ఉయ్యూరులో కుర్చీలాట
► ఒప్పందంపై ‘లొల్లి’
► రెండు ఒప్పందాల్లో ఏది అమలయ్యేనో ?
ఉయ్యూరు : మున్సిపాలిటీలో ఒప్పందాల లొల్లి రాజుకుంది. చైర్మన్ పదవిపై ఒప్పందాన్ని అమలు చేస్తారో అనే అంశంపైనే చర్చ నడుస్తోంది. ఒప్పందాలపై ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ అధిష్టానం కూడా దృష్టిసారించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఎన్నికల సమయంలో..
మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఉయ్యూరు చైర్మన్ తొలి పీఠంపై వైఎస్సార్ సీపీ, టీడీపీలు కన్నేశాయి. టీడీపీ చైర్మన్ అభ్యర్థిపై పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, పార్టీ నాయకుడు దేవినేని గౌతమ్ పార్టీ అధిష్టానంతో సంప్రదించి షేక్ ఖలీల్‌కు చైర్మన్ అభ్యర్థిగా బీ-ఫారం అందించారు. ఖలీల్ చైర్మన్‌గా పోటీ నుంచి తప్పుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు పర్యవేక్షిస్తున్న వైవీబీ, గౌతమ్‌లు చివరకు చైర్మన్ పదవిని రెండు సగాలుగా చేసి జంపాన పూర్ణచంద్రరావు (పూల), పొగిరి రాములను ప్రకటించారు. ఎన్నికల్లో రాము ఓడిపోవడంతో అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఒప్పందం ప్రకారం పూల చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. ఎన్నిక పరిణామ క్రమంలో టీడీపీలో చోటు చేసుకున్న వర్గపోరు నేపథ్యంలో వైఎస్సార్ సీపీకి చైర్మన్ దక్కకుండా ఉండేందుకు ఎంపీ కొనకళ్ల, ఎమ్మెల్యే బోడెలు ఓ ఒప్పందాన్ని కుదిర్చి చైర్మన్ పదవిని పంపకం చేయడంతో ఇప్పుడు చైర్మన్ కుర్చీ వివాదం మళ్లీ రాజుకుంది.
అసలు కథ ఇదీ..
ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీలు అభ్యర్థులను బరిలోకి దింపి ఎన్నికలకు వెళ్లాయి. ఎన్నికల్లో ఇరు పార్టీలు చెరో తొమ్మిది వార్డులను గెలుచుకోగా 2, 8 వార్డుల్లో అబ్దుల్ ఖుద్దూస్, తోట జ్యోతి స్వతంత్రులుగా గెలుపొందారు. ఖుద్దూస్ టీడీపీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి పార్థసారథి ప్యానెల్‌లో తోట జ్యోతి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు.
పార్థసారథి రంగ ప్రవేశంతో..
చైర్మన్‌ను ఎన్నుకునే నాటికి పార్థసారథి వైఎస్సార్ సీపీలోకి రావటంతో మున్సిపల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మున్సిపాలిటీలో ఇరు పార్టీల బలాబలాలు సమానంగా మారటంతో ఎక్కడ పార్థసారథి వ్యూహాత్మకంగా చక్రం తిప్పి చైర్మన్ పీఠాన్ని చేజిక్కించుకుంటారో అనే భయంతో టీడీపీ తన అధికార, ఆర్థిక దర్పంతో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన తొమ్మిదో వార్డు కౌన్సిలర్ తుంగల పద్మను ఎన్నికకు హాజరుకాకుండా చేయగలిగారు. ఈ నేపథ్యంలో పూల కాకుండా చైర్మన్ అభ్యర్థిగా ఖలీల్ పేరు తెరపైకి వచ్చింది. చైర్మన్ కుర్చీ వివాదం చోటుచేసుకుంది.
ఎంపీ రాకతో..
చైర్మన్ ఎన్నికకు కొన్ని గంటల ముందు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఉయ్యూరు రావటంతో కథ అంతా మారింది. అసలు తొలుత చేసుకున్న ఒప్పందం బయటపడటంతో చైర్మన్‌గా పూలను ఎన్నుకోక తప్పలేదు. ఈ ఎన్నుకునే క్రమంలో మైనార్టీ వర్గానికి న్యాయం చేయాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇచ్చినందుకు ఖుద్దూస్‌కు ఏడాదిన్నర కాలం, ఆ తరువాత ఏడాదిన్నర కాలం ఖలీల్‌కు అవకాశం కల్పిస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రకటించారు. జూలై 2తో రెండేళ్ల పాలన పూర్తికానుండటంతో తమకిచ్చిన ఒప్పందాన్ని అమలు చేయాలని ఖుద్దూస్, ఖలీల్‌లు కోరుతున్నారు. ఈ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒప్పందాల అంశం హాట్ టాపిక్‌గా మారింది.