బొబ్బిలి: మండలంలోని కారాడ గ్రామం దాటిన తరువాత పినపెంకి గ్రామం వద్ద వంతెనను ఢీకొని ఆటో బోల్తా పడిన సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మెరకమొడిదాం మండలం ఉత్తరావల్లి గ్రామానికి చెందిన దుర్గసి గౌరమ్మకు ఎడమ కాలు, చేయి విరిగిపోగా, బోగాది రామారావుకు తలకు బలమైన గాయాలయ్యాయి. వీరితో పాటు ముంగి సింహాచలం, అప్పారావు, దుర్గసి రాము, దువ్వమ్మలకు గాయాలయ్యాయి.
వీరంతా మండలంలో పిరిడి పంచాయతీ పరిధిలో ఉండే కొల్లివలస గ్రామానికి మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. తీవ్రంగా గాయపడిన గౌరమ్మకు అల్లుడు బోగాది రమేష్ ఇంటికి వచ్చి పిరిడి గ్రామంలో జరిగే అసిరితల్లి సిరిమానోత్సవాన్ని తిలకించారు. బుధవారం మధ్యాహ్న భోజనాలు ముగించుకుని ఉత్తరావిల్లి గ్రామానికి అదే గ్రామానికి చెందిన ఆటోలో 15 మంది వరకూ బయలుదేరారు. పినపెంకి గ్రామం వద్దకు వచ్చేసరికి వంతెనకు ఢీకొనడంతో బోల్తా పడి వీరందరికీ గాయాలయ్యాయి.
క్షతగాత్రులకు అండగా ఎమ్మెల్యే సుజయ్
బాడంగి: ఆటోప్రమాదంలో దెబ్బలుతగిలి ప్రాణాపాయస్థితిలో హాహాకారాలు చేస్తూ ఆప్తులకోసం కొట్టుమిట్టాడుతున్న క్షతగాత్రులకు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అండగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పిరిడి గ్రామ పండగకు వెళ్లి స్వగ్రామమైన ఉత్తరావిల్లికి ఆటోలో వెళ్లిపోతుండగా పినపెంకి-కారాడ మధ్యలోగల వేగావతినదివంతెనపై ఆటోప్రమాదంజరిగింది. వంతెన గోడను ఆటో ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్నవారు రోడ్డుపైతుళ్లిపడడంతో బలమైన గాయాలయ్యాయి. బాడంగి మండలం గూడెపువలసలో ఓ వివాహానికి వెళ్లి అప్పుడే అటువైపుగా బొబ్బిలి వెళ్తున్న ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కె. రంగారావు ఆదృశ్యాన్ని చూసి చలించారు.
వెంటనే కారుదిగి క్షతగాత్రులను రక్షించాలన్న మానవతతో అంబులెన్సు రాక ఆలస్యం కావడంతో తనసొంతపెట్టుబడితో ఆటోలను పురమాయించి వారిని బొబ్బిలి ఆస్పత్రిలో చేర్పించేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే గన్‌మన్ గంగాచారి, బాడంగికి చెందిన వైఎస్‌ఆర్‌సిపి యువనాయకుడు గొర్లె శంకరరావులు క్షతగాత్రులను ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి చేరేంతవరకు తమవంతు సేవలందించారు.అంతేగాక మెరుగైన వైద్యంకోసం తమసొంతడబ్బులతో క్షతగాత్రులను విశాఖకు తరలించే ప్రయత్నచేశారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి క్షతగాత్రులను ప్రాణాపాయ స్థితినుంచి కాపాడే ప్రయత్నం చేసినందుకు ఆసంఘటనను చుసిన, విన్నప్రతిఒక్కరూ ఎమ్మెల్యే మానవతను అభినందిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్సై శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.