రెండు మంత్రి పదవులిస్తే సరి... లేదంటే రచ్చరచ్చే!
⇔ సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తే తమ పరిస్థితేంటని వ్యతిరేకుల్లో ఆందోళన
⇔ టార్గెట్ అయిపోతామన్న భయం
⇔ రెండో మంత్రి పదవికోసం లలిత, గీతల ఆశలు
⇔ కన్పించని సానుకూల సంకేతాలు
⇔ నాయకులతో పాటు అధికారుల్లో ఆందోళన
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవ్వడంతో జిల్లా నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా నాడు బయటపడినవారంతా ఇప్పుడు భయపడుతున్నారు. తాము కాదన్నవారికి మంత్రిపదవి దక్కుతుందన్న సంకేతాలు రావడమే దానికి కారణం. బయటపడినవారిలో ఒక్కరికైనా స్థానం కల్పించకుంటే ఇక పార్టీలో అంతర్గత పోరు ఖాయమన్న భావన కనిపిస్తోంది. వ్యతిరేకించినవారిని అణగదొక్కే ప్రయత్నాలు మొదలవుతాయన్న వాదన వినిపిస్తోంది. అంతేనా...అధికారుల్లోనూ అభద్రతా భావం మొదలైంది. సురక్షిత స్థానాలకు చేరుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి బాహాటంగానే చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడ్ని కలిసి కూడా తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఓసీకిస్తే బీసీలంతా దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు. జిల్లాలోని బీసీ సంఘాలు కూడా వీరి అభిప్రాయానికి మద్దతు పలికి, గొంతు కలిపారు. కానీ అదిష్టానం పట్టించుకున్నట్టుగా లేదు. సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తున్నామన్న సంకేతాలిస్తోంది. అదే జరిగితే బహిరంగంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి ఇబ్బంది కరంగా మారనుంది. వారిలో అంతర్మధనం మొదలయ్యింది. తాము కాదన్న వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే తప్పనిసరిగా టార్గెట్ అవుతామని టెన్షన్ పడుతున్నారు.
లలిత, గీత ఆశలు ఫలించేనా?
మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, మీసాల గీత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి మృణాళినిని తప్పిస్తే వెలమ, మహిళ సామాజిక వర్గ సమీకరణాల్లో తనకొస్తుందని కోళ్ల లలితకుమారి, కాపు సామాజిక వర్గం నుంచి తనకొస్తుందని మీసాల గీత ఆశించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు నేరుగా కోళ్ల లలితకుమారిని కలసి మంత్రి పదవిని ఆశించొద్దని, సుజయకృష్ణకు ఇచ్చేందుకు ఇప్పటికే ఖరారైపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె అవాక్కై... తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో చెప్పుకుని బాధపడ్డారు.
అంతకుముందు మీసాల గీత పేరు కూడా తెరపైకి వచ్చింది. కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చేశాయి. దాంతో ఆమెకు ఆశలు చిగురించాయి. కానీ, కొద్ది రోజుల్లోనే ఆ వాదన కనుమరుగైపోయింది. తాజాగా కోళ్ల లలితకుమారి పేరు కూడా పరిశీలిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా నుంచి ఇద్దరికి అవకాశమిస్తే లలితకుమారికి బెర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.
ఇదేదీ కాదని ఒక్క సుజయ్‌కే మంత్రి పదవి ఇస్తే ఆయన్ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ గడ్డు కాలమే. అంతర్గతంగా ఇబ్బందులు పడక తప్పదు. ఈ మేరకు ఇప్పటికే బొబ్బిలి రాజుల శిబిరం నుంచి రాజకీయంగా పావులు కదులుతున్నట్టు తెలుస్తోంది. తమ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న ద్వారపురెడ్డి జగదీష్‌ను జిల్లా అధ్యక్ష పదవినుంచి తప్పించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇదే తరహాలో మిగతా ఎమ్మెల్యేలను కూడా లక్ష్యం చేసుకోవచ్చని అసమ్మతి నేతల అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
మృణాళినిని తప్పిస్తే...
మంత్రి పదవి నుంచి మృణాళినిని తప్పిస్తే ఆమెను నమ్ముకున్న నాయకులంతా ఇబ్బందులు పడక తప్పదు. రెండు మూడు నియోజకవర్గాల్లో మృణాళిని మద్దతుతో రాజకీయాలు చేస్తున్న నాయకుల భవిష్యత్ అగమ్య గోచరం కానుంది. అంతేకాదు ఆమెను నమ్ముకుని వచ్చిన అధికారులు సైతం ఇబ్బందులు పడేలా ఉన్నారు.
మృణాళినిని నమ్ముకునే వారితో పాటు అసమ్మతి స్వరం విన్పిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంబంధాలున్న అధికారులు సైతం ఆందోళనలో ఉన్నారు. మంత్రి కానున్నామన్న అభిప్రాయంతో ఇప్పటికే తనకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల జాబితాను ఓ ఎమ్మెల్యే వర్గం తయారు చేస్తున్నది. తామొచ్చేలోపు వెళ్లిపోతే సరి... లేదంటే తాము సాగనంపాల్సి వస్తుందన్న సంకేతాలను ఇప్పటికే పంపించారు. దీంతో ఆ అధికారులు ముందస్తు జాగ్రత్తగా దార్లు వెతుక్కుంటున్నారు.