sujay krishna rangarao
-
రెండు మంత్రి పదవులిస్తే సరి... లేదంటే రచ్చరచ్చే!
⇔ సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తే తమ పరిస్థితేంటని వ్యతిరేకుల్లో ఆందోళన ⇔ టార్గెట్ అయిపోతామన్న భయం ⇔ రెండో మంత్రి పదవికోసం లలిత, గీతల ఆశలు ⇔ కన్పించని సానుకూల సంకేతాలు ⇔ నాయకులతో పాటు అధికారుల్లో ఆందోళన మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారవ్వడంతో జిల్లా నేతల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా నాడు బయటపడినవారంతా ఇప్పుడు భయపడుతున్నారు. తాము కాదన్నవారికి మంత్రిపదవి దక్కుతుందన్న సంకేతాలు రావడమే దానికి కారణం. బయటపడినవారిలో ఒక్కరికైనా స్థానం కల్పించకుంటే ఇక పార్టీలో అంతర్గత పోరు ఖాయమన్న భావన కనిపిస్తోంది. వ్యతిరేకించినవారిని అణగదొక్కే ప్రయత్నాలు మొదలవుతాయన్న వాదన వినిపిస్తోంది. అంతేనా...అధికారుల్లోనూ అభద్రతా భావం మొదలైంది. సురక్షిత స్థానాలకు చేరుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యేలు కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలితకుమారి, మీసాల గీత, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి బాహాటంగానే చెప్పారు. సీఎం చంద్రబాబునాయుడ్ని కలిసి కూడా తమ అభిప్రాయాన్ని చెప్పారు. ఓసీకిస్తే బీసీలంతా దూరమవుతారని పరోక్షంగా హెచ్చరించారు. జిల్లాలోని బీసీ సంఘాలు కూడా వీరి అభిప్రాయానికి మద్దతు పలికి, గొంతు కలిపారు. కానీ అదిష్టానం పట్టించుకున్నట్టుగా లేదు. సుజయ్‌కు మంత్రి పదవి ఇస్తున్నామన్న సంకేతాలిస్తోంది. అదే జరిగితే బహిరంగంగా వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పరిస్థితి ఇబ్బంది కరంగా మారనుంది. వారిలో అంతర్మధనం మొదలయ్యింది. తాము కాదన్న వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే తప్పనిసరిగా టార్గెట్ అవుతామని టెన్షన్ పడుతున్నారు. లలిత, గీత ఆశలు ఫలించేనా? మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, మీసాల గీత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మంత్రి మృణాళినిని తప్పిస్తే వెలమ, మహిళ సామాజిక వర్గ సమీకరణాల్లో తనకొస్తుందని కోళ్ల లలితకుమారి, కాపు సామాజిక వర్గం నుంచి తనకొస్తుందని మీసాల గీత ఆశించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు నేరుగా కోళ్ల లలితకుమారిని కలసి మంత్రి పదవిని ఆశించొద్దని, సుజయకృష్ణకు ఇచ్చేందుకు ఇప్పటికే ఖరారైపోయిందని చెప్పడంతో ఒక్కసారిగా ఆమె అవాక్కై... తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో చెప్పుకుని బాధపడ్డారు. అంతకుముందు మీసాల గీత పేరు కూడా తెరపైకి వచ్చింది. కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చేశాయి. దాంతో ఆమెకు ఆశలు చిగురించాయి. కానీ, కొద్ది రోజుల్లోనే ఆ వాదన కనుమరుగైపోయింది. తాజాగా కోళ్ల లలితకుమారి పేరు కూడా పరిశీలిస్తున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. జిల్లా నుంచి ఇద్దరికి అవకాశమిస్తే లలితకుమారికి బెర్త్ ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇదేదీ కాదని ఒక్క సుజయ్‌కే మంత్రి పదవి ఇస్తే ఆయన్ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ గడ్డు కాలమే. అంతర్గతంగా ఇబ్బందులు పడక తప్పదు. ఈ మేరకు ఇప్పటికే బొబ్బిలి రాజుల శిబిరం నుంచి రాజకీయంగా పావులు కదులుతున్నట్టు తెలుస్తోంది. తమ వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న ద్వారపురెడ్డి జగదీష్‌ను జిల్లా అధ్యక్ష పదవినుంచి తప్పించేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇదే తరహాలో మిగతా ఎమ్మెల్యేలను కూడా లక్ష్యం చేసుకోవచ్చని అసమ్మతి నేతల అనుచరులు ఆందోళన చెందుతున్నారు. మృణాళినిని తప్పిస్తే... మంత్రి పదవి నుంచి మృణాళినిని తప్పిస్తే ఆమెను నమ్ముకున్న నాయకులంతా ఇబ్బందులు పడక తప్పదు. రెండు మూడు నియోజకవర్గాల్లో మృణాళిని మద్దతుతో రాజకీయాలు చేస్తున్న నాయకుల భవిష్యత్ అగమ్య గోచరం కానుంది. అంతేకాదు ఆమెను నమ్ముకుని వచ్చిన అధికారులు సైతం ఇబ్బందులు పడేలా ఉన్నారు. మృణాళినిని నమ్ముకునే వారితో పాటు అసమ్మతి స్వరం విన్పిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంబంధాలున్న అధికారులు సైతం ఆందోళనలో ఉన్నారు. మంత్రి కానున్నామన్న అభిప్రాయంతో ఇప్పటికే తనకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారుల జాబితాను ఓ ఎమ్మెల్యే వర్గం తయారు చేస్తున్నది. తామొచ్చేలోపు వెళ్లిపోతే సరి... లేదంటే తాము సాగనంపాల్సి వస్తుందన్న సంకేతాలను ఇప్పటికే పంపించారు. దీంతో ఆ అధికారులు ముందస్తు జాగ్రత్తగా దార్లు వెతుక్కుంటున్నారు. -
వారంతా ఒక్కటయ్యారు !
ఏకాకిగా మారిన బొబ్బిలి ఎమ్మెల్యే ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ సీఎంకు వినతి ముగ్గురు ఎమ్మెల్యేలు... ఇద్దరు ఎమ్మెల్సీలు కలసి వేడుకోలు తమలో ఎవరికిచ్చినా ఫర్వాలేదని స్పష్టీకరణ జిల్లాలో అందరి మాటా... అదేనంటూ సంకేతాలు కుల సమీకరణలనూ వివరించిన వైనం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఏకాకిగా మిగిలారు. మిగిలినవారంతా ఆయనకు వ్యతిరేక కూటమిగా మారారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం వస్తే... ఆయనకు ఇవ్వడానికి వీల్లేదనీ... బీసీలకే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రెండు రోజుల క్రితం సీఎంను నేరుగా కలసి తమ మనోభావాన్ని తెలియజేశారు. ఇందులో కుల సమీకరణలూ ప్రస్తావించారు. కాదని ఆయనకే పదవి కట్టబెడితే... బీసీలంతా మనకు దూరమవుతారని పరోక్ష సంకేతాలిచ్చారు. అయితే వీరి వెనుక అశోక్‌గజపతిరాజు ప్రోత్సాహం ఉందేమోనన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం :‘జిల్లాలో ఇప్పటికే కేంద్రమంత్రి పదవిని ఓసీకి ఇచ్చారు. రాష్ట్ర మంత్రి పదవిని మళ్లీ అదే ఓసీకి ఇవ్వడం సరికాదు. మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే బీసీలకే అవకాశం ఇవ్వాలి. అదీ ఒరిజనల్ బీసీలకే ఇవ్వండి. వెలమలమని చెప్పుకునే దొరలకు ఇవ్వొద్దు.’ అని సీఎం చం ద్రబాబునాయుడ్ని, పార్టీ కార్యాలయ కార్యదర్శి టి.డి.జనార్దన్‌ను టీడీపీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఇటీవలే పార్టీలోకొచ్చిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని తెగేసి చెప్పేశారు. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఒక్కటయ్యారు. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబునాయుడ్ని, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ కార్యాలయ కార్యదర్శి టి.డి. జనార్దన్‌ను ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కె.ఎ.నాయుడు, మీసాల గీత సంయుక్తంగా కలిసి తమ మనోగతాన్ని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి పదవిని కూడా ఓసీకిస్తే బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని, ఆ వర్గాన్ని దూరం చేసుకోవల్సి వస్తోందని పరోక్షంగా హెచ్చరించారని తెలిసింది. మాలో ఎవరికిచ్చినా పర్వాలేదు మంత్రి పదవి తమలో ఎవరికిచ్చినా ఫర్వాలేదని, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు, వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరున్నారని చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ ఎస్టీకి ఇవ్వాలనుకుంటే సంధ్యారాణికి ఇవ్వాలని, ఎస్సీకి ఇవ్వాలనుకుంటే బొబ్బిలి చిరంజీవులు ఉన్నారని సీఎంను కలిసిన ఐదుగురు నేతలు చెప్పినట్టు తెలియవచ్చింది. ఇదే విషయమై మరోసారి ఈ నెల 18న లోకేష్‌కు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, వెళ్లిన వారితో పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు కూడా ఉండేవారని కాకపోతే ఒకరు అనారోగ్యంతో, మరొకరు వ్యక్తిగత కారణంగా వెళ్లలేకపోయారని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సుజయకృష్ణ రంగారావును వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టమవుతోంది. జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి తప్ప మరెవ్వరూ వారి వెనక లేరని తెలియవస్తోంది. ఇది అశోక్ వ్యూహమేనా? సుజయకృష్ణ రంగారావుకు వ్యతిరేకంగా సీఎంను కలిసిన ఐదుగురు వెనుక కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంత ధైర్యంగా సీఎం వద్దకు వెళ్లి చెప్పారంటే అశోక్ డైరెక్షన్ ఉండొచ్చనే వాదనలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే, సుజయకృష్ణ రంగారావును టీడీపీలోకి తీసుకోవడమే అశోక్ గజపతిరాజుకు ఇష్టం లేదని, తప్పని పరిస్థితుల్లో తీసుకోవల్సి వచ్చిందనే చర్చ ఎప్పటినుంచో ఉంది. మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం వ్యతిరేకత కనబరిచినట్టు తెలుస్తోంది. బంగ్లా నుంచి పవర్ సెంటర్ మారుతుందనో...పట్టు కోల్పోతామన్న భయమో తెలియదు గాని సుజయకృష్ణకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో సానుకూలంగా లేరని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఐదుగురు నేతలు సీఎంను కలిసి తమ మనోగతాన్ని తెలియజేసినట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. -
