టీడీపీలో చేరిన బొబ్బిలి ఎమ్మెల్యే
సుజయకృష్ణకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: విజయనగరం జిల్లాకు చెందిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడలోని ఓ హోటల్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబునాయుడు ఆయన మెడలో పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. రంగారావు సోదరులు బేబీ నాయన, రామకృష్ణ రంగారావులకూ కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకున్నారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కష్టసమయంలో అందరూ సమష్టిగా కలసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. సుజయకృష్ణ రంగారావు మాట్లాడుతూ టీడీపీలోని నేతలందరితోనూ కలసి పనిచేస్తామని, వారికీ, తమకూ ఎటువంటి మనస్పర్థలు రావని హామీ ఇస్తున్నామని చెప్పారు.