చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలి
నల్లగొండ అర్బన్: చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బత్తుల హైమావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన ఐద్యా జిల్లా విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. మహిళలల్లో సైద్ధాంతిక కృషి పెంచటం కోసం శిక్షణ తరగతులను ఏర్పాటు చేశామన్నారు. ఆర్టికల్ 15,16 ప్రకారం భారత రాజ్యాంగం స్త్రీలకు పురుషులతో సమానంగా అవకాశం కల్పించిందన్నారు.
అయినా స్త్రీ రెండో తరగతి పౌరురాలిగా గుర్తిస్తున్నారని ఆవే వ్యక్తం చేశారు. మహిళలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా, రాజకీయంగా సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. నిర్ణయాధికారం ఇంకా పురుషుల చేతుల్లోనే ఉందన్నారు. ఈ అధికారం మహిళలకు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళా చైతన్యం వెల్లువిరిస్తే సాధికారత సాధించ వచ్చునని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు మల్లు లక్ష్మి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొప్పని పద్మ, ప్రభావతి, వై. లక్ష్మి, అరుణ, జి. పద్మ, విద్యావతి, ఇందిర, అనిల్, సైదమ్మ, క్రాంతిపద్మ, కృష్ణమోహిని, పద్మ తదితరులు పాల్గొన్నారు.