బొబ్బిలి:బొబ్బిలి పురపాలక సంఘంలోని కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక టీడీపీలో చిచ్చు రగిలి స్తుంది. రాష్ర్టంలో అధికారంలో ఉన్నా ఇక్కడ మునిసిపాలిటీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆ పార్టీలో ఇప్పుడు కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక చిచ్చు రగులుస్తుంది. ఆ పార్టీలోని నాయకుల మధ్యే సమన్వయం లేకపోవడంతో సభ్యుని ఎన్నికకు ఆ పార్టీ కౌన్సిలర్ల మద్దతే కరువైంది. పురపాలక సంఘంలో ఒక జనరల్ స్థానంతో పాటు క్రిష్టియన్ మైనార్టీ, ముస్లిం మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కో ఆప్షన్ స్థానాలున్నాయి. ముందుగా జనరల్ స్థానానికి ఎన్నిక జరిపిన అనంతరం మిగిలిన రెండు మెజార్టీ సభ్యుల ఆమోదంతో భర్తీ చేపట్టాల్సి ఉంది. జనరల్ స్థానానికి మున్సిపాలిటీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో 12 మంది కౌన్సిలర్లు దరఖాస్తు చేసుకున్నారు.
బీసపు వైపే టీడీపీ మొగ్గు..
వైఎస్‌ఆర్‌సీపీ బి ఫారంపై గెలిచి ఇటీవల చైర్‌పర్సన్ ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చిన 15వ వార్డు కౌన్సిలర్ బీసపు పార్వతి భర్త, మాజీ కౌన్సిలరు బీసపు చిన్నారావుకు కో ఆప్షన్‌గా నియమించడానికి టీడీపీలోని ఓ వర్గం సుముఖంగా ఉండడంతో అదే పార్టీలోని మిగిలిన వారు వ్యతిరేకిస్తున్నారు. చిన్నారావు పేరు సూచించకుండా ఎవరిని సూచించినా మద్దతు ఉంటుందంటూ 8, 16 వార్డుల కౌన్సిలర్లు ఈ నెల 8న జరిగిన కౌన్సిల్ సమావేశానికి వెళ్లకుండా ఉండిపోయారు. దాంతో ఆనాటి సమావేశం కోరం లేక వాయిదా పడింది. 8, 16 వార్డుల కౌన్సిలర్లు ఇద్దరిని కౌన్సిల్ హాలుకు పంపించడానికి జరిపిన మంతనాల్లో నాయకులు, కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు సమాచారం.
పట్టుబడుతున్న కాంగ్రెస్
చైర్‌పర్సన్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చిన విధంగా కో ఆప్షన్ స్థానం ఇవ్వాలని ఆ పార్టీ వారు పట్టుబడుతున్నారు. చైర్‌పర్సన్ ఎన్నికకు టీడీపీకి బలం చాలకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12, 28 వార్డుల కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఆ సమయంలో టీడీపీ నాయకులు కో ఆప్షన్ స్థానం కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఇప్పుడు దానిని ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దీనికి టీడీపీ చేతులెత్తేయడంతో ఆ సభ్యులు కూడా కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు.
మెజార్టీ సభ్యుల ఆమోదంతో ఎన్నికకు సన్నాహాలు
కో ఆప్షన్ ఎన్నికను టీడీపీ నాయకులు అనుకున్న వారికి ఇప్పించడానికి ఓటింగు ద్వారా కాకుండా మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండుసార్లు కౌన్సిల్ సమావేశం వాయిదాపడితే మూడో సమావేశంలో చైర్‌పర్సన్ తన అధికారంతో మెజార్టీ సభ్యుల ఆమోదంతో సభ్యుని ఎన్నిక జరుపుకొనే అవకాశం ఉంది. ఈ నెల 16న రెండోసారి సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశం కూడా కోరం చాలక వాయిదా పడేటట్లు చేయడానికి అధికార పార్టీ ప్రణాళికలు వేస్తుంది. అప్పుడు మూడోసారి సమావేశం ఏర్పాటు చేసి మెజార్టీ సభ్యుల అభిప్రాయంతో కో ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరపడానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం.
టీడీపీలో అంతర్గత పోరు!
Published Sun, Sep 14 2014 2:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM
Advertisement