మంత్రి పదవి ఇస్తారట!
♦ జిల్లా టీడీపీలోనూ కీలక స్థానమిస్తామన్నారు
♦ పార్టీ మారదామంటున్న బొబ్బిలి ఎమ్మెల్యే
సాక్షి ప్రత్యేక ప్రతినిధిః అవినీతి డబ్బుతో అధికార తెలుగుదేశం పార్టీ సాగిస్తున్న ప్రలోభాల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పుతున్న తెలుగుదేశం పార్టీ అధినాయకుడు వారిని ప్రలోభ పరిచే కార్యక్రమానికి కూడా స్వయం గా నాయకత్వం వహిస్తుండడం విశేషం. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.సుజయకృష్ణ రంగారావుపై అధికారపార్టీ వల విసిరింది. మంత్రి పదవితో పాటు జిల్లా టీడీపీలో కీలక పదవిని కూడా ఇవ్వజూపినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి, పార్టీలో కీలకపదవి ఇస్తామన్నారన్న విషయం స్వయంగా సుజయకృష్ణ రంగారావు కార్యకర్తల సమావేశంలో వెల్లడించినట్లు తెలిసింది.
నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారడం అనివార్యమని ఆయన వ్యాఖ్యానించినట్లు వినిపిస్తోంది. కాగా, హామీలన్నీ తుంగలో తొక్కి విచ్చలవిడి అవినీతితో పరువు పూర్తిగా కోల్పోయిన టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు ఎరవేసి చంకలు గుద్దుకుంటున్నదని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ధైర్యముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేస్తున్నారు.
కార్యకర్తలతో రంగారావు సమావేశం..
ఆర్.వి.సుజయకృష్ణ రంగారావు బొబ్బిలి కోటలో బుధవారం రాత్రి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. తమను నమ్ముకున్న ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, వారికి న్యాయం జరగాలంటే అధికార పార్టీ వైపు వెళ్లక తప్పడంలేదని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే అధికార పార్టీతో తాను మాట్లాడానని, జిల్లా పగ్గాలతో పాటు అభివృద్ధికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని భరోసా ఇచ్చారని నాయకులకు ఎమ్మెల్యే వివరించినట్లు తెలుస్తోంది.