ఏకాకిగా మారిన బొబ్బిలి ఎమ్మెల్యే
ఆయనకు మంత్రి పదవి ఇవ్వొద్దంటూ సీఎంకు వినతి
ముగ్గురు ఎమ్మెల్యేలు... ఇద్దరు ఎమ్మెల్సీలు కలసి వేడుకోలు
తమలో ఎవరికిచ్చినా ఫర్వాలేదని స్పష్టీకరణ
జిల్లాలో అందరి మాటా... అదేనంటూ సంకేతాలు
కుల సమీకరణలనూ వివరించిన వైనం
జిల్లా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు ఏకాకిగా మిగిలారు. మిగిలినవారంతా ఆయనకు వ్యతిరేక కూటమిగా మారారు. మంత్రి వర్గ విస్తరణలో జిల్లాకు అవకాశం వస్తే... ఆయనకు ఇవ్వడానికి వీల్లేదనీ... బీసీలకే ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రెండు రోజుల క్రితం సీఎంను నేరుగా కలసి తమ మనోభావాన్ని తెలియజేశారు. ఇందులో కుల సమీకరణలూ ప్రస్తావించారు. కాదని ఆయనకే పదవి కట్టబెడితే... బీసీలంతా మనకు దూరమవుతారని పరోక్ష సంకేతాలిచ్చారు. అయితే వీరి వెనుక అశోక్‌గజపతిరాజు ప్రోత్సాహం ఉందేమోనన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయనగరం :‘జిల్లాలో ఇప్పటికే కేంద్రమంత్రి పదవిని ఓసీకి ఇచ్చారు. రాష్ట్ర మంత్రి పదవిని మళ్లీ అదే ఓసీకి ఇవ్వడం సరికాదు. మృణాళినిని మంత్రివర్గం నుంచి తప్పిస్తే బీసీలకే అవకాశం ఇవ్వాలి. అదీ ఒరిజనల్ బీసీలకే ఇవ్వండి. వెలమలమని చెప్పుకునే దొరలకు ఇవ్వొద్దు.’ అని సీఎం చం ద్రబాబునాయుడ్ని, పార్టీ కార్యాలయ కార్యదర్శి టి.డి.జనార్దన్‌ను టీడీపీకి చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఇటీవలే పార్టీలోకొచ్చిన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావుకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని తెగేసి చెప్పేశారు. ఈ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఒక్కటయ్యారు. రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబునాయుడ్ని, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ కార్యాలయ కార్యదర్శి టి.డి. జనార్దన్‌ను ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, కె.ఎ.నాయుడు, మీసాల గీత సంయుక్తంగా కలిసి తమ మనోగతాన్ని తెలియజేశారు. రాష్ట్ర మంత్రి పదవిని కూడా ఓసీకిస్తే బీసీల నుంచి వ్యతిరేకత వస్తుందని, ఆ వర్గాన్ని దూరం చేసుకోవల్సి వస్తోందని పరోక్షంగా హెచ్చరించారని తెలిసింది.
మాలో ఎవరికిచ్చినా పర్వాలేదు
మంత్రి పదవి తమలో ఎవరికిచ్చినా ఫర్వాలేదని, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ముగ్గురు, వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరున్నారని చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ ఎస్టీకి ఇవ్వాలనుకుంటే సంధ్యారాణికి ఇవ్వాలని, ఎస్సీకి ఇవ్వాలనుకుంటే బొబ్బిలి చిరంజీవులు ఉన్నారని సీఎంను కలిసిన ఐదుగురు నేతలు చెప్పినట్టు తెలియవచ్చింది. ఇదే విషయమై మరోసారి ఈ నెల 18న లోకేష్‌కు చెప్పేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా, వెళ్లిన వారితో పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు కూడా ఉండేవారని కాకపోతే ఒకరు అనారోగ్యంతో, మరొకరు వ్యక్తిగత కారణంగా వెళ్లలేకపోయారని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా సుజయకృష్ణ రంగారావును వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టమవుతోంది. జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి తప్ప మరెవ్వరూ వారి వెనక లేరని తెలియవస్తోంది.
ఇది అశోక్ వ్యూహమేనా?
సుజయకృష్ణ రంగారావుకు వ్యతిరేకంగా సీఎంను కలిసిన ఐదుగురు వెనుక కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. అంత ధైర్యంగా సీఎం వద్దకు వెళ్లి చెప్పారంటే అశోక్ డైరెక్షన్ ఉండొచ్చనే వాదనలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే, సుజయకృష్ణ రంగారావును టీడీపీలోకి తీసుకోవడమే అశోక్ గజపతిరాజుకు ఇష్టం లేదని, తప్పని పరిస్థితుల్లో తీసుకోవల్సి వచ్చిందనే చర్చ ఎప్పటినుంచో ఉంది. మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం వ్యతిరేకత కనబరిచినట్టు తెలుస్తోంది. బంగ్లా నుంచి పవర్ సెంటర్ మారుతుందనో...పట్టు కోల్పోతామన్న భయమో తెలియదు గాని సుజయకృష్ణకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో సానుకూలంగా లేరని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఐదుగురు నేతలు సీఎంను కలిసి తమ మనోగతాన్ని తెలియజేసినట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.