భట్నవిల్లిలో ఆటోను ఢీకొన్న లారీ
మృత్యువులోనూ వీడని స్నేహం
నలుగురి దుర్మరణం, మరో నలుగురికి తీవ్ర గాయాలు
అనుబంధం తెగిపోయి.. ఆనందం ఆవిరి.. ఆ ఘోర ప్రమాదం.. ఆశలను చిదిమేసింది.. అనుబంధాలను చెరిపేసింది.. జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆ కుటుంబాలకు ఆసరా లేకుండా మార్చింది.. చేయి పట్టుకుని నడిచే పిల్లలకు తండ్రి లేకుండా చేసింది.. కట్టుకున్నవాడిని భార్యకు దూరం చేసింది.. తోడుగా ఉంటాడనుకున్న కుటుంబానికి కుమారుడిని లేకుండా చేసింది. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు మిగిలిన వేదన ఇది.
అమలాపురం రూరల్/ మామిడికుదురు: వారంతా స్నేహితులు... హ్యాపీ హ్యాపీగా సహచరుడి ముందస్తు పుట్టినరోజు వేడుకకు బయలు దేరారు.. జోకులు వేసుకుంటూ సరదాగా గడిపారు.. కేక్ కట్ చేసుకుని సందడి చేశారు.. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో దారి కాచిన మృత్యువు లారీ రూపంలో వారి ఆనందాన్ని ఆవిరి చేసింది.. అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లిలోని వనువులమ్మ ఆలయం వద్ద 216 జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం..
మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) పుట్టినరోజు సోమవారం కావడంతో ముందస్తు వేడుకలు జరుపుకొనేందుకు స్నేహితులు నిర్ణయించుకున్నారు. మొత్తం ఎనిమిది మంది పుదుచ్చేరి ప్రాంతం యానాంకు నెల్లి నవీన్‌కుమార్ ఆటోలో ఆదివారం రాత్రి 8 గంటలకు బయలు దేరారు.
యానాంలో విందు ముగిశాక అర్ధరాత్రి సమయంలో తిరుగు పయనమయ్యారు. భట్నవిల్లి వచ్చేసరికి కాకినాడ వైపు ఒడిశాకు చేపల లోడుతో వెళుతున్న లారీ వారి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో మామిడికుదురు మండలం నగరం శివారు కోటమెరక గ్రామానికి చెందిన సాపే నవీన్ (22), అదే గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26), అదే మండలం పాశర్లపూడికి చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27), పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) అక్కడికక్కడే చనిపోయారు.
మామిడికుదురు మండలం పాశర్లపూడి శివారు కొండాలమ్మ చింతకు చెందిన మల్లవరపు వినయ్‌బాబు (17), అదే గ్రామానికి చెందిన మార్లపూడి లోకేష్ (17), పెదపటా్ననికి చెందిన జాలెం శ్రీనివాసరెడ్డి (17), నగరం శివారు పితానివారి మెరక గ్రామానికి చెందిన మాదాసి ప్రశాంత్‌కుమార్ (17)లు తీవ్రంగా గాయపడి అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో జాలెం శ్రీనివాసరెడ్డి, మాదిసి ప్రశాంత్‌కుమార్‌ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.