రాజుగారూ.. రాజీనామా చేయండి
బొబ్బిలి: వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచిన బొబ్బిలి ఎమ్మె ల్యే సుజయ్‌కృష్ణ చిత్తశుద్ది ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజా గౌరవం పొందాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి సవాల్ చేశారు. బొబ్బిలిలో తూముల రాంసుధీర్ ఆధ్వర్యంలో అప్పయ్యపేట రోడ్డులో పార్టీ కార్యాలయాన్ని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో కోలగట్ల మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాక వైఎస్సార్ సీపీలో బొబ్బిలి రాజులు చేరారు తప్ప... పార్టీని వారు తీసుకురాలేదని పేర్కొన్నారు. కాబట్టి ఆ పార్టీద్వారా దక్కిన పదవిని విడచిపెట్టాల్సిందేనని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. రాజులు పార్టీ వీడినా పార్టీ మాత్రం చెక్కుచెదరలేదనీ, దాని బలం తగ్గలేదని స్పష్టం చేశారు. రాజులకు ఒకప్పుడు గౌరవం ఉండేదనీ, ఇప్పుడు అది పోయిందని పేర్కొన్నారు. సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు నీతికి మారుపేరు సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్ప శ్రీవాణిలు నీతి, నిజాయితీకి మారుపేరని కొనియాడా రు. వారిద్దరి ఆధ్వర్యంలో బొబ్బిలిలో వైఎస్సార్ సీపీ మ రింత అభివృద్ధి చెందుతుందన్నారు. బొబ్బిలి నాయకు లు, కార్యకర్తలకు జిల్లా పార్టీ అండగా ఉంటుందనీ, త్వరలో పట్టణంలో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామనీ తెలిపారు. కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స మాట్లాడుతూ పార్టీకి ప్రజలుంటే చాలని, నాయకులు అక్కరలేదన్నారు. వైఎస్ఆర్సీపీకి ప్రజాభి మానం ఉందన్నారు. మహారాజుల కాలం పోయిందని, అశోక్ లాంటి వారినే విజయనగరంలో ఓడించి కోలగట్లకు పట్టం కట్టడాన్ని మరచిపోకూడదన్నారు. నేతల్లేకపోయినా కార్యకర్తల అండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ తాము లేకపోతే బొబ్బిలిలో పార్టీయే లేద ని రాజులు భ్రమలు కలిగించారని, కానీ పార్టీ వెంట ఉన్నామని కార్యకర్తలు నిరూపించారన్నారు. జిల్లా కార్యదర్శి డోల బాబ్జీ మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసి పార్టీని వీడిన వారికి ఎన్నికల్లో బుద్ది చెప్పేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. తెర్లాం పార్టీ నాయకుడు మర్రాపు జగన్నాథం మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని బొబ్బిలిలో ముందుకు నడిపిస్తామన్నారు. రాజన్న సేవా సమితి వ్యవస్థాపకుడు తూముల రాంసుధీర్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమ లు చేయలేదన్నారు. కార్యక్రమంలో విజయనగరానికి చెందిన సుంకరి బాబు, లెంక సత్యం, వినోద్ కుమార్ దుబే, ట్రేడ్ యూనియన్ నాయకుడు నాగరాజు, స్థానిక నాయకులు చంద్రంపూడి రమేష్, బొమ్మి అప్పలనాయుడు, కోల బాలాజీ తిరుపతిరావు, బర్ల వెంకటరమణ యాదవ్, పట్నాన శంకరరావు, వై.సి.హెచ్.జి.రంగారావు, గర్బాపు దాలయ్య, చోడిగంజి రాజగోపాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో చేరిన బొబ్బిలి ఎమ్మెల్యే
సుజయకృష్ణకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు సాక్షి, విజయవాడ బ్యూరో: విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని ఓ హోటల్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు ఆయన మెడలో పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రంగారావు సోదరులు బేబీ నాయన, రామకృష్ణ రంగారావులకూ కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కష్టసమయంలో అందరూ సమష్టిగా కలసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ టీడీపీలోని నేతలందరితోనూ కలసి పనిచేస్తామని, వారికీ, తమకూ ఎటువంటి మనస్పర్థలు రావని హామీ ఇస్తున్నామని చెప్పారు. -
మంత్రి పదవి ఇస్తారట!
