భర్త వివాహేతర సంబంధం గుట్టురట్టు
మార్కాపురం : భర్త వివాహేతర సంబంధాన్ని భార్య బట్టబయలు చేసింది. ఓ మహిళతో ఇంట్లో ఉండగా కుమారుడు, కుమార్తెలతో పాటు బీజేపీ నాయకులతో కలిసి వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వివరాలు.. పట్టణంలోని శివాజీ నగర్ 5వ లైనులో నివాసం ఉంటున్న మేడవరపు శ్రీనివాసరావు తర్లుపాడు మండలం శీతానాగులవరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. దర్శికి చెందిన హైమావతితో 1997 మేలో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
హైమావతి స్థానిక ఏరియా వైద్యశాలలో కాంట్రాక్టు పద్ధతిన ఫార్మసిస్ట్‌గా పనిచేస్తోంది. కొన్నేళ్లుగా దంపతుల మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త తనతో కాపురం చేయకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉండగానే భర్త నివాసం ఉంటున్న ఇంటిపై నిఘా ఉంచింది. ఈ నేపథ్యంలో ఇంట్లో మరో మహిళ ఉన్నట్లు స్థానికుల నుంచి ఆమెకు సమాచారం అందింది.
బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఎం.లక్ష్మి, ఎన్.లక్ష్మి, ఆ పార్టీ నేత పయిడిమర్రి శ్రీనివాసరావు, తన ముగ్గురు పిల్లలతో కలిసి గురువారం వేకువ జామున 4 గంటల సమయంలో హైమావతి తన భర్త ఇంటికి వెళ్లింది. అక్కడికి వెళ్లిన వెంటనే విలేకరులకూ సమాచారం అందించింది. ఈమె వద్ద ఉన్న మరో తాళంతో తలుపు తీయగానే అప్పటి వరకూ భర్త శ్రీనివాసరావుతో ఉన్న మహిళ బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో హైమావతి తరఫు బంధువులు, శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ఘర్షణ జరిగింది.
న్యాయం చేయాలంటూ ధర్నా
తనకు న్యాయం చేయాలంటూ హైమావతి తన పిల్లలు హరికృష్ణ, ధరణి, ద్రాక్షయనిలతో కలిసి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి శ్రీనివాసరావును పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై ఇరువర్గాలు ఒకరిపై మరొకరు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. ఇంట్లో ఉన్న పనిమనిషితో తనకు వివాహేతర సంబంధం అంటగట్టారని శ్రీనివాసరావు విలేకరులకు తెలిపాడు. తన భర్త అసత్యం చెబుతున్నాడని, ఆయన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా తాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని హైమావతి కూడా వివరించింది.