తరుక్కుపోయిన గుండెలు
చేతికందివచ్చిన తమ పిల్లలు మృత్యవాత పడి విగత జీవులుగా పడి ఉండడం చూసి మృతుల తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. తన కుటుంబానికి దిక్కెవరంటూ జతిన్ భార్య ఆశాదేవి బంధువులను దీనంగా అడుగుతుంటే చూపురుల గుండెలు తరుక్కుపోయాయి. కువైట్‌లో ఉంటున్న తల్లులకు పిల్లల మృత్యు వార్త ఎలా చెప్పాలంటూ నవీన్, అజయ్ కుటుంబీకులు ఆందోళన చెందారు. ప్రమాద వార్త తెలియగానే మృతుల, క్షతగాత్రుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఈ కుటుంబాలన్నీ రొక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఆటో నడుపుకొంటూ, ఎల్రక్టీíÙయన్‌గా పనిచేస్తూ నవీన్‌కుమార్, జతిన్ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. మిగిలిన వారంతా డిగ్రీ, ఇంటరీ్మడియెట్ చదువుకుంటూ భవిష్యత్ కోసం బాటలు వేసుకుంటున్నారు. అమలాపురం రూరల్ సీఐ పి.వీరబాబు, రూరల్ ఎస్సై శేఖర్‌బాబు ప్రమాద స్థలిని తక్షణమే సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను తక్షణమే ఆస్పత్రికి తరలించి వేగంగా వైద్యం అందేలా సీఐ, ఎస్సైలు శ్రమించారు.
పుట్టిన రోజునే పరలోకానికి..
నగరం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల జతిన్ (26) ఎలక్ట్రీయన్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సోమవారం అతని పుట్టిన రోజు. పుట్టిన రోజు వేడుకకు అంతా సిద్ధం చేసుకున్నాడు. కొత్త దుస్తులు కొనుక్కున్నాడు. సరదాగా స్నేహితులకు పార్టీ ఇచ్చేందుకు ఆదివారం రాత్రి అంతా కలసి బయటకు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం ముంచుకొచ్చి తనువు చాలించాడు. జతిన్‌కు ఆరేళ్ల కిందట వివాహమైంది. అతనికి భార్య ఆశాదేవి, ఐదేళ్ల కుమార్తె ఆత్య, ఏడు నెలల కొడుకు ఉన్నారు. జతిన్ మృతితో భార్య ఆశాదేవి, తండ్రి వెంకటేష్, తల్లి దివ్య కన్నీరు మున్నీరవుతున్నారు. అభం, శుభం తెలియని పిల్లలకు నాన్న ఎక్కడంటే ఏం చెప్పాలంటూ వారు విలపిస్తున్నారు.
ఒక్కగానొక్క కుమారుడి మృతితో..
నగరం కోటమెరకకు చెందిన సాపే నవీన్ (22) డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నా డు. తండ్రి శ్రీనివాసు రోజు కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి రత్న కుమారి కువైట్‌లో ఉంది. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో అతని కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. నవీన్ అమ్మమ్మ బత్తుల మేరీరత్నం తన మనవడి వద్దే ఉంటూ అతడిని అల్లారు ముద్దుగా చూసుకుంటోంది. చదువుకుని ఎంతో ప్రయోజకుడవుతాడని ఆశించిన నవీన్ దుర్మరణం చెందడాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు.
కిరాయికి వెళ్లి.. మృత్యుఒడికి చేరి
పాశర్లపూడి నెల్లివారిపేటకు చెందిన నెల్లి నవీన్‌కుమార్ (27) అవివాహితుడు. ఐదు నెలల కిందట కొత్త ఆటో కొనుక్కున్నాడు. తండ్రి ట్రక్కు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నవీన్‌కుమార్ తల్లి మంగాదేవి పదేళ్ల నుంచి మస్కట్‌లో ఉంటున్నారు. తండ్రి, కొడుకు ఆటో నడుపుతూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. స్నేహితుడి పుట్టినరోజు, ఆటో కిరాయికి వెళ్లిన నవీన్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మ్యత్యువాత పడడం స్థానికులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
సరదాగా వెళ్లి..
పి.గన్నవరం మండలం మానేపల్లికి చెందిన వల్లూరి అజయ్ (18) ఇంటర్ పూర్తి చేశాడు. తండ్రి శ్రీనివాసరావు నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. అతను గల్ఫ్‌లో ఉంటున్నాడు. తల్లి కుమారి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చారు. కొడుకును ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అందివచ్చిన కొడుకు స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లి ఇలా విగతజీవిగా మారతాడని కలలో కూడా ఊహించలేదని ఆమె విలపిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment