నల్గొండ: అదుపుతప్పి ఆటో బోల్తా పడి ఇద్దరు మృతిచెందిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అజ్మాపురం గ్రామ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అజ్మాపురం గ్రామానికి చెందిన మంగిళిపల్లి మంగమ్మ భర్త చాలా ఏళ్ల క్రితమే మృతిచెందాడు. ఆమె ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
సోమవారం అమావాస్య కావడంతో ఆమె నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి రాత్రి అక్కడే నిద్ర చేసి మంగళవారం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో కొండమల్లేపల్లికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి ఆటోలో అజ్మాపురం గ్రామానికి వెళ్తోంది. కాగా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని కొట్టాలగడ్డకు చెందిన జటావత్ గాస్య పక్కనే వద్దిపట్ల గ్రామంలో కిరాణం షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కిరాణా సామగ్రి కోసం మంగళవారం కొండమల్లేపల్లికి వచ్చిన గాస్య అదే ఆటోలో వద్దిపట్లకు బయల్దేరాడు.
ఈ క్రమంలో ఆటో అజ్మాపురం గ్రామ సమీపంలోకి చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మంగమ్మ, గాస్యలపై ఆటో పడటంతో వారికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా ఆటో డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment