సాగర్ ఎడమ కాల్వలో భార్యను తోసేసి ప్రమాదంగా చిత్రీకరించిన భర్త
నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు
మిర్యాలగూడ అర్బన్: నాగార్జునసాగర్ ఎడమ కాల్వలో గల్లంతై మృతిచెందిన అంగన్‌వాడీ టీచర్‌ను ఆమె భర్తే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భార్యపై అనుమానంతోనే ఆమెను తన భర్త కాల్వలో తోసేసి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖరరాజు బుధవారం విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన పేరబోయిన సైదులు పదిహేనేళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణానికి చెందిన అనూష(35)ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అనూష వేములపల్లి మండలం రావువారిగూడెంలో అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది.
ఆమెకు కామేపల్లి గ్రామంలో ఇన్‌చార్జి అంగన్‌వాడీ టీచర్‌గా బాధ్యతలు అప్పగించడంతో అక్కడ కూడా పనిచేస్తుంది. సైదులు కామన్ సర్వీస్ సెంటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గత కొన్నేళ్లుగా అనూషపై అనుమానం పెంచుకున్న సైదులు ఆమెను వేధిస్తుండేవాడు. దీంతో అనూష కుటుంబ సభ్యులు పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీ నిర్వహించి సైదులుకు నచ్చజెప్పినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆమైపె మరింత అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 5వ తేదీన తనను కామేపల్లి గ్రామంలో దించి రావాలని అనూష సైదులును అడగగా.. ఆమెను సైదులు అక్కడ దించి తిరిగి ఇంటికి వచ్చాడు. అక్కడ స్కూల్ ముగిసిన తర్వాత తిరిగి తనను తీసుకెళ్లాలని సైదులుకు అనూష ఫోన్ చేసింది.
ఎలాగైనా అనూషను హతమార్చాలని పథకం పన్నిన సైదులు తనకు లేటవుతుందని అక్కడే కొద్ది సమయం వేచి చూడమని భార్యకు చెప్పాడు. చీకటి పడిన తర్వాత కామేపల్లికి చేరుకున్న సైదులు అనూషను బైక్‌పై ఎక్కించుకుని రావులపెంట గ్రామ శివారులో గల నాగార్జునసాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లాడు. బైక్ ఆపి అనూషను తీవ్రంగా కొట్టి కాల్వలోకి తోసేశాడు. ఆ తర్వాత బైక్‌ను కాలువలోకి తోసి తాను కూడా కాలువలో దూకి ఈదుకుంటూ బయటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు బైక్‌తో పాటు కాల్వలో పడిపోయామని, తన భార్య గల్లంతైందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
మృతురాలి తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా తానే కాల్వలోకి తోసేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. కాల్వలో గల్లంతైన అనూష మృతదేహం మంగళవారం గరిడేపల్లి మండలం పొనుగోడు రిజర్వాయర్ పక్కనే చిన్న చెరువులో కనిపించడంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సైదులును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment