హాట్ హాట్ ...
జెడ్పీ సమావేశంలో అధికారులపై మండిపడ్డ అధికార, ప్రతిప్రక్ష ప్రజాప్రతినిధులు
అజెండాలో 51 అంశాలకు గాను ఆరు అంశాలను చర్చించిన వైనం
గిరిజన యూనివర్సిటీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల కోసం
వైఎస్సార్ సీపీ నేతల ప్లకార్డుల ప్రదర్శన
జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తదితరులు
విజయనగరం ఫోర్ట్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. పాలన సరిగాలేదంటూ అధికారులపై అధి కార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. సమావేశాలకు వచ్చినప్పుడు అధికారులు తలాడించడమే తప్ప ఆ తర్వాత అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సమాచారం లేనప్పుడు సమావేశానికి ఎందుకు వస్తారని మండి పడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు, జెడ్పీటీసీలు కూడా అధికారుల తీరును ఎండగట్టారు. ఏ అధికారినీ విడిచిపెట్టలేదు. సమావేశం ప్రారంభంలోనే సొసైటీల్లో బినామీ రుణాలు, డీసీసీబీలో కుంభకోణం అంశాలపై గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ప్రస్తావించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌పై సమీక్ష జరిగినప్పుడు అధికారుల్ని ఉక్కిర్కిబిక్కిరి చేస్తూ అటు వైఎస్సార్ సీపీ, ఇటు టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యాశాఖపై చర్చకొచ్చిన సందర్భంలో డీఈఓపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐసీడీఎస్‌పై చర్చ జరిగిన సందర్భంలో పీడీ రాబర్ట్స్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌వీఎంపై చర్చ జరిగినప్పుడు నిధులు దుర్వినియోగమయ్యాయని, వాటాలేసుకుని పంచేసుకున్నారని సంబంధిత అధికారులపై పలువురు ప్రజాప్రతినిధులు దుమ్మెత్తిపోశారు.
డీఆర్‌డీఏ పింఛన్లు, ఇసుకపై జరిగిన చర్చలో పీడీ పెద్దిరాజుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో సివిల్ సప్లైస్ అధికారుల్ని, డిప్యూటేషన్లపై జిల్లా పరిషత్ సీఈఓను నిలదీశారు. తుపాను పరిహారం విషయంలో వ్యవసాయ శాఖ జేడీపై పలువురు నేతలు మండిపడ్డారు. మొత్తానికి అధికారులపై మూకుమ్మడి దాడి చేశారు. దీంతో అధికారులంతా ఉక్కిరిబిక్కిరయ్యారు. సభలో ప్రస్తావించిన అంశాలపై 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని, ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు ప్రతీ సమాచారం వెళ్లాలని, అధికారులను జెడ్పీ చైర్‌పర్సన్ శోభ స్వాతి రాణి ఆదేశించారు. వివరాలతో రాకపోతే ఉండిపోండని,ఈ విషయంలో సహించేది లేదని ఆమె అధికారులపై మండిపడ్డారు.