♦ జిల్లా టీడీపీలోనూ కీలక స్థానమిస్తామన్నారు ♦ పార్టీ మారదామంటున్న బొబ్బిలి ఎమ్మెల్యే సాక్షి ప్రత్యేక ప్రతినిధిః అవినీతి డబ్బుతో అధికార తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పుతున్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు వారిని ప్రలోభ పరిచే కార్యక్రమానికి కూడా స్వయం గా నాయకత్వం వహిస్తుండడం విశేషం. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.సుజయకృష్ణ రంగారావుపై అధికారపార్టీ వల విసిరింది. మంత్రి పదవితో పాటు జిల్లా టీడీపీలో కీలక పదవిని కూడా ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి, పార్టీలో కీలకపదవి ఇస్తామన్నారన్న విషయం స్వయంగా సుజయకృష్ణ రంగారావు కార్యకర్తల సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారడం అనివార్యమని ఆయన వ్యాఖ్యానించినట్లు వినిపిస్తోంది. కాగా, హామీలన్నీ తుంగలో తొక్కి విచ్చలవిడి అవినీతితో పరువు పూర్తిగా కోల్పోయిన టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేసి చంకలు గుద్దుకుంటున్నదని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ధైర్యముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేస్తున్నారు. కార్యకర్తలతో రంగారావు సమావేశం.. ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి కోటలో బుధవారం రాత్రి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. తమను నమ్ముకున్న ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం జరగాలంటే అధికార పార్టీ వైపు వెళ్లక తప్పడంలేదని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీతో తాను మాట్లాడానని, జిల్లా పగ్గాలతో పాటు అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారని నాయకులకు ఎమ్మెల్యే వివరించినట్లు తెలుస్తోంది. -
‘అనుమతులే లేవు.. 1.93 లక్షల ఇళ్లా?’
సాక్షి, హైదరాబాద్: ‘ఓవైపు ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులే ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వం 1.93 లక్షల ఇళ్లు ఇచ్చేశాం అని చెబుతోంది. దీనిపై స్పష్టతనివ్వాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు సైట్ స్పెసిఫికేషన్స్ (ఇంటికి సంబంధించిన నిబంధనలు) తీవ్ర ప్రతిబంధకాలుగా ఉన్నాయని, దీనికారణంగా 60 గజాలు, 80 గజాలు స్థలాలు ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు కాకుండా పోతున్నాయన్నారు. బ్యాంకుల్లో సెక్యూరిటీ అడుగుతున్నారు: అంజాద్‌బాషా లక్షా తొంభైమూడు వేల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్నారు...అవి ఎక్కడ ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మంత్రిని సూటిగా ప్రశ్నించారు. లోన్లకోసం బ్యాంకులకు వెళితే బ్యాంకర్లు సెక్యూరిటీ లేనిదే ఇవ్వలేమని కరాఖండీగా చెబుతున్నారని, లబ్ధిదారులు రూ.50 వేలు బ్యాంకు డిపాజిట్ చేయగలరా అని ప్రశ్నించారు. -
5న భోగాపురానికి వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగొచ్చేంత వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు కింద భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 5న భోగాపురం వస్తున్నారని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో జగన్ పర్యటిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో సుజయ్‌కృష్ణ రంగారావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు గురువారం పర్యటించారు. సుజయ్‌కృష్ణ రంగారావు, కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ... 5వ తేదీన జగన్ రాజాపులోవ జంక్షన్ నుంచి ప్రారంభమై కవులవాడ, ఎ.రాయివలస, గూడపువలస గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. గూడపువలసలో బహిరంగసభలో మాట్లాడుతారన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
కొత్తపెంట,ఎం.ఫణుకువలస(బొబ్బిలి రూరల్) : రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి శక్తి వంచనలేకుండా పని చేస్తున్నామని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణరంగారావు తెలిపారు. ఆదివారం మండలంలోని కొత్తపెంట, ఎం.పణుకువలస గ్రామాల్లో ఆయన పర్యటించారు. సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. కొత్తపెంట గ్రామం వద్ద వేగావతి నదికి ఇరువైపులా ఉన్న రహదారిని పరిశీలించారు. ప్రజలు, విద్యార్థులు ఈ రోడ్డుపై ప్రయాణించడానికి ఇబ్బంది పడుతున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం కొత్తపెంట పారాధి ఛానల్‌ను ఆయన పరిశీలించారు. స్వయంగా సమస్యలను తెలుసుకుని, అధికారులకు లేఖలు రాసి వాటి పరిష్కారానికి కృషిచేద్దామని భావిస్తున్నామన్నారు. 10 గ్రామాల ప్రజలు గొల్లాది-కొత్తపెంటల మధ్య రాకపోకలు సాగిస్తున్నారని, వర్షం పడితే రాకపోకలు బంద్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పారాది ఆనకట్ట, ఛానల్లో గ్రామపరిధిలో బాగుచేసినా పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతో పనులు పూర్తి కాలేదని తెలిపారు. తుపానులు వస్తే తప్ప తమకు నిధులు రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు. అనంతరం ఎం.పణుకువలస గ్రామంలో బడివానిచెరువును పరిశీలించారు. గ్రామానికి ఎగువన, గ్రోత్‌సెంటర్ వెనుక ఉన్న బడివానిచెరువునీరు క్వారీ ద్వారా పంటపొలాలకు అందించే అవకాశాన్ని పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు బేతనపల్లి శ్రీరాములు, సింగనాపల్లి ఈశ్వరరావు తదితరులు చెరువునీటిని ఎలా క్వారీ నుంచి తరలించవచ్చో వివరించారు. -
ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం
విజయనగరం (బొబ్బిలి) : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు అన్నారు. ఆయన బొబ్బిలిలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించలేదని ఆయన విమర్శించారు. కేంద్రమంత్రిగా అపారమైన అనుభవం ఉన్న వెంకయ్య నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడలంలో విఫలమయ్యారని తెలిపారు. అయితే ఆయన ప్రత్యేక హోదా రాకపోవడానికి గల కారణాలు తెలపడంలో సఫలమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయల కల్పనకు నిధులు కేటాయించని ప్రభుత్వం.... మంత్రుల విదేశీ పర్యటనలకు మాత్రం కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన అధికార పక్షంపై మండిపడ్డారు. అగ్రిగోల్డ్ భాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వారి తరపున పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. -
అధికార పార్టీకి దాసోహం
ప్రతిపక్షంపై వివక్ష వైఎస్సార్సీపీ మద్దతు దారులకు పనులివ్వడం లేదు కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు,నాయకులు విజయనగరం కంటోన్మెంట్: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ సమానంగా ఇవ్వాల్సిన పనులను అధికార పక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలకే మంజూరు చేస్తూ అధికారులు వారికి దాసోహమవుతున్నారని వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వై ఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జిలు కలెక్టర్ ఎంఎం నాయక్‌కు శనివారం కలిసి వివరించారు. ఈ సందర్భంగా అధికార పక్షం చేస్తున్న నిధుల పక్షపాత పందేరాలపై వివరణాత్మకంగా వినతిపత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లాకు వస్తున్న పనులను అధికార పక్షానికి చెందిన వర్గానికి, పార్టీ సానుభూతిపరులైన సర్పంచులు, నాయకులకు మాత్రమే అధికారులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. హుద్‌హుద్ తుపాను మరమ్మతులకు చిన్న నష్టాలకే పెద్ద పనులు కావాలంటూ నీటి పారుదల శాఖ ద్వారా ప్రతిపాదనలు చేయిం చిమంజూరు చేయించుకుంటున్నారన్నారు. పనులు చేయకుండానే చేసినట్టు ఎం బుక్‌లు రికార్డు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జిల్లాలోని అన్ని నీటిపారుదల శాఖ పనులను పనికి ముందు పని పూర్తయిన తరువాత వీడియో, ఫొటోలు తీసి దర్యాప్తు చేయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పనుల వివరాలు ప్రజల ముందుంచాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామపంచాయతీల్లో సీసీ రోడ్లు, మెటల్‌రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలైనవి తీర్మానాలు చేసి మంజూరు నిమిత్తం పంపించి, కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా వివిధ శాఖల వద్ద ఆగిపోతున్నాయని వివరించారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లకు పూర్తిగా మొండి చేయి చూపిస్తున్నారన్నారు. అసలు వైఎస్సార్సీపీ నాయకులున్న గ్రామాలకు నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదో చెప్పాలని వారు వినతిపత్రంలో డిమాండ్ చేశారు. అధికారులు నిజాయితీగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పార్వతీపురం నియోజక వర్గ ఇన్చార్జి జమ్మాన ప్రసన్నకుమార్, పార్టీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, ఎస్వీవీ రాజేష్, జిల్లా కార్యదర్శి మడక తిరుపతినాయుడు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సింగుబాబు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనమల్లు వెంకటరమణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్,లీగల్‌సెల్ అధ్యక్షుడు బెల్లాన రవికుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎస్ బంగారునాయుడు, సేవాదళ్ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డి, ప్రచార విభాగం ఎంఎస్ఎన్ నాయుడు, కృష్ణమోహన్, పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, పట్టణ, మండల అధ్యక్షుడు ఆశపు వేణు, జమ్ము శ్రీను, రెడ్డి గురుమూర్తి, మారోజు శ్రీనివాసరావు, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి,కుమార్, తెంటు చిరంజీవులు, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ గౌస్(షకీల్), ఎస్టీ సెల్ కన్వీనర్ జి. ప్రశాంత్‌కుమార్ తదితరులు ఉన్నారు. నాణ్యత లేకపోతే అడ్డుకుంటాం జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను రాజకీయంగా వినియోగించుకుంటున్నారు. దీని వల్ల అనుభవం లేని కార్యకర్తలు, నాయకులకు పెద్దమొత్తంలోని పనులను నిబంధనల కోసం విభజించి నామినేటెడ్ పేరున మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుభవం లేని కార్యకర్తలు చేసే పనులెలా ఉంటాయి. నాణ్యత లోపిస్తే మాత్రం ఊరుకునేది లేదని, కచ్చితంగా పరిశీలించి నాణ్యత లేకుంటే అడ్డుకుని తీరతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వి సుజయ్ కృష్ణరంగారావులు అన్నారు. శనివారం కలెక్టర్‌కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి హామీ, పంచాయతీ రాజ్, తాగునీటి విభాగాల్లో పనులకు మంజూరయిన అత్యధిక నిధులను 5లక్షలలోపు విభజించి కార్యకర్తలకు నామినేటెడ్ పద్ధతిన ఇస్తే అవి నాణ్యత ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఉపాధిలో మెటీరియల్ పనులను తెలుగు దేశం పార్టీ వారికే ఇస్తున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన వారికే పెన్షన్లు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారన్నారు. చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో 785 రూపాయల గ్యాస్కనెక్షన్ కోసం రూ.3వేలు వసూలు చేస్తున్నారని దీనిని అడ్డుకోకుండా అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారు. అదేవిధంగా బాడంగి మండలం డొంకినవలస ఐఓబీలో రుణమాఫీ రెండో విడతలో ఒక్కరికి కూడా మాఫీ వర్తించలేదన్నారు. రామభద్రపురంలో వెయ్యికి పైగా రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే కనీసం వంద మందికి కూడా మాఫీ వర్తించలేదన్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే పనుల విషయంలో రాజీ పడకుండా నిలదీస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీలకు రావాల్సిన రుణాల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని, వారి తరఫున పోరాడతామన్నారు. తెలుగుదేశం పార్టీ హామీలను నమ్మి ఓటేసిన ప్రజలకు నమ్మకద్రోహం చేశారన్నారు. సమావేశంలో సాలూరు,కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి తదితరులు ఉన్నారు. -
ఎందుకా ఇంట్రస్ట్!
జిల్లాలో ప్రభుత్వ పరంగా వైద్యకళాశాల ఏర్పాటు చేయకుండా మాన్సాస్‌కు ఇవ్వడంపై చర్చ ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పట్టుపట్టిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించిన ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మద్దతుగా నిలిచిన వైఎస్ జగన్, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుపై అసెంబ్లీలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ప్రస్తావన చర్చకు దారితీసింది. అధికార, విపక్షం మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంత జరిగినా జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు. ప్రభుత్వ వైద్య కళాశాల కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల డిమాండ్‌కు మద్దతివ్వలేదు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వేసిన ప్రశ్నకు ఆర్థిక పరిస్థితి కారణంగా విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడం లేదని, మాన్సాస్ ట్రస్టు దరఖాస్తు మేరకు ప్రైవేటు కళాశాల ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కామినేని సమాధానం చెప్పారు. దానిపై సుజయకృష్ణ రంగారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అత్యంత వెనకబడిన విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వైద్యకళాశాల ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందని, ప్ర స్తుతం విశాఖనగరంలోని కేజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని సభ దృష్టికి తీసుకెళ్లా రు. ఇప్పటికే జిల్లాలో ఒక ప్రైవేటు వైద్య కళాశాల ఉందని, రెండోది కూడా ప్రైవేటు కళాశాలైతే పేద విద్యార్థులు ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితి నెలకోనుందన్నారు. జిల్లాలో ఇప్పటికీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదని, దేశంలో ఎక్కడా ఇటువంటి పరిస్థితి ఉండదని, ఇప్పుడా పరిస్థితిని వైద్య కళాశాల విషయంలో కూడా వచ్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ట్రస్టు దరఖాస్తు చేసిందని ఇచ్చేస్తే ఎలా, ఏదైనా పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. దరఖాస్తు చేసుకోండని చెప్పి ఉంటే అందరూ దరఖాస్తు చేసుకుంటారని, ప్రమాణాల మేరకు వాటిలో ఏది మంచిదో తెలుసుకుని మంజూరు చేస్తే బాగుండేదన్న అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జోక్యం చేసుకుని టీడీపీకి చెందిన గజపతిరాజులకిచ్చి, అదేదో గొప్పగా చెప్పుకుంటున్నారని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గజపతిరాజులు, మాన్సాస్ ట్రస్టు గురించి పాలకపక్షం గొప్పగా చెబుతుండగా వైఎస్ జగన్ జోక్యం చేసుకుని బొబ్బిలి రాజా వారికీ మంచి పేరే ఉందని, వారి ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, వారికి కూడా ప్రైవేటు కళాశాల అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంలో అధికార, విపక్షాల మధ్య కొంతసేపు వాదోపవాదాలు సాగాయి. జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, పాముల పుష్ప శ్రీవాణి ప్రభుత్వ వైద్య కళాశాలే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుజయ కృష్ణ రంగారావుకు మద్దతుగా నిలిచారు. కానీ, జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలెవ్వరూ ఈ విషయమై నోరు మెదపలేదు. కనీసం జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల అవసరమన్న విషయాన్ని కూడా ప్రస్తావించలేదు. వారడగలేకపోయినా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చేసిన డిమాండ్‌కైనా మద్దతిచ్చే ఉంటే బాగుండేదని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని, జిల్లా ప్రజల వాణి విన్పించలేకపోయారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 రోజుల్లోగా జనన వివరాలు నమోదు చేయాలివిజయనగరం ఆరోగ్యం: శిశువు పుట్టిన 21 రోజుల్లోగా వివరాలు నమోదు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ డీడీ రాంబాబు అన్నారు. స్థానిక వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం తహశీల్దార్, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలకు జనన, మరణ నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మరణాల వివరాలను వారం రోజుల్లోగా నమోదు చేయాలన్నారు. ముద్రించిన ఫారాల్లోనే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయాలని సూచించారు. జన్మించిన వెంటనే ధ్రువీకరణ పత్రాలను అందించాలన్నారు. వివరాల నమోదులో లోపాలు లేకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ ఎస్.ఓ దేవవరప్రసాద్, ఏఎస్ఓ కైలాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆటోబోల్తా: ఆరుగురికి గాయాలు
బొబ్బిలి: మండలంలోని కారాడ గ్రామం దాటిన తరువాత పినపెంకి గ్రామం వద్ద వంతెనను ఢీకొని ఆటో బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మెరకమొడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామానికి చెందిన దుర్గసి గౌరమ్మకు ఎడమ కాలు, చేయి విరిగిపోగా, బోగాది రామారావుకు తలకు బలమైన గాయాలయ్యాయి. వీరితో పాటు ముంగి సింహాచలం, అప్పారావు, దుర్గసి రాము, దువ్వమ్మలకు గాయాలయ్యాయి. వీరంతా మండలంలో పిరిడి పంచాయతీ పరిధిలో ఉండే కొల్లివలస గ్రామానికి మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. తీవ్రంగా గాయపడిన గౌరమ్మకు అల్లుడు బోగాది రమేష్ ఇంటికి వచ్చి పిరిడి గ్రామంలో జరిగే అసిరితల్లి సిరిమానోత్సవాన్ని తిలకించారు. బుధవారం మధ్యాహ్న భోజనాలు ముగించుకుని ఉత్తరావిల్లి గ్రామానికి అదే గ్రామానికి చెందిన ఆటోలో 15 మంది వరకూ బయలుదేరారు. పినపెంకి గ్రామం వద్దకు వచ్చేసరికి వంతెనకు ఢీకొనడంతో బోల్తా పడి వీరందరికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులకు అండగా ఎమ్మెల్యే సుజయ్ బాడంగి: ఆటోప్రమాదంలో దెబ్బలుతగిలి ప్రాణాపాయస్థితిలో హాహాకారాలు చేస్తూ ఆప్తులకోసం కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులకు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అండగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పిరిడి గ్రామ పండగకు వెళ్లి స్వగ్రామమైన ఉత్తరావిల్లికి ఆటోలో వెళ్లిపోతుండగా పినపెంకి-కారాడ మధ్యలోగల వేగావతినదివంతెనపై ఆటోప్రమాదంజరిగింది. వంతెన గోడను ఆటో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్నవారు రోడ్డుపైతుళ్లిపడడంతో బలమైన గాయాలయ్యాయి. బాడంగి మండలం గూడెపువలసలో ఓ వివాహానికి వెళ్లి అప్పుడే అటువైపుగా బొబ్బిలి వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కె. రంగారావు ఆదృశ్యాన్ని చూసి చలించారు. వెంటనే కారుదిగి క్షతగాత్రులను రక్షించాలన్న మానవతతో అంబులెన్సు రాక ఆలస్యం కావడంతో తనసొంతపెట్టుబడితో ఆటోలను పురమాయించి వారిని బొబ్బిలి ఆస్పత్రిలో చేర్పించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే గన్‌మన్ గంగాచారి, బాడంగికి చెందిన వైఎస్ఆర్సిపి యువనాయకుడు గొర్లె శంకరరావులు క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి చేరేంతవరకు తమవంతు సేవలందించారు.అంతేగాక మెరుగైన వైద్యంకోసం తమసొంతడబ్బులతో క్షతగాత్రులను విశాఖకు తరలించే ప్రయత్నచేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రాణాపాయ స్థితినుంచి కాపాడే ప్రయత్నం చేసినందుకు ఆసంఘటనను చుసిన, విన్నప్రతిఒక్కరూ ఎమ్మెల్యే మానవతను అభినందిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హాట్ హాట్ ...
