‘అనుమతులే లేవు.. 1.93 లక్షల ఇళ్లా?’
సాక్షి, హైదరాబాద్: ‘ఓవైపు ఇళ్ల మంజూరుకు పరిపాలనా అనుమతులే ఇవ్వలేదు. మరోవైపు ప్రభుత్వం 1.93 లక్షల ఇళ్లు ఇచ్చేశాం అని చెబుతోంది. దీనిపై స్పష్టతనివ్వాలి’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు సైట్ స్పెసిఫికేషన్స్ (ఇంటికి సంబంధించిన నిబంధనలు) తీవ్ర ప్రతిబంధకాలుగా ఉన్నాయని, దీనికారణంగా 60 గజాలు, 80 గజాలు స్థలాలు ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు కాకుండా పోతున్నాయన్నారు.
బ్యాంకుల్లో సెక్యూరిటీ అడుగుతున్నారు: అంజాద్‌బాషా
లక్షా తొంభైమూడు వేల ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్నారు...అవి ఎక్కడ ఇచ్చారో చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మంత్రిని సూటిగా ప్రశ్నించారు. లోన్లకోసం బ్యాంకులకు వెళితే బ్యాంకర్లు సెక్యూరిటీ లేనిదే ఇవ్వలేమని కరాఖండీగా చెబుతున్నారని, లబ్ధిదారులు రూ.50 వేలు బ్యాంకు డిపాజిట్ చేయగలరా అని ప్రశ్నించారు.