టీడీపీలో వర్గపోరు బహిర్గతం
ఏలేశ్వరం: ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముందు నుంచీ టీడీపీలో ఉన్న వారికి, ఇటీవల టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వర్గీయులకు మధ్య వర్గపోరు తలెత్తింది. దీనికి తోడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వ్యవహరిస్తున్న తీరుపై దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు భగ్గుమం టున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ సమావేశం సాక్షిగా శనివారం టీడీపీ వర్గపోరు బహిర్గతమైంది. స్థానిక నగర పంచాయతీ కార్యాల యంలో చైర్‌పర్సన్ కొప్పాడ పార్వతి అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు.
సమావేశం ప్రారంభమవుతుండగా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు టీడీపీ వర్గానికి చెందిన కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. వారు కారణం చెప్పకపోవడంతో మిగిలిన కౌన్సిలర్లకు విషయం తెలియక అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యేను సమావేశానికి పిలవకపోవడంతో వాకౌట్ చేసినట్టు వరుపుల వర్గానికి చెందిన కౌన్సిలర్లు తెలి పారు. ఎమ్మెల్యే ఇంటివద్ద అజెండా కాపీ ఇచ్చి ఆయన సతీమణి నుంచి సంతకం తీసుకున్న రశీదును మరో వర్గం వారు విలేకరులకు చూపిం చారు. టీడీపీ కేడర్ అంతా కలిసి పనిచేద్దామంటే కావాలనే గ్రూపు రాజకీయాలకు పాల్పపడుతున్నారని ఆరోపించారు. గ్రూపు రాజకీయాలను పాల్పపడితే తాము సత్తాచూపుతామని ప్రజలనుంచి తాము టీడీపీ తరఫున గెలిచామని, పార్టీ ఫిరాయించలేదని, ఒరిజినల్‌గా తమదే అసలైన టీడీపీయని మరో వర్గం చెబుతోంది.
ఎమ్మెల్యే వరుపుల తీరుపై ఎంపీకి ఫిర్యాదు
శంఖవరం: ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వైఖరిపై దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులు ఎంపీ తోట నరసింహానికి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వరుపుల ఆది నుంచి పార్టీలో ఉంటున్నా తమ ఆధిపత్యాన్ని అణచివేసే చర్యలకు దిగుతున్నారని రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని పలువురు గ్రామస్థాయి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో పర్వత వర్గీయు లు ఎంపీ తోట నరసింహాన్ని శనివారం రాత్రి శంఖవరం రప్పించుకుని రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా రౌతులపూడి మండలంలో గిడజాం, పల్లపుచామవరం గ్రామాల్లో గతంలో తొలగించిన ఉపాధి ఫీల్డు అసిస్టెంట్లను ఎమ్మెల్యే వరుపుల తిరిగి నియామకం చేశారని ప్రధానంగా ఆరోపించినట్టు చెబుతున్నారు. బంగారయ్యపేట నుంచి ఎమ్మెల్యే వరుపుల ఇంటికి వెళ్లిన పూర్వపు టీడీపీ కార్యకర్తలు కొందరిని తనవద్దకు రావద్దు వెళ్లిపొమ్మన్నారనే విషయంపై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అంతేగాక ఉపాధి కూలీలకు ఇచ్చే మజ్జిగ కార్యక్రమాన్ని కూడా తన అనుయాయులకే కట్టబెట్టుకున్నారని ఆరోపించారని తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము పార్టీకి గుడ్‌బై చెప్పాల్సి వస్తోందని హెచ్చరించినట్టు తెలిసింది.
దీనిపై ఎంపీ తోట పార్టీ అధిష్ఠానం సూచన మేరకు సమన్వయంతో పనులు సాగించుకోవాలని సూచించినట్టు తెలిసింది. గ్రామాల్లో అన్ని పనుల్నీ టీడీపీ కార్యకర్తలతో కలిసి చేసుకోమని ఎమ్మెల్యే వరుపుల తన అనుయాయులందరికీ చెబుతున్నారని, ఆ మేరకే అన్ని గ్రామాల్లో చర్యలు తీసుకుంటున్నారని వరుపుల వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో పొరపొచ్చాలు తీసుకు వచ్చేందుకు ఇలాంటి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ సమావేశానికి ఎంపీ తోట హాజరు కావడం చూస్తే గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సమావేశంలో రౌతులపూడి, శంఖవరం మండలాల్లోని పలువురు నాయకులు పాల్గొన్నారు.