జెడ్పీ సమావేశంలో అధికారులపై మండిపడ్డ అధికార, ప్రతిప్రక్ష ప్రజాప్రతినిధులు అజెండాలో 51 అంశాలకు గాను ఆరు అంశాలను చర్చించిన వైనం గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం వైఎస్సార్ సీపీ నేతల ప్లకార్డుల ప్రదర్శన జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తదితరులు విజయనగరం ఫోర్ట్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. పాలన సరిగాలేదంటూ అధికారులపై అధి కార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. సమావేశాలకు వచ్చినప్పుడు అధికారులు తలాడించడమే తప్ప ఆ తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సమాచారం లేనప్పుడు సమావేశానికి ఎందుకు వస్తారని మండి పడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు, జెడ్పీటీసీలు కూడా అధికారుల తీరును ఎండగట్టారు. ఏ అధికారినీ విడిచిపెట్టలేదు. సమావేశం ప్రారంభంలోనే సొసైటీల్లో బినామీ రుణాలు, డీసీసీబీలో కుంభకోణం అంశాలపై గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ప్రస్తావించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌పై సమీక్ష జరిగినప్పుడు అధికారుల్ని ఉక్కిర్కిబిక్కిరి చేస్తూ అటు వైఎస్సార్ సీపీ, ఇటు టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యాశాఖపై చర్చకొచ్చిన సందర్భంలో డీఈఓపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐసీడీఎస్‌పై చర్చ జరిగిన సందర్భంలో పీడీ రాబర్ట్స్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వీఎంపై చర్చ జరిగినప్పుడు నిధులు దుర్వినియోగమయ్యాయని, వాటాలేసుకుని పంచేసుకున్నారని సంబంధిత అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు దుమ్మెత్తిపోశారు. డీఆర్డీఏ పింఛన్లు, ఇసుకపై జరిగిన చర్చలో పీడీ పెద్దిరాజుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో సివిల్ సప్లైస్ అధికారుల్ని, డిప్యూటేషన్లపై జిల్లా పరిషత్ సీఈఓను నిలదీశారు. తుపాను పరిహారం విషయంలో వ్యవసాయ శాఖ జేడీపై పలువురు నేతలు మండిపడ్డారు. మొత్తానికి అధికారులపై మూకుమ్మడి దాడి చేశారు. దీంతో అధికారులంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. సభలో ప్రస్తావించిన అంశాలపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు ప్రతీ సమాచారం వెళ్లాలని, అధికారులను జెడ్పీ చైర్పర్సన్ శోభ స్వాతి రాణి ఆదేశించారు. వివరాలతో రాకపోతే ఉండిపోండని,ఈ విషయంలో సహించేది లేదని ఆమె అధికారులపై మండిపడ్డారు. -
'జగన్ మా నేత అని గర్వపడుతున్నాం'
-
'జగన్ మా నేత అని గర్వపడుతున్నాం'
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రుణమాఫీపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీయిచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని విమర్శించారు. రేషన్ కార్డుకు ఒక్క రుణమాఫీ మాత్రమే చేస్తామనడం సరికాదన్నారు. రుణమాఫీపై మాట్లాడే అర్హత తమ పార్టీకి లేదని ప్రభుత్వం అనడం చాలా దురదృష్టకరమన్నారు. ఎన్నికల సమయంలో రుణమాఫీపై టీడీపీ హామీయిచ్చినప్పడు మనం కూడా ప్రకటన చేద్దామని తమ నాయకుడు జగన్ ను అడిగామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీ సాధ్యపడదని జగన్ భావించారని చెప్పారు. రుణమాఫీపై హామీయిస్తే ఎన్నికల్లో లబ్ది పొందేవాళ్లమని, కానీ అలా చేయలేదన్నారు. సాధ్యపడదని హామీ ఇవ్వనందుకు జగన్ తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. -
సింగపూర్ అంటే.. మళ్లీ వ్యవసాయం గల్లంతే
సీమాంధ్రను సింగపూర్ చేయడం అంటే.. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినట్లే అవుతుందని, సింగపూర్‌లో వ్యవసాయం గానీ, పరిశ్రమలు గానీ లేవన్న సంగతి చంద్రబాబుకు తెలియదా అని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సుజయ్ కృష్ణ రంగారావు మండిపడ్డారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా విమర్శలు చేశారు. చంద్రబాబు వస్తే మళ్లీ సీమాంధ్రలో ఆయన పాలన నాటి పరిస్థితే వస్తుందని చెప్పారు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే సర్వేలపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం సర్వేలు వద్దని సిఫార్సు చేస్తే అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండో ముద్దాయి చంద్రబాబు అని అన్నారు. సమన్యాయం అంటున్న చంద్రబాబు అదేంటో చెప్పలేదని సుజయకృష్ణ రంగారావు గుర్తుచేశారు.