లలిత వర్సెస్ హైమావతి
► ఎస్‌కోట టీడీపీలో ఆధిపత్యపోరు
► నామినేటెట్ పదవుల్లో లలితకుమారి హవా
► జీర్ణించుకోలేకపోతున్న హైమావతి వర్గీయులు
► జెంటిల్‌మన్ ఒప్పందం అమలుపైనా అనుమానాలు
టీడీపీలో ఆధిపత్యపోరు చాపకింద నీరులా సాగుతోంది. ఇప్పుడిప్పుడే అన్ని నియోజకవర్గాలకూ అది పాకుతోంది. తాజాగా ఎస్‌కోట నియోజకవర్గంలో ఈ విషయాలు కాస్తా బహిర్గతమవుతున్నాయి. అక్కడి ఇంతుల మధ్య పోరు రసవత్తరంగానే ఉంది. ఎవరికి వారే తమ పట్టుకోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. పైచేయి సాధించేందుకు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. వీరి మధ్య వైరం గతంలో జరిగిన జెంటిల్‌మన్ ఒప్పందం అమలుపైనా పడుతుందేమోనని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : శృంగవరపుకోట టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న నామినేటేడ్ పదవుల నియామకాలు వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తున్నాయి. జెడ్పీ చైర్‌పర్సన్ పదవిలో ఉన్నది తన కుమార్తె అయినప్పటికీ హైమావతి మాట చెల్లుబాటు కావడంలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే లలితకుమారి పెత్తనమే సాగుతోంది. ఈ పరిణామాలు శోభా వర్గీయుల్ని కలవర పెడుతోంది.
ఆదినుంచీ వైరమే...
తొలి నుంచి వీరి మధ్య విభేదాలున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌కోసం గట్టీ పోటీ నడిచింది. జెడ్పీ ఎన్నికలు రావడం... నీకొకటి- నాకొకటి అన్న రీతిలో పదవుల పంపకాలు జరగడంతో వివాదం సద్దుమణిగింది. హైమావతి కుమార్తె స్వాతిరాణి జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యాక ఎస్‌కోట నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదిపారు. ఎస్‌కోట, వేపాడ మండలాల్ని తమకే వదిలేయాలని పరోక్ష సంకేతాలు పంపించారు.
కానీ, ఎమ్మెల్యే లలితకుమారి ససేమిరా అన్నారు. అయినప్పటికీ చాపకింద నీరులా ఆ రెండు మండలాల్లో హైమావతి వర్గమే ఆధిపత్యం సాగిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు అంతర్గతంగా ముదిరి ఒకరిపై ఒకరు పరోక్షంగా దెబ్బకొట్టుకుంటూనే ఉన్నారు. ఎస్‌కోట పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రద్దు, వేపాడ, కొత్తవలస మండల పరిషత్ కార్యాలయాల్లో పలు వివాదాలకు ఆధిపత్య పోరే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి.
నామినేటెడ్‌లో కోళ్ల హవా...
తాజాగా నామినేటెడ్ పదవుల పోరుకు తెరలేచింది. కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం అటు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇటు శోభా హైమావతి చెరొకరిని ప్రతిపాదించారు. లక్కవరపుకోట మండలం గొలజాంకు చెందిన ఏరువాక సులోచనను లలితకుమారి, కొత్తవలస మండలం అప్పన్నపాలేనికి చెందిన తిక్కాన చినదేముడును హైమావతి ప్రతిపాదించారు. కానీ, ఎమ్మెల్యే తనుకున్న పలుకుబడిని ఉపయోగించి పంతాన్ని నెగ్గించుకున్నారు. దాదాపు పాలకవర్గం మొత్తం ఆమె ప్రతిపాదించిన వారే. తాజాగా జామి ఎల్లారమ్మ, ధర్మవరం సన్యాసయ్య ఆలయ కమిటీలను వేశారు. ఇక్కడా ఎమ్మెల్యే సిఫార్సులే పనిచేశాయి. త్వరలో ఖరారు చేయనున్న పుణ్యగిరి దేవస్థానం కమిటీలోనూ ఆ వర్గానికే చోటు కల్పించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు హైమావతి వర్గీయులు తట్టుకోలేకపోతున్నారు.
జెడ్పీని ఖాతరు చేయకుండా...
అభివృద్ధి పనుల విషయంలోనూ ఎమ్మెల్యే ఓవర్ టేక్ చేస్తున్నారు. జెడ్పీతో పనిలేకుండా నేరుగా మంత్రి, కలెక్టర్ ద్వారా చేయించుకున్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనుల్నీ పెద్ద ఎత్తున మంజూరు చేయించుకున్నారు. అంతేకాకుండా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ లగుడు సింహాద్రిని తన వర్గంగా చేసుకుని, నియోజకవర్గంలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. లగుడు సింహాద్రికి ప్రత్యర్థిగా జామి జెడ్పీటీసీ పెదబాబును హైమావతి వర్గీయులు దించినప్పటికీ హవా మాత్రం సాగించలేకపోతున్నారు. ఈ వ్యవహారం కాస్తా చినబాబు దృష్టికి వెళ్లేలా ఉంది.
జెంటిల్‌మన్ ఒప్పందంపై అనుమానాలు
వీరిమధ్య పోరు ఎస్‌కోట, జామి ఎంపీపీ పదవులకోసం చేసుకున్న జెంటిల్‌మెన్ ఒప్పందం అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఎంపీపీ పదవుల్ని చెరో రెండున్నరేళ్లు చేపట్టేలా రెండువర్గాలూ ఒప్పందం చేసుకున్నారు. ఎస్‌కోటలో హైమావతికి చెందిన రెడ్డి వెంకన్న, జామిలో లలితకుమారికి చెందిన సరసాన అప్యయ్యమ్మ ఎంపీపీలుగా తొలుత నియమితులయ్యారు. రెండున్నరేళ్ల గడువు సమీపించడం, వీరి మధ్య అంతర్గత పోరు తీవ్రమవ్వడంతో జెంటిల్‌మెన్ ఒప్పందం అమలుపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆ పదవులకోసం ఎస్‌కోటలో రాయవరపు చంద్రశేఖర్, జామిలో ఇప్పాక చంద్రకళ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడేమవుతుందోనన్న భయం ఆశావహులకు పట్టుకుంది.