haimavati
-
బతుకే ఓ పోరాటమైన కారుణ్య మూర్తి!
తొమ్మిదేళ్ల బాల వధువు భయంతో ఒళ్ళు ముడుచుకుని ఆ తొలిరాత్రి పానుపు మీద ఓ మూల నక్కి ఉంటే, నలభై అయిదేళ్ల డిప్యూటీ మేజిస్ట్రేట్ వరుడిగా, మూడవ వివాహం చేసుకున్న భర్తగా అదే పాన్పుపై ఆమెకు ఎదురు గానే అంగడి బొమ్మతో కులుకుతున్నాడు. అది 1875. ఆ బాల వధువు తర్వాతి కాలంలో హైమావతీ సేన్ (1866–1930)గా పేరుగాంచిన తొలి తరం వైద్యురాలు. అంతేకాక సుమారు ఐదు వందల మంది అనాథ బాలికలు, పెళ్ళి కాని తల్లులకు జీవనదీపం వెలిగించిన కారుణ్యమూర్తి. ఈ రెండు దశల మధ్య హైమావతి పోరాడి సాగిన దారి... పురుష ప్రపంచానికి ఘోరమైన తల వంపు, భారతీయ మహిళా చరిత్రలో ఓ చీకటి మలుపు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అంతర్భాగమైన, ఆనాటి బెంగాల్ రెసిడెన్సీలో ఖుల్నా జిల్లా గ్రామీణ ప్రాంతంలో 1866లో హైమా వతి జన్మించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంతో ఇష్టపడే కుమార్తెను తండ్రి హైమావతిని ఇద్దరు పిల్లల తండ్రికి మూడో భార్యగా కట్టబెట్టాల్సి వచ్చింది. పదేళ్లు వస్తే కానీ వధువును కాపురానికి పంపకూడదని 1860లో చట్టం చేసినా ఈ తాగు బోతు పెళ్ళికొడుకు డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ కనుక అక్కడ ఆ చట్టం పనిచేయాల్సిన అవసరం లేకపోయింది. భార్యకు శృంగారంలో శిక్షణ ఇవ్వాలని మరో స్త్రీని తెచ్చుకుని ఆమె కళ్ళెదుటే ఘన కార్యాలు చేసేవాడు. కొన్ని నెలలకే ఈ పెద్దమనిషి అనారోగ్యం పాలై, న్యుమోనియాతో కన్నుమూశాడు. పదేళ్లకే హైమావతి వితంతువైపోయింది. అత్తగారి తరఫున ఆదుకునేవారు లేక పోవడం, తల్లితండ్రులు కూడా కొద్ది రోజులకే మరణించడంతో ఆమె దిక్కులేనిదయ్యింది.అటు తిరిగి, ఇటు తిరిగి కాశీలోని హిందూ వితంతు శరణాలయంలో తేలారు. కొందరు బ్రహ్మ సమాజపు వ్యక్తులు పరిచయం కావడంతో, హైమావతి జీవితం కొంత మలుపు తిరిగింది. వారి సాయంతో కొంత చదువు నేర్చుకుని, ఓ సంఘ సంస్కర్త నడిపే పాఠశాలలో పనిచేయడం ప్రారంభించింది.కొంత కాలానికి కలకత్తా తిరిగివచ్చింది. కొందరి మిత్రుల ప్రోద్బలంతో హైమావతి 25వ ఏట అంటే 1890లో కుంజబిహారి సేన్‌తో వివాహం జరిగింది. అతను పైకి బ్రహ్మసమాజపు వ్యక్తి లాగా, ఆధ్యాత్మిక చింతనా పరుడిగా కనబడినా, పెళ్లయిన తర్వాత అతని బాధ్యతా రాహిత్యం, ఆవేశం, అసమర్థత, అవకాశవాదం విశృంఖలంగా బయల్ప డ్డాయి. కళ్ళు తెరిచే లోపు ఇద్దరు పిల్లలకు తల్లయింది హైమావతి. అప్పట్లో వైద్యానికి సంబంధించి మహిళలకు ఉపాధి అవకాశాలు కనబడటంతోపాటు 1885లో డఫ్రిన్ ఫండ్ రావడంతో డాక్టర్స్, నర్సులు, మిడ్ వైవ్స్గా శిక్షణ పొందడానికి కొంత ఆర్థికపరమైన చేయూత అందుబాటులో ఉంది. దాంతో 1891లో హైమావతి ఇప్పుడు ‘నీల్ రతన్ సర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’గా పేరుగాంచిన అప్పటి కలకత్తా కామ్బెల్ మెడికల్ స్కూల్లో ‘వెర్నాక్యులర్ లైసెన్షియేట్ ఇన్ మెడిసిన్ అండ్ సర్జరీ’ (పీఎల్ఎంఎస్) చదవాలని నిర్ణయించు కుంది. హైమావతికి బంగారు పతకం రావడం పట్ల వ్యతిరేకత మొదలై; క్లాసులు బహిష్కరించడం, కళాశాల చుట్టూ గుమి గూడటం, ఆడపిల్లలు ప్రయాణం చేసే బగ్గీల మీద రాళ్లు విస రడం వంటి పనులతో పాటు పురుష విద్యార్థులు ఇన్సె్పక్టర్ జనరల్‌కు, లెఫ్టినెంట్ గవర్నర్‌కు అభియోగాలు చేశారు. చివరకు బంగారు పతకాన్ని తిరస్కరింప చేసి, రజతాన్ని అంగీకరింప చేశారు. 1893లో పీఎల్ఎంఎస్ కోర్సు పూర్తయినా, ఎక్కడ నివాసం ఉండాలన్న విషయానికి సంబంధించి ఉద్యోగానికే భర్త అవరోధం కలిగించాడు. ఈ పరిస్థితుల్లో హుగ్లీ లేడీ డఫ్రిన్ హాస్పి టల్లో ఉద్యోగం లభించింది. ఆసుపత్రిలో ఆమెపై పురుష అధికారి శిక్షణ పేరుతో పీడిస్తూ, లైంగిక పరంగా వేధిస్తూ ఉండే వాడు. భర్త పీడింపులు, సాధింపులు ఉండనే ఉన్నాయి. ఈ రెండో మొగుడితో కాపురం 13 ఏళ్లకే ముగిసింది. అతడు చక్కెర వ్యాధితో మరణించాడు. అతడి ద్వారా హైమావతికి మొత్తం ఐదు మంది మగపిల్లలు కలిగారు. హైమావతి జీవితం నిత్యసంకటంగా మారినా, ఆమె మొత్తం జీవిత కాలంలో అన్ని మతాలకూ చెందిన ఒకరోజు మాత్రమే వయసున్న పిల్లలతో సహా 485 మందిని చేరదీయడం ఎంతో విస్మయాన్ని కలిగిస్తుంది. తొలి దశలో చేరదీసినా తన కుమారులకు వయసు పెరిగే కొద్దీ ఈడొస్తున్న ఆడపిల్లలను ఇంకో చోటకు పంపేవారు. 1920 నుంచి 1933 ఆగస్టు 5న కన్నుమూసే దాకా తన జీవితానుభవాలను ఒక గీతలు వేసిన నోట్ బుక్ లో రాసి పెట్టారు. అది దాదాపు 8 దశాబ్దాల తర్వాత బయటపడి ప్రచురణకు నోచుకుని సంచలనం కలిగించడమే గాక, తొలి రోజుల భారతీయ వైద్యరంగ పరిస్థితికి దర్పణమయ్యింది.డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతాధికారిమొబైల్: 94407 32392 -
పిడుగు నుంచి కాపాడుకునే విధానం చెబుతుండగానే..
పిడుగు నుంచి కాపాడుకునే విధానం చెబుతుండగానే.. పాఠశాల భవనంపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కృష్ణశాస్త్రులపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రధానోపాధ్యాయిని హైమావతి పిడుగుబారి నుంచి తప్పించుకునే విధానంపై అవగాహన కల్పిస్తూ ప్రాక్టికల్ చేయిస్తున్నారు. ఇదే సమయంలో పెద్ద శబ్దంతో పాఠశాల భవనంపై పిడుగుపడింది. దీంతో కొద్దిసేపు ఆందోళనకు గురైన పిల్లలు, పాఠశాల సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. పిడుగు పాటుకు భవనం శ్లాబ్ ఓ వైపు రెండు అడుగులమేర ఊడిపోయింది. శ్లాబ్ నుంచి పెచ్చులు రాలి విద్యుత్మీటర్పై పడడంతో అది పేలిపోగా, విద్యుత్‌తీగలు, ఫ్యాన్లు కాలిపోయాయి. పాఠశాల భవనంపై పిడుగుపడినట్టు తెలుసుకున్న గ్రామస్తులంతా సంఘటనా స్థలానికి చేరుకొని తమ పిల్లల యోగక్షేమాలపై ఆరా తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలాన్ని మండల విద్యాశాఖాధికారి యాగాటి దుర్గారావు, తహసీల్దార్ బి.సత్యనారాయణలు సందర్శించారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య
ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో ఓ రోగి ఆత్మహత్య చేసుకుంది.ప్రకాశం జిల్లా కొల్లపాలెం గ్రామానికి చెందిన హైమవతి మూడేళ్లుగా ఇక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆస్పత్రిలో 24 గంటలూ కాపలా ఉండే క్లోజ్డ్ ఫిమేల్ వార్డులో ఈమెతో పాటు మరో 77 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో హైమవతి వార్డులో కిటికీ చువ్వకు చీరతో ఉరి వేసుకుంది. అందరూ ఉండగానే ఆమె ఎలా ఆత్మహత్యకు పాల్పడిందనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సార్ నగర్ పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించారు. -
లలిత వర్సెస్ హైమావతి
► ఎస్‌కోట టీడీపీలో ఆధిపత్యపోరు ► నామినేటెట్ పదవుల్లో లలితకుమారి హవా ► జీర్ణించుకోలేకపోతున్న హైమావతి వర్గీయులు ► జెంటిల్మన్ ఒప్పందం అమలుపైనా అనుమానాలు టీడీపీలో ఆధిపత్యపోరు చాపకింద నీరులా సాగుతోంది. ఇప్పుడిప్పుడే అన్ని నియోజకవర్గాలకూ అది పాకుతోంది. తాజాగా ఎస్‌కోట నియోజకవర్గంలో ఈ విషయాలు కాస్తా బహిర్గతమవుతున్నాయి. అక్కడి ఇంతుల మధ్య పోరు రసవత్తరంగానే ఉంది. ఎవరికి వారే తమ పట్టుకోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. పైచేయి సాధించేందుకు అంతర్గతంగా పావులు కదుపుతున్నారు. వీరి మధ్య వైరం గతంలో జరిగిన జెంటిల్మన్ ఒప్పందం అమలుపైనా పడుతుందేమోనని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం : శృంగవరపుకోట టీడీపీలో అంతర్గత పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయి. తాజాగా జరుగుతున్న నామినేటేడ్ పదవుల నియామకాలు వారి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ పదవిలో ఉన్నది తన కుమార్తె అయినప్పటికీ హైమావతి మాట చెల్లుబాటు కావడంలేదు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే లలితకుమారి పెత్తనమే సాగుతోంది. ఈ పరిణామాలు శోభా వర్గీయుల్ని కలవర పెడుతోంది. ఆదినుంచీ వైరమే... తొలి నుంచి వీరి మధ్య విభేదాలున్నాయి. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్కోసం గట్టీ పోటీ నడిచింది. జెడ్పీ ఎన్నికలు రావడం... నీకొకటి- నాకొకటి అన్న రీతిలో పదవుల పంపకాలు జరగడంతో వివాదం సద్దుమణిగింది. హైమావతి కుమార్తె స్వాతిరాణి జెడ్పీ చైర్పర్సన్ అయ్యాక ఎస్‌కోట నియోజకవర్గంలో పాగా వేసేందుకు పావులు కదిపారు. ఎస్‌కోట, వేపాడ మండలాల్ని తమకే వదిలేయాలని పరోక్ష సంకేతాలు పంపించారు. కానీ, ఎమ్మెల్యే లలితకుమారి ససేమిరా అన్నారు. అయినప్పటికీ చాపకింద నీరులా ఆ రెండు మండలాల్లో హైమావతి వర్గమే ఆధిపత్యం సాగిస్తోంది. దీంతో ఇద్దరి మధ్య వివాదాలు అంతర్గతంగా ముదిరి ఒకరిపై ఒకరు పరోక్షంగా దెబ్బకొట్టుకుంటూనే ఉన్నారు. ఎస్‌కోట పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రద్దు, వేపాడ, కొత్తవలస మండల పరిషత్ కార్యాలయాల్లో పలు వివాదాలకు ఆధిపత్య పోరే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. నామినేటెడ్‌లో కోళ్ల హవా... తాజాగా నామినేటెడ్ పదవుల పోరుకు తెరలేచింది. కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టు కోసం అటు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇటు శోభా హైమావతి చెరొకరిని ప్రతిపాదించారు. లక్కవరపుకోట మండలం గొలజాంకు చెందిన ఏరువాక సులోచనను లలితకుమారి, కొత్తవలస మండలం అప్పన్నపాలేనికి చెందిన తిక్కాన చినదేముడును హైమావతి ప్రతిపాదించారు. కానీ, ఎమ్మెల్యే తనుకున్న పలుకుబడిని ఉపయోగించి పంతాన్ని నెగ్గించుకున్నారు. దాదాపు పాలకవర్గం మొత్తం ఆమె ప్రతిపాదించిన వారే. తాజాగా జామి ఎల్లారమ్మ, ధర్మవరం సన్యాసయ్య ఆలయ కమిటీలను వేశారు. ఇక్కడా ఎమ్మెల్యే సిఫార్సులే పనిచేశాయి. త్వరలో ఖరారు చేయనున్న పుణ్యగిరి దేవస్థానం కమిటీలోనూ ఆ వర్గానికే చోటు కల్పించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలు హైమావతి వర్గీయులు తట్టుకోలేకపోతున్నారు. జెడ్పీని ఖాతరు చేయకుండా... అభివృద్ధి పనుల విషయంలోనూ ఎమ్మెల్యే ఓవర్ టేక్ చేస్తున్నారు. జెడ్పీతో పనిలేకుండా నేరుగా మంత్రి, కలెక్టర్ ద్వారా చేయించుకున్నారు. ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనుల్నీ పెద్ద ఎత్తున మంజూరు చేయించుకున్నారు. అంతేకాకుండా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లగుడు సింహాద్రిని తన వర్గంగా చేసుకుని, నియోజకవర్గంలో చక్రం తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. లగుడు సింహాద్రికి ప్రత్యర్థిగా జామి జెడ్పీటీసీ పెదబాబును హైమావతి వర్గీయులు దించినప్పటికీ హవా మాత్రం సాగించలేకపోతున్నారు. ఈ వ్యవహారం కాస్తా చినబాబు దృష్టికి వెళ్లేలా ఉంది. జెంటిల్మన్ ఒప్పందంపై అనుమానాలు వీరిమధ్య పోరు ఎస్‌కోట, జామి ఎంపీపీ పదవులకోసం చేసుకున్న జెంటిల్మెన్ ఒప్పందం అమలుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ఎంపీపీ పదవుల్ని చెరో రెండున్నరేళ్లు చేపట్టేలా రెండువర్గాలూ ఒప్పందం చేసుకున్నారు. ఎస్‌కోటలో హైమావతికి చెందిన రెడ్డి వెంకన్న, జామిలో లలితకుమారికి చెందిన సరసాన అప్యయ్యమ్మ ఎంపీపీలుగా తొలుత నియమితులయ్యారు. రెండున్నరేళ్ల గడువు సమీపించడం, వీరి మధ్య అంతర్గత పోరు తీవ్రమవ్వడంతో జెంటిల్మెన్ ఒప్పందం అమలుపై అనుమానాలు నెలకొంటున్నాయి. ఆ పదవులకోసం ఎస్‌కోటలో రాయవరపు చంద్రశేఖర్, జామిలో ఇప్పాక చంద్రకళ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడేమవుతుందోనన్న భయం ఆశావహులకు పట్టుకుంది. -
నన్నూ చంపేశారు
ఇద్దరు ఆడపిల్లల్ని రెండు కళ్ళలా చూసుకుంది. కనుచూపు మేర కనబడిందల్లా సాధించేలా పెంచింది. ఆడపిల్లలైతేనేం... కొడుకుల కంటే బలవంతులని నమ్మింది. తన ప్రేమే ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడుతుందని భావించింది. కానీ ప్రేమను ఉన్మాదం చంపేస్తుందని ఊహించలేదు! సమాజం మొద్దుబారిపోయింది. నా పిల్లల్నే కాదు, నన్నూ చంపేశారు అంటోంది. దీంట్లో నా పిల్లల తప్పేంటి? నా తప్పేంటి?! అని అడుగుతోంది. ‘వాడి’ తల్లిదండ్రుల పెంపకం బాగుంటే నా పిల్లలు బతికుండేవారని వాపోతోంది. ఏడ్చి ఏడ్చి కన్నీరు ఇంకిపోయింది. కుమిలి కుమిలి ప్రాణం పెగిలిపోయింది. తనలాగ ఇంకొక తల్లికి జరక్కూడదు. తన పిల్లల్లా ఏ ఆడపిల్లకీ జరక్కూడదు అని ఆశిస్తోంది. ... ప్రేమోన్మాది ఘాతుకానికి బలైపోయిన యామిని, శ్రీలేఖల తల్లి హైమావతితో ఫ్యామిలీ ఇంటర్వ్యూ ‘‘ఏ అర్ధరాత్రో కలత నిద్రలోకి జారుకుంటాను...‘మమ్మీ!’ అని పిలుపు... ఆశగా వెంటనే బయటకు వచ్చి చూస్తాను. యామిని లేదు. శ్రీలేఖా లేదు. కళ్ల ముందు అంతా చీకటి. శూన్యం. నా జీవితంలో ఇక మిగిలింది అదే!’’ ఏడ్చి ఏడ్చి గుండె తడి ఆరిపోయిన హైమావతి చెప్పిన మాటలివి. కిందటినెల 14వ తారీఖున హైదరాబాద్ కొత్తపేటలో ఓ దారుణం జరిగింది. యామినీసరస్వతి, శ్రీలేఖ అనే ఇద్దరు అక్కచెల్లెళ్లను అమిత్‌సింగ్ అనే ఓ ఉన్మాది ప్రేమ పేరుతో దారుణంగా హత్య చేశాడు. కూతుళ్లే లోకంగా, వారి భవిష్యత్తే తన కలగా బతుకుతున్న ఆ తల్లికి తీరని కడుపు శోకాన్ని మిగిల్చాడు. తనకు జరిగిన ఈ అన్యాయం బిడ్డలున్న ఏ తల్లీతండ్రికి జరగకూడదని చెబుతున్న హైమావతి వ్యధ ఇది... ‘‘మొన్న జూన్‌లో నా పుట్టిన రోజు వస్తే, ఎన్నడూ లేనిదీ ఇద్దరికిద్దరు తెగ హడావిడి చేశారు. అప్పుడప్పుడు నేను పాకెట్‌మనీగా ఇచ్చిన డబ్బులను దాచుకొని, అర్ధరాత్రి కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేశారు. ‘ఇవన్నీ ఎందుకర్రా’ అంటే ‘మా కోసం ఎంతో కష్టపడుతున్నావు అమ్మా! నీకోసం ఈ మాత్రం చేయలేమా!’ అన్నారు. ‘ఇంకో మూడు నెలల్లో అక్క పెళ్లయిపోతుంది. మరో ఏడాదిలో నేను ఫారిన్ వెళ్లి, జాబ్ చేసి, నీకు బోలెడు డబ్బులు పంపిస్తా. అప్పుడు నువ్విలా రోజూ బస్సులో అంతేసి దూరం వెళ్లే బాధ తప్పుతుంది’ అంది శ్రీలేఖ. ‘పెళ్లయినా నేను మమ్మీదగ్గరే ఉంటాను..’ గారాలు పోయింది యామినీ. నా బిడ్డలకు నేనంటే ఎంత ప్రేమ అని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరికీ రెండేళ్లే తేడా. ఎంత బాగుంటారో స్నేహితుల్లా అనేవారు చూసినవారంతా! ఇద్దరి మధ్య అంత ఆప్యాయత ఉండేది. అక్కచెల్లెళ్లు అంటే చిన్న చిన్న గొడవలైనా ఉండటం సహజం అనుకుంటారంతా! కానీ వీరిద్దరూ దేనికీ గొడవపడేవారే కాదు. పరిస్థితులను అర్థం చేసుకొని, మసలుకునేవారు. శ్రీలేఖ పుట్టినప్పుడు ఒక్కక్షణం - కొడుకైతే బాగుండు, ఒక అమ్మాయి- ఒక అబ్బాయి ఉంటారు కదా అనుకున్నాను. కానీ, శ్రీలేఖ పుట్టాక ఇద్దరికీ ఒకరికొకరు తోడు అనుకున్నాను. అలాగే పెరిగారు. మా వారు (కృష్ణారెడ్డి. కండక్టర్) ఉద్యోగరీత్యా పిల్లలు నిద్రలేవకముందే డ్యూటీకెళ్లిపోయేవారు. వాళ్లు పడుకున్నాక ఇంటికి వచ్చేవారు. ఆ విధంగా వారికి నాతోనే అటాచ్మెంట్ ఎక్కువ. కిందటేడాది వరకు మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లోనే ఉన్నాం. అక్కడే సర్వశిక్ష అభియాన్‌లో ఉద్యోగం చేస్తున్నాను. పిల్లలను కనిపెట్టుకొని ఉండటానికి మా అమ్మ నాతోనే ఉండేది. ఏడాది క్రితం... యామినీ ఇంజనీరింగ్ చదువైపోయింది. శ్రీలేఖ చదువు ఇంకో ఏడాదిలో పూర్తవుతుంది. యామిని పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ, కోచింగ్ తీసుకుంటోంది. శ్రీలేఖ పై చదువుల కోసం ప్లాన్.. ఇవన్నీ హైదరాబాద్‌లో ఉంటే సరిగ్గా అవుతాయనే ఉద్దేశంతో షాద్‌నగర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాం. సాగర్రింగ్రోడ్లోనే మా తమ్ముడి కుటుంబం ఉంటుంది. అన్నింటికీ అందుబాటులో ఉంటుందనే కొత్తపేటలో ఇల్లు తీసుకున్నాం. అమ్మ ఎలాగూ నాతోనే ఉంటుంది. ఇవన్నీ చూసుకునే నేను ఉద్యోగానికి భరోసాగా వెళ్లేదాన్ని. ఈ రోజుల్లో ఆడపిల్లలకు బయట ఎలాంటి రక్షణ ఉందో చూస్తూనే ఉన్నాం. అందులోనూ నేను పొద్దున్నే డ్యూటీకి వెళితే, తిరిగి రాత్రికి గాను రాను. అందుకే చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి, బయల్దేరేదాన్ని. మూడు నెలల క్రితం... యామినికీ ఓ సాఫ్ట్వేర్ సంబంధం వచ్చింది. అన్నివిధాల నచ్చిన సంబంధం. మే 31న ఎంగే జ్మెంట్ చేశాం. అక్టోబర్‌లో పెళ్లి అనుకున్నాం. అక్క ఎంగేజ్మెంట్లో శ్రీలేఖదే హడావిడి అంతా! శ్రీలేఖ కలలు ఒకలా ఉన్నా, ఇంకో రెండేళ్లలో తన పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది అనుకున్నాను. ఆర్నెల్ల క్రితం... శ్రీలేఖ ఒకసారి చెప్పింది తనతో పాటు చదివిన ఒకబ్బాయి వేధిస్తున్నాడని... నా గుండెలో రాయి పడినంత భయమేసింది. ఆ అబ్బాయిని మా తమ్ముడు వెళ్లి మందలించాడు. అతని తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడాను. ‘ఇలా అయితే, పోలీసు కేసు పెడతాను’ అని హెచ్చరించాను. ఆ తర్వాత శ్రీలేఖను అడిగాను... ‘ఇప్పుడు ఏ సమస్యా లేదు’ అని చెప్పింది. నేను కాస్త తెరిపిన పడ్డాను. ఆ రోజు... యామినికి ముందు రోజు నుంచి కాస్త జ్వరం. క్లాస్‌కు వెళ్లలేదు. మా బంధువు ఒకరు చనిపోతే, అమ్మ అక్కడికి వెళ్లింది. సాయంత్రానికి వచ్చేస్తానంది. అక్క కోసం శ్రీలేఖ కాలేజీకి వెళ్లలేదు. ఇద్దరు ఉన్నారు కదా ఒకరికొకరు తోడుగా అని, పాలు కలిపి, ఇద్దరికీ ఇచ్చి.. వంట చేసిపెట్టి రోజులాగే 7 గంటలకల్లా ఆఫీసుకు బయల్దేరాను. వెళుతున్న నాకు ‘జాగ్రత్తమ్మా!’ అని చెప్పారు. అంతే...! అదే నా బిడ్డల చివరి మాట. అదే నాకు చివరి చూపు. నేను బస్సు దిగేవరకు మధ్యలో ఒక్కసారైనా ఫోన్ చేసేవారు. ఇంకా చేయలేదేంటి అనుకుంటూనే... షాద్‌నగర్‌లో బస్సు దిగాను. నేను ఫోన్ చేయబోతుండగానే, అప్పుడే నా ఫోన్ మోగింది. మా పై ఇంటిలో ఉండేవారు... ‘యామిని, శ్రీలేఖలను ఎవరో వచ్చి పొడిచేశారు... అని చెబుతున్నారు. గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. తిరిగి కొత్తపేటకు ఎలా చేరుకున్నానో... ఇప్పటికీ గుర్తులేదు. హాస్పిటల్లో ఇద్దరు బిడ్డలు రక్తపు మడుగులో.. ఏం చెప్పను!! విగతజీవులైన బిడ్డలను చూసి కుప్పకూలిపోయాను. ఇప్పటికీ వాళ్లు లేరంటే నమ్మకం కలగడం లేదు. ఏ వైపు చూసినా వారి రూపాలే! ఏ మాట విన్నా వారి గొంతే! ... పండగ వచ్చిందంటే ఆ కళ అంతా వారిలోనే చూసుకొని పొంగిపోయేదాన్ని. ఇప్పుడు... వారిద్దరినీ కోల్పోయి గుండె తడి ఆరిపోయి కట్టెలా మిగిలాను. ఒకరికోసం ఒకరు తోడున్నారులే అని భరోసా ఉండేది. ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు నన్ను ఒంటరిదాన్ని చేసి. శిక్ష తప్పదు... పోలీసుల ద్వారా విషయాలు తెలిసి నివ్వెరపోయాను. ఆ ఉన్మాది (అమిత్‌సింగ్) మేం ఉన్న ఏరియాలోనే తన స్నేహితుల గదిలో ఉన్నాడని, నా ఇంటి మీద నిఘా ఉంచాడని, పెద్దలెవరూ లేని సమయం చూసుకొని నా ఇంటి దీపాలను ఆర్పేశాడని. నా బిడ్డల చావుకు కారణమైనవాడిని బతకనివ్వకూడదు. వెంటనే చంపేయాలి. అతడిని చంపితే నా బిడ్డలు తిరిగొస్తారని కాదు. కానీ, ఇలాంటి శిక్ష ఏ తల్లీకి పడకూడదన్నదే నా బాధ. మగపిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలాంటి శిక్షపడుతుందో వారికి తెలిసిరావాలి. ఆడపిల్ల బయట తిరిగితే రక్షణ లేదనుకుంటాం. కానీ, ఇంట్లో ఉన్నా రక్షణ లేదంటే...! మేం హెచ్చరించినప్పుడే తమ కొడుకు విషయంలో ఆ తల్లీతండ్రీ జాగ్రత్తపడి ఉంటే.. మూడు నెలల్లో పెళ్లి పీటలెక్కాల్సిన నా కూతురు మట్టయ్యేదా? ‘మీ కేమండీ! ఇద్దరు ఆడపిల్లలు ముత్యాల్లా ఉన్నారు. చక్కగా చదువుకున్నారు! అనేవారంతా.. !’ అలాంటి నా బంగారు తల్లులను పొట్టనపెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు. నా బిడ్డలు చేసిన పాపమేంటి? అబ్బాయి ప్రేమను కాదంటే ఆడపిల్ల చావల్సిందేనా! ప్రేమ పేరుతో మన ఇళ్ల మధ్యే ఉన్మాదులు తిరుగుతుంటే వారిని గుర్తించేదెలా? కూతుళ్లను కాపాడుకునేదెలా?!’’ అంటూ కూతుళ్ల భవిష్యత్తే లోకంగా బతికిన ఆ తల్లి వేసిన ప్రశ్నలకు ఈ సమాజం ఏం బదులిస్తుంది? - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి చెబితేనే సేవ్ అవుతారు వేధింపులు ముందే తెలుసు కాబట్టి పోలీసు కేసుపెట్టి ఉంటే ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు. చాలామంది అమ్మాయిలు... అబ్బాయిల వేధింపులకు బయట సమాజం ఏమనుకుంటుందో అని భయపడి ఏమీ చెప్పరు. అదే అడ్వాంటేజీగా అబ్బాయిలు తీసుకుంటున్నారు. ఎవరైనా వేధిస్తుంటే తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, పోలీసులకు తప్పక తెలియజేయాలి. అలాగే చుట్టుపక్కల వారినీ అలెర్ట్ చేయాలి. అలాగే... సైబర్ కంట్రోల్ 100 కి డయల్ చేసి, షీ టీమ్ హెల్ప్ కావాలి అని అడిగితే వెంటనే సాయం అందుతుంది. సైబరాబాద్ షీ టీమ్ పేరున ఫేస్బుక్ పేజీ కూడా ఉంది. వాట్సప్ నెంబర్ 9490617444 కు ఫిర్యాదుచేయవచ్చు. బండిమీద వెళ్లేటప్పుడైనా, ఎక్కడైనా వేధిస్తున్నట్టు తెలిస్తే వెంటనే తమ వద్ద ఉన్న ఫోన్ ద్వారా ఫోటోలు తీసి పంపవచ్చు. - రమా రాజేశ్వరి, ఐపిఎస్, డిసిపి, మల్కాజిగిరి, షీ టీమ్స్ హెడ్, హైదరాబాద్ -
భర్త వివాహేతర సంబంధం గుట్టురట్టు
మార్కాపురం : భర్త వివాహేతర సంబంధాన్ని భార్య బట్టబయలు చేసింది. ఓ మహిళతో ఇంట్లో ఉండగా కుమారుడు, కుమార్తెలతో పాటు బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివరాలు.. పట్టణంలోని శివాజీ నగర్ 5వ లైనులో నివాసం ఉంటున్న మేడవరపు శ్రీనివాసరావు తర్లుపాడు మండలం శీతానాగులవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దర్శికి చెందిన హైమావతితో 1997 మేలో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హైమావతి స్థానిక ఏరియా వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిన ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. కొన్నేళ్లుగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనతో కాపురం చేయకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉండగానే భర్త నివాసం ఉంటున్న ఇంటిపై నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలో ఇంట్లో మరో మహిళ ఉన్నట్లు స్థానికుల నుంచి ఆమెకు సమాచారం అందింది. బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఎం.లక్ష్మి, ఎన్.లక్ష్మి, ఆ పార్టీ నేత పయిడిమర్రి శ్రీనివాసరావు, తన ముగ్గురు పిల్లలతో కలిసి గురువారం వేకువ జామున 4 గంటల సమయంలో హైమావతి తన భర్త ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన వెంటనే విలేకరులకూ సమాచారం అందించింది. ఈమె వద్ద ఉన్న మరో తాళంతో తలుపు తీయగానే అప్పటి వరకూ భర్త శ్రీనివాసరావుతో ఉన్న మహిళ బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో హైమావతి తరఫు బంధువులు, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ఘర్షణ జరిగింది. న్యాయం చేయాలంటూ ధర్నా తనకు న్యాయం చేయాలంటూ హైమావతి తన పిల్లలు హరికృష్ణ, ధరణి, ద్రాక్షయనిలతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి శ్రీనివాసరావును పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇంట్లో ఉన్న పనిమనిషితో తనకు వివాహేతర సంబంధం అంటగట్టారని శ్రీనివాసరావు విలేకరులకు తెలిపాడు. తన భర్త అసత్యం చెబుతున్నాడని, ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని హైమావతి కూడా వివరించింది. -
నరకయాతన
పై ఫోటోలో కటకటాల్లో ఉన్నట్లు కనిపిస్తున్న వారు సుబ్బరామిరెడ్డి, హైమావతి. రైల్వేకోడూరు మండలం మాధవరంపోడుకు చెందిన దంపతులు. కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలనేది వారి లక్ష్యం. నాలుగు రూకలు వెనుకోసుకుందామని జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. భార్యాభర్తలు అక్కడే అద్దెకు గది తీసుకుని జీవనాన్ని సాగించేవారు. అదే గృహ సముదాయంలో హైదరాబాద్‌కు చెందిన ఒకరు నివాసం ఉండేవారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ అక్కడి పోలీసులు గుర్తించేలోపు పరారీ అయ్యాడు. ఆ వ్యక్తి సుబ్బరామిరెడ్డికి సంబంధించిన వాడని.. ఆకేసును ఈ దంపతులపై పెట్టారు. అక్కడి కోర్టు 25 ఏళ్ల శిక్ష విధించింది. ఏడాదిన్నరగా ఆ దంపతులు జైల్లో మగ్గుతున్నారు. ప్రస్తుతం సుబ్బరామిరెడ్డి రెండు కిడ్నీలు చెడిపోయాయి. అన్యాయంగా ఆ కుటుంబాన్ని జైలు పాలు చేశారంటూ అక్కడి తెలుగువారు వాపోతున్నా పట్టించుకునే నాధుడే లేరు. అండగా నిలవాల్సిన భారత ఎంబసీ అధికారుల్లో ఆశించిన స్పందన లేదు. ఇలా సుబ్బరామిరెడ్డి దంపతులే కాదు. సుమారు 4వేల మంది కువైట్ జైల్లో మగ్గుతున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: కువైట్..సౌదీ.. బతుకు దెరువు కోసం లక్షల మంది తెలుగువాళ్లు ఈ దేశాలకు వెళ్లారు. వెళ్లిన వారు ఒక్కో దేశంలో ఒక్కో సమస్యను ఎదుర్కొంటున్నారు. సౌదీలోని కొత్త చట్టాలతో అక్కడి తెలుగువాళ్లు జైళ్లకు వెళ్లే పరిస్థితి తలెత్తుతుండగా... కువైట్‌లో సంబంధంలేని కేసుల పేరుతో జైలుకు పంపుతున్నారు. తమను ఆదుకోవాలని బాధితులు భారత రాయబార కార్యాలయానికి వెళుతుంటే ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జైలుకు వెళ్లడమో, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడమో తప్పదంటున్నారు. తప్పు చేయకపోయినా తప్పని శిక్ష.... జిల్లా నుంచి దాదాపు రెండు లక్షల మంది గల్ఫ్‌లోని యునెటైడ్ అర బ్ ఎమిరెట్స్(యూఏఈ), సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, దోహఖతర్, ఓమన్ తదితర దేశాలకు వలసవెళ్లారు. ఇందులో అనేక కారణాలతో వేలాదిమంది ఖల్లివెల్లి(అక్రమ నివాసులు) కార్మికులుగా మారారు. అలాంటి వారి బాధలు వర్ణణాతీతం. ఇళ్లల్లో పనులకు వెళ్లిన వారి పరిస్థితి మరీ ఘోరంగా ఉందని వాపోతున్నారు. సేఠ్ల ఇళ్లలోని వారి మధ్య తేడాలొచ్చినా తెలుగువారినే కారకులుగా చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. తప్పు చేయకపోయినా బాధ్యులను చేస్తూ జైల్లో నిర్బంధిస్తున్నారని వాపోతున్నారు. పరిస్థితి దారుణంగా ఉంది: సుబ్బరాయుడు, రాజంపేట. ‘కువైట్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. చేయని తప్పుకు శిక్షలు వేస్తున్నారు. మాతోపాటు నివాసం ఉండే సుబ్బరామిరెడ్డి దంపతులపై అకారణంగా కేసు పెట్టి జైలుకు పంపారు. ఎంతటి కఠినతరమైన పరిస్థితి ఉన్నా భరించాలేకానీ, ప్రశ్నించే పరిస్థితిలేదు. ఇక్కడి పరిస్థితి చూసి ఇంటికి వద్దామనుకున్నా రాలేక పోతున్నాము.. బిక్కుబిక్కు మంటూ జీవనం గడుపుతున్నాం. ఎంబసీ తీరు దారుణం: శ్రీను నెర్సుపల్లె, చ క్రాయపేట. తెలుగువాళ్లకు అన్యాయం జరిగితే స్పందించాల్సిన ఎంబసీ అన్యాయంగా వ్యవహరిస్తోంది. సుబ్బరామిరెడ్డి దంపతుల కోసం అధికారులందరినీ ప్రాధేయపడ్డాం. వారి నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. మాతోపాటుగా జీవనోపాధికోసం వచ్చిన శ్రీలంక, ఫిలిప్పిన్స్ తదితర దేశాల ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారి ఎంబసీ అధికారులు తక్షణమే స్పందిస్తున్నారు. రంజాన్ మాసంలో నీళ్లు తాగారని తుపాకితో కాల్చి చంపారు. మహిళలకు వేధింపులు అధికంగా ఉన్నాయి. -
ఇద్దరు కూతుళ్లు సహా తల్లి ఆత్మహత్య
వరంగల్: ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లిని ఆత్మహత్యకు పురిగొల్పాయి. ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి, తనూ దూకింది. ఈ సంఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన గుండెబోయిన రాజు, హైమావతి(32) దంపతులకు ఇద్దరు కుమార్తెలు శివాని(10), శ్రావణి(8) ఉన్నారు. కొంతకాలంగా ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. రాజు మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో హైమావతి కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం కావటంతో ఆత్మహత్యనే శరణ్యమని భావించింది. కూతుళ్లను వెంటబెట్టుకుని సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. ఆత్మకూరు నుంచి పత్తిపాకకు వెళ్లే మార్గంలో వ్యవసాయబావిలో పిల్లలను తోసి తాను దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మంగళవారం ఆ బావిలో శ్రావణి మృతదేహం తేలటంతో ఘోరం వెలుగులోకి వచ్చింది. మృతిచెందిన ఇద్దరు చిన్నారులు చదువుల్లో ప్రతిభ కనబరిచే వారని ఉపాధ్యాయులు తెలిపారు. -
చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలి
నల్లగొండ అర్బన్: చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బత్తుల హైమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన ఐద్యా జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. మహిళలల్లో సైద్ధాంతిక కృషి పెంచటం కోసం శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టికల్ 15,16 ప్రకారం భారత రాజ్యాంగం స్త్రీలకు పురుషులతో సమానంగా అవకాశం కల్పించిందన్నారు. అయినా స్త్రీ రెండో తరగతి పౌరురాలిగా గుర్తిస్తున్నారని ఆవే వ్యక్తం చేశారు. మహిళలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. నిర్ణయాధికారం ఇంకా పురుషుల చేతుల్లోనే ఉందన్నారు. ఈ అధికారం మహిళలకు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా చైతన్యం వెల్లువిరిస్తే సాధికారత సాధించ వచ్చునని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు మల్లు లక్ష్మి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, ప్రభావతి, వై. లక్ష్మి, అరుణ, జి. పద్మ, విద్యావతి, ఇందిర, అనిల్, సైదమ్మ, క్రాంతిపద్మ, కృష్ణమోహిని, పద్మ తదితరులు పాల్గొన్నారు.