు పేరును తెరపైకి తీసుకువచ్చారు. బాపట్ల, మంగళగిరి నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితులు కనపడుతుండటంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు.