అధికార పార్టీకి దాసోహం | TDP decisions politically motivated | Sakshi
Sakshi News home page

అధికార పార్టీకి దాసోహం

Published Sun, Apr 5 2015 4:57 AM | Last Updated on Tue, Oct 30 2018 5:23 PM

TDP decisions politically motivated

ప్రతిపక్షంపై వివక్ష     
 వైఎస్సార్‌సీపీ మద్దతు దారులకు పనులివ్వడం లేదు
 కలెక్టర్‌కు వినతిపత్రమిచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు,నాయకులు
 
 విజయనగరం కంటోన్మెంట్: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ సమానంగా ఇవ్వాల్సిన పనులను అధికార పక్షానికి చెందిన నాయకులు, కార్యకర్తలకే మంజూరు చేస్తూ   అధికారులు వారికి దాసోహమవుతున్నారని వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు వై ఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీ సుజయ్ కృష్ణ రంగారావు, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కలెక్టర్ ఎంఎం నాయక్‌కు శనివారం కలిసి వివరించారు. ఈ సందర్భంగా అధికార పక్షం చేస్తున్న  నిధుల పక్షపాత పందేరాలపై వివరణాత్మకంగా వినతిపత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లాకు వస్తున్న పనులను అధికార పక్షానికి చెందిన వర్గానికి, పార్టీ సానుభూతిపరులైన సర్పంచులు, నాయకులకు మాత్రమే అధికారులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు.  
 
  హుద్‌హుద్ తుపాను మరమ్మతులకు చిన్న నష్టాలకే పెద్ద పనులు కావాలంటూ నీటి పారుదల శాఖ ద్వారా ప్రతిపాదనలు చేయిం చిమంజూరు చేయించుకుంటున్నారన్నారు. పనులు చేయకుండానే చేసినట్టు ఎం బుక్‌లు రికార్డు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. జిల్లాలోని అన్ని నీటిపారుదల శాఖ పనులను పనికి ముందు పని పూర్తయిన తరువాత వీడియో, ఫొటోలు తీసి దర్యాప్తు చేయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పనుల వివరాలు ప్రజల ముందుంచాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామపంచాయతీల్లో సీసీ రోడ్లు, మెటల్‌రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణాలు మొదలైనవి తీర్మానాలు చేసి మంజూరు నిమిత్తం పంపించి, కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా వివిధ శాఖల వద్ద ఆగిపోతున్నాయని వివరించారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లకు పూర్తిగా మొండి చేయి చూపిస్తున్నారన్నారు.
 
  అసలు వైఎస్సార్‌సీపీ నాయకులున్న గ్రామాలకు  నిధులు ఎందుకు మంజూరు చేయడం లేదో చెప్పాలని వారు వినతిపత్రంలో డిమాండ్ చేశారు. అధికారులు నిజాయితీగా నిష్పక్షపాతంగా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో పార్వతీపురం నియోజక వర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్, పార్టీ విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్,  పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు, ఎస్‌వీవీ రాజేష్, జిల్లా కార్యదర్శి మడక తిరుపతినాయుడు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు సింగుబాబు,  డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనమల్లు వెంకటరమణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్,లీగల్‌సెల్ అధ్యక్షుడు బెల్లాన రవికుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఎస్ బంగారునాయుడు, సేవాదళ్ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డి, ప్రచార విభాగం ఎంఎస్‌ఎన్ నాయుడు, కృష్ణమోహన్, పంచాయతీ చాంబర్ అధ్యక్షుడు మామిడి అప్పలనాయుడు, పట్టణ, మండల అధ్యక్షుడు ఆశపు వేణు, జమ్ము శ్రీను, రెడ్డి గురుమూర్తి, మారోజు శ్రీనివాసరావు, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి,కుమార్, తెంటు చిరంజీవులు, మైనార్టీ అధ్యక్షుడు సయ్యద్ గౌస్(షకీల్), ఎస్టీ సెల్ కన్వీనర్ జి. ప్రశాంత్‌కుమార్ తదితరులు ఉన్నారు.
 
 నాణ్యత లేకపోతే అడ్డుకుంటాం జిల్లాకు మంజూరైన అభివృద్ధి పనులను  రాజకీయంగా వినియోగించుకుంటున్నారు. దీని వల్ల అనుభవం లేని కార్యకర్తలు, నాయకులకు పెద్దమొత్తంలోని పనులను నిబంధనల కోసం విభజించి నామినేటెడ్ పేరున మంజూరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుభవం లేని కార్యకర్తలు చేసే పనులెలా ఉంటాయి. నాణ్యత లోపిస్తే మాత్రం ఊరుకునేది లేదని, కచ్చితంగా పరిశీలించి నాణ్యత లేకుంటే అడ్డుకుని తీరతామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి, బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వి సుజయ్ కృష్ణరంగారావులు అన్నారు. శనివారం కలెక్టర్‌కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఉపాధి హామీ, పంచాయతీ రాజ్, తాగునీటి విభాగాల్లో పనులకు మంజూరయిన అత్యధిక నిధులను 5లక్షలలోపు విభజించి కార్యకర్తలకు నామినేటెడ్ పద్ధతిన ఇస్తే అవి నాణ్యత ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
 
 ఉపాధిలో మెటీరియల్ పనులను తెలుగు దేశం పార్టీ వారికే ఇస్తున్నారన్నారు. అధికార పార్టీకి చెందిన వారికే పెన్షన్లు, గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారన్నారు. చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో 785 రూపాయల గ్యాస్‌కనెక్షన్ కోసం రూ.3వేలు వసూలు చేస్తున్నారని దీనిని అడ్డుకోకుండా అధికార పార్టీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారు. అదేవిధంగా బాడంగి మండలం డొంకినవలస ఐఓబీలో రుణమాఫీ రెండో విడతలో ఒక్కరికి కూడా మాఫీ వర్తించలేదన్నారు. రామభద్రపురంలో వెయ్యికి పైగా  రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే కనీసం వంద మందికి కూడా మాఫీ వర్తించలేదన్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోతే పనుల విషయంలో రాజీ పడకుండా నిలదీస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీలకు రావాల్సిన రుణాల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోందని, వారి తరఫున పోరాడతామన్నారు. తెలుగుదేశం పార్టీ హామీలను నమ్మి ఓటేసిన ప్రజలకు నమ్మకద్రోహం చేశారన్నారు. సమావేశంలో సాలూరు,కురుపాం ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement