
'జగన్ మా నేత అని గర్వపడుతున్నాం'
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. రుణమాఫీపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బేషరతుగా రుణమాఫీ చేస్తామని హామీయిచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని విమర్శించారు. రేషన్ కార్డుకు ఒక్క రుణమాఫీ మాత్రమే చేస్తామనడం సరికాదన్నారు. రుణమాఫీపై మాట్లాడే అర్హత తమ పార్టీకి లేదని ప్రభుత్వం అనడం చాలా దురదృష్టకరమన్నారు.
ఎన్నికల సమయంలో రుణమాఫీపై టీడీపీ హామీయిచ్చినప్పడు మనం కూడా ప్రకటన చేద్దామని తమ నాయకుడు జగన్ ను అడిగామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రుణమాఫీ సాధ్యపడదని జగన్ భావించారని చెప్పారు. రుణమాఫీపై హామీయిస్తే ఎన్నికల్లో లబ్ది పొందేవాళ్లమని, కానీ అలా చేయలేదన్నారు. సాధ్యపడదని హామీ ఇవ్వనందుకు జగన్ తమ నాయకుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామని సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు.